అత్తారింటికి వెళ్లిన కాసేపట్లోనే... | married woman committed suicide | Sakshi
Sakshi News home page

అత్తారింటికి వెళ్లిన కాసేపట్లోనే...

Jul 7 2016 9:40 PM | Updated on May 10 2018 12:34 PM

అత్తారింటికి వెళ్లిన కాసేపట్లోనే... - Sakshi

అత్తారింటికి వెళ్లిన కాసేపట్లోనే...

ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణనగర్‌లో బుధవారం మధ్యాహ్నం వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది.

చిత్తూరు జిల్లా : ఎమ్మార్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని శ్రీకృష్ణనగర్‌లో బుధవారం మధ్యాహ్నం వరకట్న వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. వెస్టు డీఎస్పీ కనకరాజు, ఎమ్మార్‌పల్లి సీఐ మధు కథనం మేరకు...తిరుపతి రూరల్ మండలం తనపల్లి పంచాయతీ నల్లమానుకాలువ గ్రామానికి చెందిన జ్యుడిషియల్ ఉద్యోగి కుమారస్వామిరెడ్డి, ప్రశాంతి దంపతుల కుమార్తె దివ్య(25)ను ఐదేళ్ల క్రితం తిరుపతికి చెందిన శివకుమార్‌రెడ్డి, యశోదమ్మ దంపతుల కుమారుడు శశికాంత్‌రెడ్డికి ఇచ్చి పెళ్లి చేశారు.
 
వీరికి మోహిత్ అనే మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. వీరి కాపురం కొన్నేళ్లు సజావుగా సాగింది. కొద్ది రోజులుగా శశికాంత్‌రెడ్డి కట్నం తీసుకురమ్మని భార్యను వేధించసాగాడు. అవి ఎక్కువ కావడంతో బుధవారం మధ్యాహ్నం ఆమె ఇంట్లో ఉరేసుకుని మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎస్వీ మెడికల్ కళాశాలకు తరలించారు.

 భర్త, అత్త చంపారు
దివ్యను ఆమె భర్త, అత్త ఇద్దరూ కలిసి చంపేశారని మృతురాలి తల్లిదండ్రులు, బంధువులు ఆరోపించారు. బుధవారం ఉదయం మా ఇంటికొచ్చి మాతో సంతోషంగా గడిపిందని, మధ్యాహ్నం అత్తారింటికి వెళ్లిన కాసేపట్లోనే శవంగా మారిందని వాపోయారు. వరకట్నం తీసుకురాలేదన్న కోపంతోనే తమ బిడ్డను చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, బంధువుల ఫిర్యాదు మేరకు సీఐ మధు వరకట్న వేధింపుల కింద భర్త, అత్తపై కేసు నమోదు చేశారు. వెస్టు డీఎస్పీ కేసు దర్యాప్తు చేపట్టారు.
 

Advertisement
 
Advertisement
Advertisement