‘ఏకరూప’త ఏదీ? | no more school dress distribution this educational year | Sakshi
Sakshi News home page

‘ఏకరూప’త ఏదీ?

Jun 23 2016 1:52 AM | Updated on Jul 26 2019 6:25 PM

‘ఏకరూప’త ఏదీ? - Sakshi

‘ఏకరూప’త ఏదీ?

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం. ఫలితాలే కాదు వసతులు, పాఠ్యాంశాల బోధన.. ఇలా ఎందులోనూ తేడా రాకుండా చూస్తాం...

యూనిఫారాలకు పంపని ప్రతిపాదనలు
పాత దుస్తులతోనే విద్యార్థుల బడిబాట
ప్రైవేటుతో పోటీ అంటే ఇదేనా?

ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతాం. ఫలితాలే కాదు వసతులు, పాఠ్యాంశాల బోధన.. ఇలా ఎందులోనూ తేడా రాకుండా చూస్తాం... అంటూ ప్రభుత్వం ప్రకటనలు గుప్పించింది. అయితే ఇవన్నీ ఒట్టిమాటలేనని తేలిపోయింది. పాఠశాలలు పునఃప్రారంభమైనా ఇప్పటివరకు యూనిఫారాలకే దిక్కులేదు. క్రమశిక్షణతోపాటు పాఠశాలలో చదివే పిల్లలంతా సమానమని తెలియజేసే ఏకరూప దుస్తుల పంపిణీ ముచ్చటే లేదు. ఇప్పటివరకు ప్రతిపాదనలే సిద్ధం కాలేదంటే అవి ఎప్పుడు వస్తాయో ఎవరికి తెలియని పరిస్థితి. యూనిఫారాల వద్దే విద్యాశాఖ బోల్తా పడిందంటే మిగతా విషయాల్లో ప్రైవేట్, కార్పొరేట్ స్కూళ్లకు ఎక్కడ పోటీపడుతుందో పాలకులకు, అధికారులకే తెలియాలి.

సంగారెడ్డి మున్సిపాలిటీ: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 3.50 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇందుకుగాను 7 లక్షల యూనిఫారాలు అవసరం ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ఏటా జూన్ 12లోగా స్కూల్ యూనిఫారాల వివరాలను తీసుకునేది. కానీ తొలిసారిగా జూన్ ఒకటి నుంచే స్కూలు యూనిఫారాలు ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు గతంలో రెండోతరగతి నుంచి ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు మాత్రం స్కూలు యూనిఫారాలను  ప్రభుత్వం ఇచ్చేది. కానీ తాజాగా ఒకటో తరగతి నుంచి పదోతరగతి వరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు యూనిఫారాలను ఇవ్వాలనే నిర్ణయం తీసుకుంది. జిల్లాలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారనే విషయమై అధికారులు ఇంతవరకు అంచనాకు రాలేకపోయారు. ఎన్ని యూనిఫారాలు అవసరమో కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేని పరిస్థితి నెలకొంది. 

గత ఏడాది 2.54 లక్షల మంది విద్యార్థులకు 5.09 లక్షల యూనిఫారాలు అందజేయడానికి అవసరమైన క్లాత్ సరఫరా కోసం ఆప్కోకు అనుమతి ఇచ్చింది. క్లాత్‌ను సరఫరా చేసిన అనంతరం స్థానిక మహిళా సంఘాలు, పలు ప్రైవేటుఏజెన్సీలకు కుట్టడానికి ఇచ్చారు. కానీ ఈ విద్యా సంవత్సరం మాత్రం అధికారులు కనీసం యూనిఫారాలకు సంబంధించి ఎంతమంది విద్యార్థులు ఉన్నారు?, క్లాత్ ఎంత అవసరం అనే ప్రతిపాదనలు సిద్ధం చేయలేకపోయారు.

మరో వైపు గత ఏడాది మాదిరిగానే రెండోతరగతి నుంచి ఎనిమిదో తరగతి వరకు 2.17 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని, వారికి స్కూలు యూనిఫారాలు సరఫరా చేయడం కోసం ప్రతిపాదనలు తయారు చేసిన ప్రభుత్వం ఈసారి ఒకటో తరగతి విద్యార్థులకు కూడా యూనిఫారాలు ఇవ్వాలనే నిర్ణయం తీసుకోవడంతో ప్రతిపాదనలు పంపలేకపోయామని రాజీవ్ విద్యామిషన్ కార్యాలయ అధికారి ఒకరు తెలిపారు. మొత్తంగా ఏటా పాఠశాలలు పునఃప్రారంభం కాగానే కొత్త పాఠ్యపుస్తకాలతోపాటు స్కూల్ యూనిఫారాలు అందజేసేది. ఈ సారి మాత్రం కనీసం ఎన్ని యూనిఫారాలు అవసరమున్నాయో కూడా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపలేకపోయారు. దీంతో పాత దుస్తులతోనే విద్యార్థులు బడిబాట పట్టారు. ఈ విషయంపై ఆర్వీఎం పీఓ యాస్మిన్ బాషాను వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆమె అందుబాటులోకి రాలేకపోయారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement