
చి‘వరి’కి ఊరట!
చి‘వరి’ ఆయకట్టు రైతాంగానికి ఎట్టకేలకు ఊరట కలిగింది. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఆర్డీఎస్
♦ టీబీ డ్యాం నుంచి నీటి విడుదల
♦ ఎట్టకేలకు స్పందించిన కర్ణాటక ప్రభుత్వం
శాంతినగర్ : చి‘వరి’ ఆయకట్టు రైతాంగానికి ఎట్టకేలకు ఊరట కలిగింది. మహబూబ్‌నగర్ జిల్లా అలంపూర్ నియోజకవర్గంలో ఆర్డీఎస్ కింది రబీలో సాగుచేసిన పంటలు ఎండిపోతున్న తరుణంలో రైతులు ఏం చేయాలో దిక్కుతోచకుండా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో టీబీ డ్యాం నుంచి నీటిని విడుదల చేయడంతో పైర్లకు ప్రాణం పోసినట్లయింది. తుంగభద్ర డ్యాంలో పూర్తిస్థాయి నీటిమట్టం లేదని దిగువకు నీటిని విడుదల చేయలేమని కర్ణాటక అధికారులు తేల్చిచెప్పడంతో గత 15 రోజులుగా ఆయకట్టు రైతులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఏడాది ఖరీఫ్‌లో ఇండెంట్ ద్వారా చుక్కనీటిని కూడా విడుదల చేయకపోవడంతో రబీకి ఆర్డీఎస్ కెనాల్‌కు నీరురాదని, పంటలు ఎండిపోతాయని రైతులు దిగులు చెందారు.
అటు ఏపీకి చెందిన కేసీ కెనాల్ అధికారులు, ప్రజాప్రతినిధులు ఇటు తెలంగాణకు చెందిన ఆర్డీఎస్ అధికారులు మంత్రులు, ఆర్డీఎస్ ప్రాజెక్ట్ కమిటీ మాజీ చైర్మన్ తనగల సీతారామిరెడ్డి కర్ణాటక ఉన్నతాధికారులపై ఒత్తిడి పెంచారు. అంతేగాకుండా ‘సాక్షి’లో వరుసగా వస్తున్న కథనాలకు ఎట్టకేలకు కర్ణాటక ప్రభుత్వం, అధికారులు స్పందించారు. శనివారం తుంగభద్ర డ్యాం నుంచి(టీబీ డ్యాం) 2,750 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ నీరు మరో నాలుగు రోజుల్లో తెలంగాణ రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని సింధనూరుకు చేరనుంది. వడ్డేపల్లి మండలంలోని జూలెకల్ ప్రధాన కాల్వకు వారం రోజుల్లో నీరు చేరవచ్చని సీతారామిరెడ్డి తెలిపారు.