కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో కాపు సామాజిక వర్గం మలి విడత ఆందోళనకు దిగింది.
తాడేపల్లిగూడెం: కాపులకు బీసీ రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్‌తో కాపు సామాజిక వర్గం మలి విడత ఆందోళనకు దిగింది. తమ డిమాండ్లను సాధించుకునే దిశగా గత నెలలో కాకినాడలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో రాష్ట్ర కాపు జేఏసీ సమావేశమై పలు తీర్మానాలు ఆమోదించింది. అందులో దశలవారీ ఆందోళనకు పిలుపునిచ్చారు.
దీనిలో భాగంగా తొలి విడతగా ఆదివారం కంచాలు, పల్లాలపై గరిటెలతో శబ్థాలు చేస్తూ ఆకలికేకలు పేరుతో ప్రభుత్వానికి నిరసన తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రధాన కూడళ్లు నియోజకవర్గ, మండల కేంద్రాలు, ప్రధాన ప్రాంతాల్లోని ముఖ్య కూడళ్లలో కాపు వర్గీయులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. రావులపాలెం, కొత్తపేటలో గరిటలతో కంచాలు మోగిస్తూ నిరసనలు తెలిపారు. కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు.