రెండేళ్ల క్రితం నమోదైన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
కడప అర్బన్ : రెండేళ్ల క్రితం నమోదైన హత్య కేసు మిస్టరీని పోలీసులు ఎట్టకేలకు ఛేదించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కడప రిమ్స్ పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ మోహన్‌ప్రసాద్, ఎస్‌ఐ రామాంజనేయులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కనుమలోపల్లె రైల్వే ట్రాక్ సమీపంలో 2014 అక్టోబరు 13న ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని రైల్వే పోలీసులు కేసు నమోదు చేశారు. మరసటిరోజు అతను అట్లూరు మండలం రెడ్డిపల్లెకు చెందిన వెంకటరమణ (35)గా గుర్తించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని కేసు నమోదు చేశారు. అతని స్నేహితుడు విష్ణువర్దన్ హత్య చేసి ఉంటాడని మృతుని తల్లిదండ్రులు అనుమానం వ్యక్తం చేశారు. ఈ దిశగా రిమ్స్ పోలీసులు దర్యాప్తు చేశారు. కాల్ డేటా ఆధారంగా విచారణ చేపట్టడంతో మొత్తం విషయం వెలుగు చూసింది. బద్వేలు ప్రాంతానికి చెందిన ఈశ్వరమ్మ తన భర్త నిరాదరణకు గురి చేశాడని కుమార్తె గాయత్రితో కలిసి వేరుగా నివసిస్తోంది. ఆమెతో అట్లూరు మండలం రెడ్డిపల్లెకు చెందిన సి.విష్ణువర్దన్ పరిచయమై సహజీవనాన్ని కొనసాగించాడు. ఈ క్రమంలో వెంకటరమణకు విష్ణువర్దన్ సమక్షంలోనే ఈశ్వరమ్మ పరిచయమైంది. వీరి మధ్య పరిచయం సహజీవనానికి దారి తీసింది. 2014 అక్టోబరు 13న రాత్రి విష్ణువర్దన్, అతని స్నేహితుడు నరసయ్య.. వెంకటరమణను రైల్వే ట్రాక్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ వారు మద్యం తాగారు. అంతకుముందే పథకం ప్రకారం ముళ్ల పొదల్లో దాచి ఉంచిన రాడ్డుతో వెంకటరమణ తలపై చితకబాది దారుణంగా హత్య చేశారు. రైలు పట్టాలపై పడేయాలని ప్రయత్నించారు. అంతలోపే రైలు రావడంతో మృతదేహాన్ని అక్కడే పడేసి పరారయ్యారు. విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు.