సాక్షి, తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవీఎస్‌వో సతీష్ అనుమానాస్పద రీతిలో మృతి చెందారు. అనంతపురం జిల్లా తాడిపత్రి సమీపంలోని కోమలి రైల్వే ట్రాక్‌పై విగతజీవిగా పడి కనిపించారు.
పరకామణి కేసులో విదేశీ డాలర్లను దొంగతనం చేసిన రవికుమార్‌పై అప్పట్లో ఏవీఎస్వో సతీశ్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసును గతంలో విచారించిన సతీష్‌ను.. ఆపై నిందితుడిగా సిట్ పేర్కొంది. ఈ నేపథ్యంలో.. ప్రస్తుతం గుంతకల్ రైల్వే ఆర్‌ఐగా పని చేస్తున్న ఆయన్ని ఈ నెల 6వ తేదీన సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ బృందం విచారణ జరిపింది. అయితే..
మరోసారి విచారణకు రావాలంటూ అధికారులు ఆయనకు నోటీసులు పంపించారు. దీంతో వేధింపులు భరించలేకే ఆయన ఆత్మహత్య చేసుకుని ఉంటారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సతీష్‌ను వేధించారు: వైఎస్సార్‌సీపీ
సతీష్ కుమార్ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయని అంటున్నారు వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి సాకే శైలజానాథ్. ‘‘పరకామణి కేసులో రవికుమార్ ని పట్టుకున్నదే సతీష్ కుమార్. అలాంటి వ్యక్తి చనిపోవడం అనుమానాస్పదంగా ఉంది. సతీష్ మృతిపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరపించాలి. వాస్తవాలు ఏంటో బయటి ప్రపంచానికి తెలియచేయాలి.

సతీష్‌ను వేధించారు. భూమన కరుణాకరరెడ్డిని ఆ కేసులో లాగాలని సతీష్ పై ఒత్తిడి చేశారు. వెంకటేశ్వరస్వామిని రాజకీయాలలో కి లాగటం బాధాకరం. ఈ కేసులో ఏ స్థాయిలో ఒత్తిడి ఉంటే సతీష్ ఆత్మహత్య చేసుకున్మాడో అర్థం చేసుకోవచ్చు. తనపై తీవ్రస్థాయిలో ఒత్తిడి ఉందని సతీష్ కుమార్ తన ఫ్రెండ్స్ దగ్గర చాలా సార్లు చెప్పారు. నాలుగు రోజుల సతీష్ విచారణ లో ఏం జరిగిందో బయట పెట్టాలి. వ్యవస్థలు నిష్పక్షపాతంగా వ్యవహరించాలి’’ అని శైలజానాథ్ డిమాండ్ చేశారు.


