న్యాయం జరగడం లేదు | Justice is not sufficient | Sakshi
Sakshi News home page

న్యాయం జరగడం లేదు

Jan 11 2017 1:39 AM | Updated on Sep 5 2017 12:55 AM

న్యాయం జరగడం లేదు

న్యాయం జరగడం లేదు

25 ఏళ్లుగా ఉన్న ఇంటిని పడగొట్టేందుకు ప్రయత్నిస్తూ భూ ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనకాపల్లి ఎమ్మెల్యే పీలా

జాయింట్‌ సీపీ చెప్పినా చర్యలు శూన్యం  
ఎమ్మెల్యే గోవిందు అనుచరులపై నమోదు కాని కేసు
పోలీసులు స్పందించడం లేదని బాధితుల ఆవేదన


పెందుర్తి : 25 ఏళ్లుగా ఉన్న ఇంటిని పడగొట్టేందుకు ప్రయత్నిస్తూ భూ ఆక్రమణ ఆరోపణలు ఎదుర్కొంటున్న అనకాపల్లి ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణ కేసులో తమకు పూర్తిస్థాయి న్యాయం జరగడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఇది సివిల్‌ తగదా అయినప్పటికీ నిందితులు తమపై దాడికి దిగడం, ఇంటి ప్రహరీని దౌర్జన్యంగా పడగొట్టడం వంటి క్రిమినల్‌ చర్యలపై పోలీసులు దృష్టి సారించడం లేదని వారు ఆరోపిస్తున్నారు. బాధితులు ముమ్మన రాజేష్‌బాబు(ఫోన్‌ ద్వారా), ఆయన చిన్నాన్న ముమ్మన సూర్యారావు మంగళవారం ‘సాక్షి’తో మాట్లాడారు. తమపై జరుగుతున్న దౌర్జన్యకాండపై కమిషనర్‌ యోగానంద్‌కు ఫిర్యాదు చేయగా దానిపై జాయింట్‌ కమిషనర్‌ సత్తార్‌ఖాన్‌ విచారణ జరిపారన్నారు. తాము ఇచ్చిన ఆధారాల ప్రకారం గోడ కూలగొట్టేందుకు వినియోగించిన జేసీబీలను సీజ్‌ చేయడంతో పాటు, ఎమ్మెల్యే గోవిందు అనుచరుడు రమేష్‌ను కస్టడీకి తీసుకోవాల్సిందిగా జాయింట్‌ సీపీ పెందుర్తి పోలీసులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. కానీ ఇప్పటి వరకు అటువంటి చర్యలు ఏమీ తీసుకోలేదని చెబుతున్నారు. కోర్టు తీర్పును సైతం ధిక్కరించి తమ ఇంటిపై దాడికి దిగినా పూర్తిస్థాయిలో తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు మరోసారి ఈ కేసు విషయంలో కలుగజేసుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు.

2016లో రిజిస్ట్రేషన్‌ : మరోవైపు ఎమ్మెల్యే పీలా గోవిందు సత్యనారాయణదిగా చెబుతున్న స్థలం 2016లో రిజిస్ట్రేషన్‌ జరిగినట్లు బాధితులు చెబుతున్నారు. తాము మాత్రం 1990లో 330 గజాల స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. పీలా గోవిందు స్థలం ఉన్న సర్వే నెంబర్, తమ స్థలం ఉన్న సర్వే నంబరు వేర్వేరు అని స్పష్టం చేశారు. అయినా 2001లో తాము ఇళ్లు నిర్మించుకున్నామని, అప్పటికి పీలా గోవిందు కొనుగోలు చేసిన స్థలం చెరువని గుర్తు చేశారు. 25 ఏళ్ల క్రితం స్థలం కొనుగోలు చేసిన తాము ఈ మధ్యనే భూమి కొన్న పీలా గోవిందు స్థలాన్ని ఎలా ఆక్రమించుకుంటామని ప్రశ్నించారు. దీనిపై న్యాయస్థానం కూడా తమకు అనుకూలంగా స్టేటస్‌ కో ఇచ్చినా ఎమ్మెల్యే అనుచరులు అధికార బలంతో తమపై దౌర్జన్యానికి దిగి కోర్టు తీర్పును సైతం ధిక్కరించారని ఆరోపించారు.  

రంగంలోకి ప్రభుత్వ పెద్ద లు: ఇదిలా ఉండగా అధికార పార్టీ ఎమ్మెల్యే పీలా గోవిందు పై భూ ఆక్రమణ కేసు నమోదు కావడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపింది. విషయం ముఖ్యమంత్రి చంద్రబాబు వద్దకు చేరినట్లు విశ్వసనీయ సమాచారం. దీంతో ప్రతిష్ట కాపాడుకునేందుకు ప్రభుత్వ పెద్దలు రంగంలోకి దిగినట్లు వినికిడి. పోలీసు, రెవెన్యూ శాఖల అధికారులపై మంగళవారం కొందరు అధికార పార్టీ పెద్దలు ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. ఇప్పటికే వివాదాస్పద స్థలంలో ఉన్న వాస్తవ పరిస్థితులు బహిర్గతం కావడంతో రికార్డుల పరంగా తమకు అనుకూలంగా మార్చు కునే ప్రయత్నాలు జరుగుతున్నట్లు బోగట్టా. గతంలోనే ఈ స్థలానికి సంబంధించిన రెవెన్యూ అంశాల్లో సంబంధిత అధికారులు ఎమ్మెల్యే పట్ల స్వామి భక్తి ప్రదర్శించినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు లోతుగా విచారిస్తే నిజానిజాలు బయటపడతాయని బాధితులు అంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement