రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న చేనేత రంగం సంక్షేమాన్ని విస్మరించి నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు.
– 15 నెలల బకాయిలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వంకొత్త డ్రామా
– 30 లోపు పరిహారం పెంపు అమలు చేయాలి
– లేదంటే వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా
– మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి హెచ్చరిక
ధర్మవరం టౌన్ : రాష్ట్రంలో వ్యవసాయం తర్వాత అంతటి ప్రాధాన్యం ఉన్న చేనేత రంగం సంక్షేమాన్ని విస్మరించి నిర్వీర్యం చేసే దిశగా చంద్రబాబు ప్రభుత్వం యత్నిస్తోందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ధర్మవరం నియోజకవర్గ సమన్వయకర్త కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి మండిపడ్డారు. శనివారం స్థానిక నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ముడిసరుకు ధరలు విపరీతంగా పెరిగిపోయి పట్టుచీరకు మద్దతు ధర లభించక నేత్నలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. వారి దయనీయమైన స్థితిని చూసి 2011లో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలోనే ప్రథమంగా ధర్మవరంలో ముడిపట్టు రాయితీ పథకం ప్రారంభింపజేసి నేతన్నకు ప్రతి నెలా రూ.600 జమ అయ్యేలా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు.
2011 నుంచి 2014 వరకు తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం ప్రతినెల క్రమం తప్పకుండా అర్హులైన చేనేత కార్మికులకు రాయితీ పరిహారం ఖాతాలో జమ అయ్యేదన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాయితీ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన 32 నెలల కాలంలో 17 నెలలకు మాత్రమే రాయితీ అందించారన్నారు. ఇంకా 15 నెలలు బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. గత ఏడాది వైఎస్సార్‌సీపీ తరపున పెండింగ్ బకాయిలు ఇవ్వాలని ధర్మవరం నియోజకవర్గ వ్యాప్తంగా 12,000 మంది నేతన్నలతో సంతకాల సేకరణ జరిపి పోరాటం చేశామన్నారు.
దీంతో ప్రభుత్వం గత ఏడాది ఆగస్టులో ధర్మవరంలో చేనేత సభ నిర్వహించిన సీఎం చంద్రబాబు ముడిపట్టు రాయితీ బకాయిలతో పాటు, రాయితీని రూ.వెయ్యికి పెంచుతున్నట్లు చెప్పారన్నారు. అయితే ఇప్పటికీ సీఎం హామీలు అమలు కావడం లేదన్నారు.అబద్దపు హామీలతో చేనేతలను మోసం చేయాలని చూస్తే సహించేది లేదన్నారు. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి «జిల్లాలో చేనేతల ఆత్మహత్యలు అధికమయ్యాయని, వేలాది మంది నేత కార్మికులు వలస వెళ్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించి ఈనెల 30 లోగా ముడిపట్టు రాయితీ బకాయిలను, వెయ్యికి పెంచిన రాయితీని ప్రతి నెలా అందించేలా చర్యలు చేపట్టాలన్నారు. లేని పక్షంలో ఆందోళనలను ఉధృతం చేస్తామన్నారు. ఈనెల 30న ధర్మవరంలో ముడిపట్టు రాయితీపై మహాధర్నా నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.


