కుప్ప‘కూలి’న జీవితం | man dies of roof fall | Sakshi
Sakshi News home page

కుప్ప‘కూలి’న జీవితం

Jul 4 2017 10:52 PM | Updated on Sep 5 2017 3:12 PM

కుప్ప‘కూలి’న జీవితం

కుప్ప‘కూలి’న జీవితం

పాత మిద్దెను కూల్చేందుకు వెళ్లిన కూలీ జీవితం అర్ధంతరంగా ముగిసింది. పైకప్పు కూలడంతో మృత్యుఒడి చేరాడు.

కదిరి : పాత మిద్దెను కూల్చేందుకు వెళ్లిన కూలీ జీవితం అర్ధంతరంగా ముగిసింది. పైకప్పు కూలడంతో మృత్యుఒడి చేరాడు. యజమాని మృతితో కుటుంబం వీధినపడింది. కదిరి పట్టణంలో మంగళవారం ఈ ఘటన జరిగింది. స్థానికులు తెలిపిన మేరకు.. కదిరి మండలం సున్నపుగుట్ట తండాకు చెందిన రాములునాయక్‌ (60) కూలీ. మంగళవారం ఉదయం కదిరి పట్టణంలోని జౌకపాళ్యం వీధిలో పాత ఇంటిని కూల్చేందుకు తోటికూలీలతో కలిసి వెళ్లాడు. పనులు ముగించుకొని కూలి డబ్బులు కూడా తీసుకొని కూలీలందరూ ఇంటిముఖం పట్టారు.

ఇంతలో ఏమి గుర్తొచ్చిందో తెలియదు కానీ మళ్లీ వస్తానంటూ రాములునాయక్‌ తిరిగి ఇంటిని కూల్చిన ప్రదేశానికి వెళ్లి ఏదో వెదకడం ప్రారంభించాడు. ఇంతలో ఆ పక్కనే ఉన్న మరో పాడుబడిన ఇంటిపైకప్పు రాతికూసం కూలి ఆయన తలపై పడింది. అక్కడే కుప్పకూలి స్పృహ లేకుండా పడిపోయాడు. ఎంతసేపటికీ తిరిగిరాకపోయేసరికి తోటి కూలీలు వచ్చి చూశారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆయన్ను ఆటోలో ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యం అందించే లోపే రాములునాయక్‌ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి ఆస్పత్రికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను ఓదార్చారు. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

ఇక మాకు దిక్కెవరయ్యా..
‘ఓరి భగవంతుడా.. మా ఆయన ఏమి తప్పు చేశాడయ్యా.. మాకు ఇంత శిక్ష విధించావు.. మీకు మా ఇంటాయన ప్రాణాలే కావాల్సి వచ్చాయా.. ఇక మాకు దిక్కెవరయ్యా’ అంటూ రాములునాయక్‌ భార్య సరోజీబాయి ప్రభుత్వాస్పత్రిలో రోదించింది. అందరివైపు చూస్తూ ఇక మా ఆయన లేడయ్యా.. అంటూ కన్నీటిపర్యంతమయ్యింది.

Advertisement
Advertisement