నా కొడుకును చంపేశారు..

నా కొడుకును చంపేశారు..


కార్పొరేట్‌ పాఠశాలల్లో ఎస్టీలు చదువుకోవడమే నేరమా..?

నారాయణ స్కూల్లో మృతి చెందిన విద్యార్థి తండ్రి ఆక్రోశం

స్కూల్‌ వద్ద విద్యార్థుల ఆందోళన, చితకబాదిన పోలీసులు

ధర్నాకు మద్దతు ప్రకటించిన వైఎస్సార్సీపీ, ఎస్టీ విద్యార్థి సంఘాల నేతలు

ఎస్వీ మెడికల్‌ కళాశాలలో ముగిసిన పోస్టుమార్టం




‘‘ నాన్నా.. అక్క ఎంబీబీఎస్‌ చదువుతోంది కదా.. నేను కూడా ఆ కోర్సులోనే చేరుతాను. మంచిడాక్టర్‌గా పేదలకు సేవలందిస్తాను. అదే నాలక్ష్యం అంటూ నిత్యం మాతో చెప్పేవాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఒక్కగానొక్క కొడుకు ఇలా మమ్మల్ని అర్ధాంతరంగా వదలి కాటికి వెళ్లిపోతాడనుకోలేదే.. ఇంక మాకు దిక్కెవరురా దేవుడా..’’  అంటూ నారాయణ స్కూల్లో మృతి చెందిన కొడుకును చూసి ఆ తండ్రి రోదించిన తీరు ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది.



తిరుపతి క్రైం, మెడికల్‌: కార్పొరేట్‌ స్కూళ్లలో విద్యార్థులపై వేధింపుల పరంపర కొనసాగుతోంది. వివరాల్లోకి వెళితే.. మున్సిపల్‌శాఖ> మంత్రి నారాయణకు తిరుపతి రూరల్, శ్రీనివాస మంగాపురం సమీపంలో ‘నారాయణ ఒలంపియాడ్‌ స్కూల్‌’ ఉంది. ఈ స్కూల్లో అనంతపురానికి చెందిన ఏఆర్‌ కానిస్టేబుల్‌ మోహన్‌ కృష్ణ కొడుకు సాయిచరణ్‌ నాయక్‌ (16) పదవ తరగతి చదువుతున్నాడు. చదువులో ఎంతో చురుగ్గా ఉండే సాయిచరణ్‌ ఈనెల 17వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పబ్లిక్‌ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఈ నేపథ్యంలో సోమవారం రాత్రి అనుమానాస్పదంగా సాయిచరణ్‌ నాయక్‌ మృతి చెందడం తల్లిదండ్రులతో పాటు  విద్యార్థి లోకాన్ని కలవరపాటుకు గురిచేసింది.



ఏం జరిగిందో తెలుసుకునేందుకు అనంతపురం నుంచి హుటాహుటిన తిరుపతికి వచ్చిన ఆ తండ్రికి కళ్లముందు గాయాలతో జీవచ్ఛవంలా పడి ఉన్న కొడుకును చూసి షాక్‌కు గురయ్యాడు. తన బిడ్డను కుల వివక్షతోనే  పాఠశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ పొట్టన పెట్టుకున్నాడంటూ స్విమ్స్‌ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగాడు. అంకుల్‌ మీ అబ్బాయిని మా వైస్‌ ప్రిన్సిపాల్‌ అంజిరెడ్డి సార్‌.. కర్రలు, రాడ్, చెప్పులతో కొట్టాడని తోటి విద్యార్థులు చెబుతున్నారు.



రాత్రి ఫోన్‌లో నా బిడ్డతో మాట్లాడినప్పుడు కూడా నాన్నా నన్ను మా వైస్‌ ప్రిన్సిపాల్‌ కర్రలు, రాడ్‌లతో కొడుతున్నాడు, నావల్ల కావడం లేదు వచ్చి తీసుకెళ్లిపో.. అంటూ రోదించాడని బాధిత తండ్రి విలేకరుల ఎదుట కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం సాయంత్రం 6 గంటలకు నారాయణ ఒలంపియాడ్‌ క్యాంపస్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ అంజిరెడ్డి, అతని భార్య ఇద్దరు కలిసి ఒక్కసారిగా తనబిడ్డను చితకబాదినట్టు ఆరోపించారు. ఈ విషయంపై తనకు ఫోన్‌లో సమాచారం అందించడంతో.. మరోసారి దాడిచేసినట్లు చెప్పారు. తర్వాత రాత్రి 9.15 గంటలకు వైస్‌ ప్రిన్సిపాల్‌ ఫోన్‌ చేసి మీ బిడ్డ కాలు జారి పడ్డాడు మీరు రండి అని చెప్పినట్టు తెలిపారు. తీరా తిరుపతికి వచ్చి చూస్తే తన బిడ్డ గాయాలతో మృతి చెంది ఉన్నాడని వాపోయారు.



విద్యార్థుల ఆగ్రహం..

సహచర విద్యార్థి మృతిపై నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన రోడ్డుపై వందలాది మంది విద్యార్థులు బైఠాయించి పాఠశాల యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విద్యార్థుల ధర్నాకు వైఎస్‌ఆర్‌సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్‌ రెడ్డి, సురేష్‌ నాయక్, కిషోర్, నరేంద్ర, హేమంత్, మునికుమార్, ఎస్టీ విద్యార్థి విభాగం నాయకులు అక్కులప్ప నాయక్‌ మద్దతు పలికారు. వీరిని పోలీసులు ముంద జాగ్రత్తగా అరెస్టు చేసి, ఆపై విడుదల చేశారు. అనంతరం వైఎస్‌ఆర్‌ సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్‌ ఆధ్వర్యంలో విద్యార్థి సంఘాల నాయకులు ఎమ్మార్‌ పల్లి పోలీసు స్టేషన్‌ వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత రెండళ్ల కాలం లో తిరుపతి నారాయణ కళాశాల, స్కూల్లో వేధింపులు తాళలేక ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు. కాగా విద్యార్థి తండ్రి మోహన్‌కృష్ణ గతంలో సినీ హీరో బాలకృష్ణకు గన్‌మన్‌గా కొంతకాలం పనిచేసినట్లు సమాచారం.



రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలి - వైఎస్సార్సీపీ

సాయి చరణ్‌ నాయక్‌ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు హనుమంతప్ప నాయక్, శ్యామల, ఇమామ్, నరేంద్ర, బాలిశెట్టి కిశోర్, లక్ష్మీపతి, పెరుగు బాబూ యాదవ్‌ ఆధ్వర్యంలో కార్యకర్తలు స్విమ్స్‌ వద్ద ధర్నా చేశారు. మృతుడికి కుటుంబానికి ప్రభుత్వం రూ.50 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా నారాయణ విద్యాసంస్థ గుర్తింపు రద్దు చేసి, మంత్రి వర్గం నుంచి నారాయణను బర్తరఫ్‌ చేయాలన్నారు.



వైస్‌ ప్రిన్సిపాల్‌ అంజిరెడ్డిపై కేసు నమోదు

నారాయణ ఒలంపియాడ్‌ స్కూల్‌ వైస్‌ ప్రిన్సి పాల్‌ అంజిరెడ్డిపై ఎంఆర్‌పల్లి సీఐ మధు మంగళవారం కేసు నమోదు చేశారు. సీఐ మాట్లాడుతూ సాయిచరణ్‌ నాయక్‌ను కొట్టి, ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు మృతుడి తండ్రి మోహన్‌కృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు 302 సెక్షన్‌ కింద హత్య కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అదేవిధంగా కులం పేరుతో దూషించినందుకు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్టు పేర్కొన్నారు. అయితే నిందితుడు పరారీలో ఉన్నాడని, త్వరలోనే పట్టుకుని అరెస్టు చేస్తామని తెలిపారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top