వంద శాతం పూర్తి చేయాలి
అన్ని గ్రామాల్లో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేసి నిజామాబాద్‌ను బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ యోగితారాణా సూచించారు
డిచ్‌పల్లి: అన్ని గ్రామాల్లో వంద శాతం వ్యక్తిగత మరుగుదొడ్లు పూర్తి చేసి నిజామాబాద్‌ను బహిరంగ మల విసర్జన లేని జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ యోగితారాణా సూచించారు. డిచ్‌పల్లి ట్రైజం ట్రైనింగ్ సెంటర్‌లో సోమవారం నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ, బాన్సువాడ నియోజకవర్గాలకు చెందిన 17 మండలాల సీఆర్‌పీలు, ఎన్‌పీఎం సీఏ లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆయా మండలంలోని ఎంపిక చేసిన గ్రామ పంచాయతీ పరిధిలో సీఆర్‌పీలు, సీఏలు, గ్రామస్థాయి అధికారులతో కలిసి 5 రోజులు ఉండి సెప్టెంబర్ 15 నాటికి వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పూర్తి అయ్యేలా కృషి చేయాలన్నారు. ఇప్పటికే నిర్మించుకున్న మరుగుదొడ్లను వాడుకునేలా ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రామ సంఘం అధ్యక్షుల దగ్గర కచ్చితంగా ఐదు రోజులు ఉండి వ్యక్తిగత మరుగుదొడ్లు, హరితహారం, ప్రభుత్వ పాఠశాలల ఆవరణలో నాటిన మొక్కల నివేదికలను రూపొందించాలన్నారు. అలాగే గర్భిణులు ప్రభుత్వ ఆస్పత్రులలోనే ప్రసవం అయ్యేలా చూడాలని, మార్పు ప్రతి కుటుంబంలో వచ్చే విధంగా మహిళా సంఘాల అధ్యక్షులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఐకేపీ ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రమోహన్‌రెడ్డి, డీపీఎంలు సంధ్యారాణి, మారుతి, ఏపీఎంలు హిమబాల, సత్యనారాయణ, ప్రసన్న, సీఆర్‌పీలు, ఎన్‌పీఎం సీఏలు తదితరులు పాల్గొన్నారు.