పాత కరెన్సీ నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్‌ | old currancy notes changes gang arrest | Sakshi
Sakshi News home page

పాత కరెన్సీ నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్‌

Jul 13 2017 10:48 PM | Updated on Sep 5 2017 3:57 PM

పాత కరెన్సీ నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్‌

పాత కరెన్సీ నోట్ల మార్పిడి ముఠా అరెస్ట్‌

భారత ప్రభుత్వం రద్దు చేసిన పాత నోట్లను చెలామణి చేస్తున్న ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు.

రూ.కోటి పాత నోట్లు స్వాధీనం
– 11 మంది అరెస్ట్, నిందితుల్లో ఒకరు కానిస్టేబుల్‌
– ముందే వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’


అనంతపురం సెంట్రల్‌ : భారత ప్రభుత్వం రద్దు చేసిన పాత నోట్లను చెలామణి చేస్తున్న ముఠాను అనంతపురం పోలీసులు అరెస్ట్‌ చేశారు. 11 మంది నిందితులను అరెస్ట్‌ చేసి వారి నుంచి రూ.కోటి పాత కరెన్సీ, ఒక కారు, రెండు ద్విచక్ర వాహనాలు, 13 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ విషయాన్ని గురువారం ముందే ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చింది. నిందితుల వివరాలను స్థానిక పోలీసు కాన్ఫరెన్స్‌హాల్లో సీసీఎస్‌ డీఎస్పీ నాగసుబ్బన్న, అనంతపురం డీఎస్పీ మల్లికార్జనవర్మ సంయుక్తంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు.

ముఠా సభ్యులు వివరాలు
పెద్దవడుగూరు మండలం చిన్నవడుగూరు గ్రామానికి చెందిన తుత్తిరెడ్డి శర భారెడ్డి, బెంగళూరుకు చెందిన షేక్‌సాదిక్‌బాషా, తాడిపత్రి టౌన్‌కు చెందిన డాక్టర్‌ పందిర్లపల్లి సోమశేఖరరెడ్డి, అనంతపురం రూరల్‌ మండలం కందుకూరు గ్రామానికి చెందిన ధర్మవరం ఈశ్వరయ్య, నగరంలోని మారుతీనగర్‌కు చెందిన మునిశేషారెడ్డి, బుక్కరాయసముద్రం మండలం కొండాపురం గ్రామానికి చెందిన కానిస్టేబుల్‌(ప్రస్తుతం హిందూపురం వన్‌టౌన్‌లో విధులు) గుద్దిలి ఆంజనేయులు(పీసీ నెంబర్‌ 1565), కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన షేక్‌నాసర్‌వలి, తాడిపత్రి టౌన్‌కు చెందిన అనకల శ్రీనివాసకుమార్, కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన గంగాధర్, బెంగళూరుకు చెందిన రామేగౌడ, నగరంలో వెంకటేశ్వరనగర్‌కాలనీకి చెంది చిగిచేర్ల ఓబిలేసు ముఠాగా ఏర్పడ్డారు. ఓబిలేసు నివాసముంటున్న వెంకటేశ్వరనగర్‌లోని ఇంటిని కేంద్రంగా చేసుకొని పాత కరెన్సీ నోట్ల మార్పిడికి ప్రణాళికలు రచించారు. విషయం తెలుసుకున్న పోలీసులు 11 మంది ముఠా సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.
 
నేపథ్యం
ముఠాలో తుత్తిరెడ్డి శర భారెడ్డి కీలక నిందితుడు. గతంలో ఈయన కాంట్రాక్టర్‌గా పనిచేసేవాడు. ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న రూ. కోటి పాత కరెన్సీ ఇతనివే. ఇతని మామ కాసేపల్లి కృష్ణారెడ్డి తన భూమిని గతంలో అమ్మి ఆ డబ్బును తనవద్దే రహస్యంగా దాచుకున్నాడు. ఆయన చనిపోయాక అల్లుడైన శరభారెడ్డికి తెలిసింది. అప్పటికే పాతనోట్లు రద్దు చేశారు. ఈ పరిస్థితుల్లో తన మామ దాచిన పాత నోట్లను ఎలాగైనా మార్చుకోవాలని భావించాడు. ఎన్‌ఆర్‌ఐ కోటాలో మార్పిడి చేస్తే 80శాతం కరెన్సీ ఇప్పిస్తానని డాక్టర్‌ సోమశేఖరరెడ్డితో నమ్మబలకాడు. అయితే ఆయనకు చేత కాకపోవడంతో షేక్‌నాసర్‌వలీని సంప్రదించాడు. అతని నుంచి ధర్మవరం ఈశ్వరయ్య, కానిస్టేబుల్‌ ఆంజనేయులుకు వివరించారు. వీరంతా కలిసి బెంగళూరుకు చెందిన గార్మెంట్‌ పరిశ్రమ నిర్వాహకుడు షేక్‌ సాదిక్‌బాషాను సంప్రదించి 35శాతం కమీషన్‌ ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

అందులో 5శాతం ముఠాసభ్యులు, మిగతా 30శాతం శరబారెడ్డి తీసుకునేలా నిర్ణయించారు. ఈ క్రమంలో బెంగళూరు నుంచి షేక్‌సాదిక్‌బాషా, ఆయన డ్రైవర్‌ రామేగౌడ ఒక కారులో స్థానిక వెంకటేశ్వరనగర్‌లో ఉన్న చిగిచేర్ల వెంకటేశులు ఇంటికి చేరారు. తుత్తిరెడ్డి శరబారెడ్డి, పందిర్లపల్లి సోమశేఖరరెడ్డి, ధర్మవరం ఈశ్వరయ్య, మునిశేషారెడ్డి, అనకల శ్రీనివాస్‌కుమార్, గాదంశెట్టి గంగాధర్, కానిస్టేబుల్‌ ఆంజనేయులు కోటి రూపాయల పాత కరెన్సీ నోట్లను జిల్లా కేంద్రానికి తీసుకొచ్చారు. గురువారం కరెన్సీని బెంగళూరుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నింస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో బెంగళూరుకు చెందిన మరో కీలక నిందితుడు మనోహర్‌రెడ్డి పరారీలో ఉన్నారని డీఎస్పీలు వివరించారు. కానిస్టేబుల్‌పై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున నకలీ కరెన్సీని పట్టుకున్న డీఎస్పీలు, సీఐలు ఆంజనేయులు, ఇస్మాయిల్, సాయిప్రసాద్, ఎస్‌ఐలు చలపతి, కలాకర్‌బాబు, దాదాపీర్, హెడ్‌కానిస్టేబుల్స్‌ చెన్నయ్య, మహబూబ్‌బాషా, చిదంబరయ్య, నాగరాజు, కానిస్టేబుల్స్‌ రంజిత్, సుధాకర్, క్రిష్ణానాయక్, షాజాద్‌బాషా, హోంగార్డు లక్ష్మిరెడ్డిలను ఎస్పీ జీవీజీ అశోక్‌కుమార్‌ అభినందిస్తూ రివార్డులు ప్రకటించారని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement