తలుపులమ్మా... నిజం తలుపుతీయమ్మా !


దైవభక్తి కన్నా దేహభక్తి పెరిగితే  స్వాహా రాయుళ్లదే రాజ్యం. వీరికి రాజకీయ అండ తోడైతే దేవతనే బేఖాతరు చేసి గుడిని, గుడిలో లింగాన్ని మింగేస్తారు. తలుపులమ్మ లోవలో ఇదే జరుగుతోంది. ఆది నుంచీ వరుస కథనాలతో ‘సాక్షి’ అక్కడ జరుగుతున్న అవినీతిని బహిర్గతం చేయడంతో స్పందించిన అధికారులకు కూడా అడ్డుతగిలి దర్యాప్తు సాగనివ్వడం లేదు.


  • ‘సాక్షి’ కథనాలతో అక్రమాలు వెలుగులోకి

  • దర్యాప్తునకు ఆదేశించిన ఉన్నతాధికారులు

  • విచారణకు మోకాలొడ్డుతున్న తెలుగు తమ్ముళ్లు

  • ఆదేశాలిచ్చి పది రోజులవుతున్నా ముందుకుపడని అడుగులు

  • కోటి మింగేసినా కప్పదాట్లే

సాక్షి ప్రతినిధి, కాకినాడ :

తలుపులమ్మ లోవ దేవస్థానంలో అక్రమార్కులకు తెలుగు తమ్ముళ్లు కొమ్ముగాస్తున్నారు. తమ్ముళ్ల అండ చూసుకునే పేట్రేగిపోయి అమ్మవారి ఖజానాకు లక్షల్లో   శఠగోపం పెట్టగలిగారు. మూడేళ్లుగా ఆలయంలో దుకాణాల లీజు సొమ్ములు లక్షల్లో జమకాకున్నా పట్టించుకోలేదంటేనే ఏ స్థాయిలో అక్రమార్కులతో కలిసిపోయారో ఇట్టే అర్థమైపోతోంది. తీగ లాగితే డొంక కదిలిందన్నట్టు రూ.14 లక్షలతో కొండపైకి వెళ్లే రోడ్డు పనులను ఈఓకు సైతం తెలియకుండా చేపట్టిన వ్యవహారాన్ని ’సాక్షి’ గత నెల 20న పక్క’దారి’పనులు శీర్షికన వెలుగులోకితేగా సూపరింటెండెంట్, వర్క్‌ ఇ¯ŒSస్పెక్టర్లను సస్పెండ్‌ చేసిన సంగతి తెలిసిందే.   ఈ నెల 6న ‘కోటిన్నరకు కన్నం’ శీర్షికన దుకాణాల లీజు వ్యవహారాల్లో కోటిపైగా నొక్కేసిన భాగోతాన్ని వెలుగులోకి తెచ్చింది. వరుస కథనాల నేపథ్యంలో ఇ¯ŒSఛార్జి సూపరింటెండెంట్‌ ఎస్‌. శ్రీనివాసరావుపై శాఖాపరంగా సమగ్ర విచారణ చేపట్టాలని దేవాదాయశాఖ కమిషనర్‌కు ఆలయ ఈఓ చంద్రశేఖరరరావు లేఖ పంపించారు. జిల్లాలోని కొత్తపేట మందపల్లి ఈఓ దేవుళ్లు, రాజమహేంద్రవరం పందిరి మహదేవుడు సత్రం ఈఓ సుబ్రహ్మణ్యం, పెద్దాపురం కాండ్రకోట ఆలయ గ్రేడ్‌–1 ఈఓ పళ్లంరాజుల్లో ఎవరో ఒకరికి విచారణ బాధ్యతలు అప్పగించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇది జరిగి పది రోజులవుతున్నా పై నుంచి ఇంతవరకూ ఉలుకూపలుకూ లేదు. ఏమిటా అని ఆరా తీస్తే విచారణాధికారి నియామకం జరగకుండా అధికారపార్టీ పెద్దలు  ఉన్నత స్థాయిలో ఒత్తిడి తీసుకువస్తున్నారని తేలింది. అంటే తలుపులమ్మ ఆలయానికి శఠగోపం పెట్టిన అక్రమార్కులతో ఆ నేతలతో ఉన్న సాన్నిహిత్యం నేపథ్యంలోనే పరోక్షంగా విచారణే లేకుండా దొడ్డిదారిన సహకరిస్తున్నారనే విషయం స్పష్టమవుతోంది.

కోటిన్నరపైనే స్వాహా...

లోవలో దుకాణాల నిర్వహణను దక్కించుకున్న వారు లీజు సొమ్ములు కోటిన్నర నొక్కేశారని ప్రాథమిక నిర్థారణకు వచ్చారు. వాటిపై నిశితంగా రికార్డులు పరిశీలించాక ఆలయానికి జమకాని సొమ్ము సుమారు కోటి ఏడు లక్షలని తాజాగా లెక్క తేల్చారు. దేవస్థానంలో 2013–14, 2014–15 ఆర్థిక సంవత్సరాలకు సంబం«ధించి దుకాణాల లీజు సొమ్ము జయచేయని వ్యవహారంలో ఇ¯ŒSఛార్జి సూపరింటెండెంట్‌తోపాటు మరో నలుగురు ఉద్యోగుల పాత్ర కూడా ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించారు. దుకాణాల వేలం హక్కులు దిగువ క్యాడర్‌లో పనిచేసే అగ్రహారపు శ్రీను, రామచంద్రరావు, లోవరాజు తదితర ఉద్యోగుల బంధువుల పేరుతో ఉన్నాయని ఆలయ వర్గాలు తెలిపాయి.

ఈ మొత్తం వ్యవహారంలో సూపరింటెండెంట్‌ సహా నలుగురు ఉద్యోగులపై చర్యలు తీసుకోకుండా ఉన్నత స్థాయి నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిళ్లు వస్తున్నాయని తెలిసింది. దుకాణాల లీజులు ద్వారా ఆలయానికి రూ.1.07 కోట్లు జమచేయాలి. రెండేళ్లవుతున్నా చిల్లిగవ్వ కూడా జమచేయ లేదు. ఈ విషయంపై అంతర్గత విచారణ నిర్వహించగా సస్పెండైన ఉద్యోగికి ఆ సొమ్ము ఇచ్చామని, అతను జమ చేశారో లేదో తమకు తెలియదనే వాదన వినిపించారని తెలిసింది. తాము రశీదు అడిగితే రశీదు అవసరం లేదు...ఏమైనా అయితే చూసుకోవడానికి తాను ఉన్నానంటూ నమ్మబలుకుతూ చివరకు ప్రోనోట్‌ మాత్రం ఒకటి ఇచ్చారంటూ ఆ నోట్‌ను చూపించారని సమాచారం.ప్రోనోట్‌ మాట ఎలా ఉన్నా సొమ్ము జమకాని విషయం మాత్రం వాస్తవమేనని నిగ్గు తేలింది. ఈ విషయం తెలుగు తమ్ముళ్ల వద్దకు వెళ్లడంతో దేవస్థానం పరువు బజారున పడిపోతోందనే సాకుతో సమగ్ర విచారణకు ఉన్నతాధికారుల వద్ద ఉన్న పైలుతోపాటు లీజు సొమ్ము జమచేయని వ్యవహారంలో కూడా విచారణ చేపట్టకుండా అడ్డంపడుతున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ విషయమై ఆలయ ఈఓ చంద్రశేఖర్‌ను వివరణ కోరగా ఆలయానికి జమచేయని కోటి ఏడు లక్షల రూపాయలను బాధ్యుల నుంచి వసూలు చేయడానికి వెనుకాడేది లేదన్నారు. ప్రతి పైసా వసూలు చేస్తామని, అడ్డంకులు ఎదురైనా న్యాయపరంగానైనా వసూలు చేస్తామన్నారు.

 
Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top