'రోహిత్‌ది రాజకీయ హత్య' | It's a political murder says Suravaram Sudhakar Reddy | Sakshi
Sakshi News home page

'రోహిత్‌ది రాజకీయ హత్య'

Jan 21 2016 7:57 PM | Updated on Jul 26 2019 5:38 PM

రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్‌ది ముమ్మాటికి రాజకీయ హత్యేనని.. అందుకే రాజకీయం చేస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

హైదరాబాద్ : రీసెర్చ్ స్కాలర్ వేముల రోహిత్‌ది ముమ్మాటికి రాజకీయ హత్యేనని.. అందుకే రాజకీయం చేస్తున్నామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌ రెడ్డి వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయల చర్యల కారణంగానే రోహిత్ చనిపోయారన్నారు. గురువారం సురవరం నేతృత్వంలో సీపీఐ నేతలు రాజ్యసభ ఎంపీ డి.రాజా, చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్‌పాష తదితరుల బృందం హెచ్‌సీయూను సందర్శించి, విద్యార్థులు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపారు.

ఈ సందర్భంగా సురవరం మాట్లాడుతూ... బీజేపీ, ఏబీవీపీ తీరును ఎండగట్టారు. యూకుబ్‌మెమన్ ఉరిపై దేశ వ్యాప్తంగా బహిరంగంగానే ఎవరి అభిప్రాయాలు వారు తెలిపారని, అలాంటి వారిపై బీజేపీ కావాలనే దుష్ప్రచారం చేస్తోందని దుయ్యబట్టారు. హెచ్‌సీయూలో తీసిన ర్యాలీని ఖండించడానికి ఏబీవీపీ ఎవరని ప్రశ్నించారు. ఎవరూ ఎక్కడా న్యాయస్థానాలను తప్పుపట్టలేదన్నారు. బాబ్రీమసీదు విషయంలో బీజేపీ చేసిన వ్యవహారమేంటని అడిగారు. రోహిత్ విషయంలో పదే పదే కేంద్రమంత్రులు లేఖలు రాయడమంటే ప్రత్యక్షంగా కల్పించుకున్నట్లు కాదా అని అన్నారు.

కనుక కేంద్రమంత్రులు స్మృతి ఇరానీ, బండారు దత్తాత్రేయలతో పాటు వైస్‌చాన్సలర్ అప్పారావులను వెంటనే పదవుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ వ్యవహారం చూస్తుంటే ఎవరు ఏం చేయాలో.. పుస్తకాలలో ఏం ఉండాలో చెప్పడంతోపాటు ఆఖరికి వంటిట్లో ఏం వండాలో కూడా వారే నిర్ణయించేస్తున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యంగా కాలేజీ మెట్లు కూడా ఎక్కని స్మృతి ఇరానీ కేంద్ర మానవవనరుల శాఖ మంత్రిగా కొనసాగడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రాజ్యసభ సభ్యుడు డి.రాజా మాట్లాడుతూ.. రోహిత్ ఆత్మహత్యపై పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement