చేనేతలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు | kethireddy venkatarameireddy fires on tdp government | Sakshi
Sakshi News home page

చేనేతలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు

Jul 23 2017 7:56 PM | Updated on Sep 5 2017 4:43 PM

చేనేత రంగంపై జీఎస్టీ భారం మోపితే ఏ ఒక్క ప్రజాప్రతినిధికానీ నోరుమెదపడం లేదని, సాక్షాత్తు చంద్రబాబే స్వయంగా చెప్పిన ముడిపట్టు రాయితీ రూ.1000 చెల్లించకుండా చేనేత కార్మికులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

– ముడిపట్టు రాయితీ బకాయిలు ఆగస్టు 7లోపు చెల్లించాలి
- లేకుంటే 8 నుంచి ఆందోళనలు చేస్తాం..
– మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి


ధర్మవరం: చేనేత రంగంపై జీఎస్టీ భారం మోపితే ఏ ఒక్క ప్రజాప్రతినిధికానీ నోరుమెదపడం లేదని, సాక్షాత్తు చంద్రబాబే స్వయంగా  చెప్పిన  ముడిపట్టు రాయితీ రూ.1000  చెల్లించకుండా చేనేత కార్మికులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి  చేనేతలపై చిత్తశుద్ధి లేదన్నారు. ఆదివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది ఆగస్టు 7న చేనేత దినోత్సవం రోజున ముడిపట్టు రాయితీని రూ.600 నుంచి రూ.1,000కి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మవరంలో ప్రకటన చేశారని, అయితే అందులో కేవలం 4 నెలలకు సంబంధించిన రాయితీ మాత్రమే చేనేతలకు అందజేశారన్నారు. ఇంకా 8 నెలలకు సంబంధించిన బకాయిలు ఉన్నాయన్నారు. అలాగే గతంలో రూ.600 సబ్సిడీకి సంబంధించి మరో 13 నెలల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.

ఇంతా జరుగుతుంటే చేనేత వర్గానికి చెందిన ఎంపీ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ పట్టించుకున్న పాపాన  పోలేదన్నారు. రోడ్లకు అడ్డంగా ఫ్లెక్సీల కోసం, రైల్వే స్టేషన్లలో వడలమ్ముకునే కాంట్రాక్టులపైనా, లక్ష, రెండు లక్షల వర్కులపై ఉన్న శ్రద్ధ చేనేత కార్మికుల  సమస్యలను పరిష్కరించడంపై చూపడం లేదని ఎద్దేవా చేశారు. చేనేతలపై మోపిన జీఎస్టీ భారాన్ని ఎత్తివేయాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహనరెడ్డి కేంద్రానికి లేఖ రాశారని, పార్టీ ఎంపీలు లోక్‌సభ, రాజ్యసభల్లో ప్రస్తావించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారన్నారు. చేనేత రంగంపై వెంటనే జీఎస్టీని ఎత్తివేయాలన్నారు. అదేవిధంగా 21 నెలలకు సంబంధించిన  ముడిపట్టు రాయితీ బకాయిలను చేనేత దినోత్సవమైన ఆగస్టు 7 లోపు చేనేత కార్మికుల ఖాతాల్లోకి జమకాకపోతే,  8వ తేదీన సెరికల్చర్‌ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు.  కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు బీరే ఎర్రిస్వామి, పట్టణ అధ్యక్షుడు గడ్డం కుళ్లాయప్ప, కౌన్సిలర్‌ చందమూరి నారాయణరెడ్డి, చేనేత విభాగం నియోజకవర్గ నాయకులు జింకా కంబగిరి, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement