టీడీపీ కార్యాలయం కోసం ఇళ్లు ఖాళీ! | Sakshi
Sakshi News home page

టీడీపీ కార్యాలయం కోసం ఇళ్లు ఖాళీ!

Published Sat, Feb 6 2016 3:20 PM

టీడీపీ కార్యాలయం కోసం ఇళ్లు ఖాళీ! - Sakshi

-- ఈఈని కలిసిన చిలకలూరిపేట ఎన్‌ఎస్‌పి ఉద్యోగులు
-- ఇళ్లకు నీళ్ళు, కార్యాలయానికి కరెంట్ నిలిపివేత
-- ఇళ్లు ఖాళీ చేయాలంటూ ఉద్యోగులకు బెదిరింపులు
-- మీరే పరిష్కరించుకోవాలంటున్న ఉన్నతాధికారులు


నరసరావుపేట రూరల్‌ (గుంటూరు) : తెలుగుదేశం పార్టీ కార్యాలయం కోసం తమను ఇళ్లు ఖాళీ చేయాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని చిలకలూరిపేటలోని ఎన్‌ఎస్‌పి ఓఅండ్‌ఎమ్ క్యాంప్ కాలనీ వాసులు లింగంగుంట్ల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ యం.ఆర్ మోహిద్దీన్‌కు శనివారం మొరపెట్టుకున్నారు. ఏపీ ఇరిగేషన్ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులతో కలసి భాధితులు శనివారం ఈఈని కలిసారు.

ఎన్‌ఎస్‌పి ఓఅండ్‌ఎమ్ సెక్షన్‌లో పనిచేస్తున్న 10 కుటుంబాలవారు క్యాంప్ కాలనీలో అనేక ఏళ్ళగా నివసిస్తున్నామని తెలిపారు. కాగా ఈ నెలలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన ఉందంటూ క్యాంప్ ఆవరణలో నిర్మాణాలు చేపడుతున్నారని వివరించారు. ఇప్పటికే డ్రెయిన్‌లతో పాటు పైలాన్ నిర్మాణం జరుగుతుందని పేర్కొన్నారు. తాము నివసిస్తున్న ఇళ్ళను కూల్చివేస్తామని, ఖాళీ చేయాలని బెదిరిస్తున్నరని తెలిపారు. ఇళ్ళకు తాగునీరు సరఫరాతో పాటు కార్యాలయానికి కరెంటు కట్‌చేసినట్టు పేర్కోన్నారు. దీంతో కాలనీలో నివసించే కుటుంబాలు బిక్కుబిక్కుమంటూ గడపుతున్నట్టు వివరించారు.

ఎన్‌ఎస్‌పికి చెందిన స్థలంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిసిందన్నారు. దీనిని అధికారుల దృష్టికి తీసుకువచ్చినా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని వివరించారు. తమ జీతంలో ప్రతి నెలా  ఇంటి అద్దెను మినహాయిస్తున్నారని తెలిపారు. ఎన్‌ఎస్‌పి స్థలంలో ఎటువంటి ఆధారాలు లేకుండా ఎలా నిర్మాణాలు చేపడతారని ప్రశ్నించారు. పార్టీ కార్యాలయం కోసం మమ్మల్ని రోడ్లు పాలు చేస్తున్నారంటూ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. విద్యా సంవత్సరం మధ్యలో ఉన్న సమయంలో ఇళ్లు ఖాళీ చేయమంటే ఎక్కడకు వెళ్ళాలో అర్ధంకావడం లేదన్నారు.

దీనిపై స్పందించిన ఈఈ చిలకలూరిపేట మున్సిపల్ కమిషనర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అధికారులతో చర్చించి సమస్యను మీరే పరిష్కరించుకోవాలంటూ ఆయన యూనియన్ నాయకులకు సలహా ఇచ్చాడు. ఈ సందర్బంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ.. తమ శాఖల నుండి ఎటువంటి ఉత్తర్వులు లేకుండా ఇండ్లను ఎలా ఖాళీ చేయించుతారని వారు ప్రశ్నించారు. మున్సిపాలిటి చేపట్టిన పనులను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10వ తేదీలోపు తమ సమస్యను పరిష్కరించాలని లేకుంటే ఎన్‌జీవొ నాయకులతో కలసి ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో యూనియాన్ నాయకులు ఎన్.నాగరాజు, సి.కొండారెడ్డి, యం.మరియదాసు, ఎ.శివ, కోటిరెడ్డి, బండి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement