breaking news
veawers
-
చేనేతలపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు
– ముడిపట్టు రాయితీ బకాయిలు ఆగస్టు 7లోపు చెల్లించాలి - లేకుంటే 8 నుంచి ఆందోళనలు చేస్తాం.. – మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం: చేనేత రంగంపై జీఎస్టీ భారం మోపితే ఏ ఒక్క ప్రజాప్రతినిధికానీ నోరుమెదపడం లేదని, సాక్షాత్తు చంద్రబాబే స్వయంగా చెప్పిన ముడిపట్టు రాయితీ రూ.1000 చెల్లించకుండా చేనేత కార్మికులను తీవ్ర ఇబ్బందుల్లోకి నెడుతున్నారని మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీకి చేనేతలపై చిత్తశుద్ధి లేదన్నారు. ఆదివారం ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గత ఏడాది ఆగస్టు 7న చేనేత దినోత్సవం రోజున ముడిపట్టు రాయితీని రూ.600 నుంచి రూ.1,000కి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ధర్మవరంలో ప్రకటన చేశారని, అయితే అందులో కేవలం 4 నెలలకు సంబంధించిన రాయితీ మాత్రమే చేనేతలకు అందజేశారన్నారు. ఇంకా 8 నెలలకు సంబంధించిన బకాయిలు ఉన్నాయన్నారు. అలాగే గతంలో రూ.600 సబ్సిడీకి సంబంధించి మరో 13 నెలల బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. ఇంతా జరుగుతుంటే చేనేత వర్గానికి చెందిన ఎంపీ కానీ, స్థానిక ఎమ్మెల్యే కానీ పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. రోడ్లకు అడ్డంగా ఫ్లెక్సీల కోసం, రైల్వే స్టేషన్లలో వడలమ్ముకునే కాంట్రాక్టులపైనా, లక్ష, రెండు లక్షల వర్కులపై ఉన్న శ్రద్ధ చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడంపై చూపడం లేదని ఎద్దేవా చేశారు. చేనేతలపై మోపిన జీఎస్టీ భారాన్ని ఎత్తివేయాలని తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహనరెడ్డి కేంద్రానికి లేఖ రాశారని, పార్టీ ఎంపీలు లోక్సభ, రాజ్యసభల్లో ప్రస్తావించి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారన్నారు. చేనేత రంగంపై వెంటనే జీఎస్టీని ఎత్తివేయాలన్నారు. అదేవిధంగా 21 నెలలకు సంబంధించిన ముడిపట్టు రాయితీ బకాయిలను చేనేత దినోత్సవమైన ఆగస్టు 7 లోపు చేనేత కార్మికుల ఖాతాల్లోకి జమకాకపోతే, 8వ తేదీన సెరికల్చర్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు బీరే ఎర్రిస్వామి, పట్టణ అధ్యక్షుడు గడ్డం కుళ్లాయప్ప, కౌన్సిలర్ చందమూరి నారాయణరెడ్డి, చేనేత విభాగం నియోజకవర్గ నాయకులు జింకా కంబగిరి, పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. -
చేనేత రాయితీకి మంగళం
– 15 నెలల బకాయిలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వంకొత్త డ్రామా – 30 లోపు పరిహారం పెంపు అమలు చేయాలి – లేదంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా – మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హెచ్చరిక ధర్మవరం టౌన్ : రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న చేనేత రంగం సంక్షేమాన్ని విస్మరించి నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. శనివారం స్థానిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముడిసరుకు ధరలు విపరీతంగా పెరిగిపోయి పట్టుచీరకు మద్దతు ధర లభించక నేత్నలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. వారి దయనీయమైన స్థితిని చూసి 2011లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలోనే ప్రథమంగా ధర్మవరంలో ముడిపట్టు రాయితీ పథకం ప్రారంభింపజేసి నేతన్నకు ప్రతి నెలా రూ.600 జమ అయ్యేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. 2011 నుంచి 2014 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ప్రతినెల క్రమం తప్పకుండా అర్హులైన చేనేత కార్మికులకు రాయితీ పరిహారం ఖాతాలో జమ అయ్యేదన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయితీ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 32 నెలల కాలంలో 17 నెలలకు మాత్రమే రాయితీ అందించారన్నారు. ఇంకా 15 నెలలు బకాయిలు పెండింగ్లో ఉన్నాయన్నారు. గత ఏడాది వైఎస్సార్సీపీ తరపున పెండింగ్ బకాయిలు ఇవ్వాలని ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా 12,000 మంది నేతన్నలతో సంతకాల సేకరణ జరిపి పోరాటం చేశామన్నారు. దీంతో ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో ధర్మవరంలో చేనేత సభ నిర్వహించిన సీఎం చంద్రబాబు ముడిపట్టు రాయితీ బకాయిలతో పాటు, రాయితీని రూ.వెయ్యికి పెంచుతున్నట్లు చెప్పారన్నారు. అయితే ఇప్పటికీ సీఎం హామీలు అమలు కావడం లేదన్నారు.అబద్దపు హామీలతో చేనేతలను మోసం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి «జిల్లాలో చేనేతల ఆత్మహత్యలు అధికమయ్యాయని, వేలాది మంది నేత కార్మికులు వలస వెళ్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ఈనెల 30 లోగా ముడిపట్టు రాయితీ బకాయిలను, వెయ్యికి పెంచిన రాయితీని ప్రతి నెలా అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. ఈనెల 30న ధర్మవరంలో ముడిపట్టు రాయితీపై మహాధర్నా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


