చిత్రావతి నదిలో ఆక్రమణలు తొలగించండి | illegal occupies delete the chithravati river | Sakshi
Sakshi News home page

చిత్రావతి నదిలో ఆక్రమణలు తొలగించండి

Aug 20 2016 11:19 PM | Updated on Sep 4 2017 10:06 AM

లోకాయుక్త ఆదేశాల మేరకు పుట్టపర్తి వద్ద చిత్రావతి నదిలోని ఆక్రమణలను తక్షణం తొలగించాలని సంబంధిత శాఖల అధికారులను జేసీ–2 సయ్యద్‌ ఖాజా మొహిద్ధీన్‌ ఆదేశించారు.

అనంతపురం అర్బన్‌ : లోకాయుక్త ఆదేశాల మేరకు పుట్టపర్తి వద్ద చిత్రావతి నదిలోని ఆక్రమణలను తక్షణం తొలగించాలని సంబంధిత శాఖల అధికారులను జేసీ–2 సయ్యద్‌ ఖాజా మొహిద్ధీన్‌ ఆదేశించారు. లోకాయుక్తకి నివేదికను సమర్పించాల్సి ఉన్నందున తక్షణం నివేదికలను కలెక్టరేట్‌కు పంపించాలన్నారు. ఆయన శనివారం తన చాంబర్‌లో అధికారులతో మాట్లాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను జేసీ–2 వివరిస్తూ చిత్రావతి నదిలో ఆక్రమణలు తొలగించి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్‌ని లోకాయుక్త ఆదేశించిందన్నారు. ఆక్రమణలను గుర్తించి సోమవారం నాటికి నివేదిక అందజేయాలని ఆర్డీఓ వెంకటేశ్‌ను ఆదేశించారు.


అలాగే ఆక్రమణ తొలగింపు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని చెప్పారు. చిత్రావతి నది తీరం, ఇరువైపుల అనధికారికంగా నిర్మించిన కట్టడాలను, అక్రమ సాగును తొలగించాలన్నారు. భవిష్యత్తులో నది స్థలం ఆక్రమణకు గురికాకుండా కఠిన చర్యలు చేపట్టాలని కదిరి ఆర్డీఓ వెంకటేశ్, పుట్టపర్తి తహశీల్దారు సత్యానారాయణను ఆదేశించారు. అలాగే నదిని కాలుష్యం చేసేలా చెత్త చెదారం వేయకుండా చూడాలని ఇరిగేషన్‌ ఎస్‌ఈ సుబ్బారావు, నగర పంచాయతీ కమిషనర్‌ నరసింహమూర్తిని ఆదేశించారు. రక్షణ గోడ నిర్మించాలని చెప్పారు. చిత్రావతి నది సుందరీకరణ పనులను కూడా చేపట్టాలని మైనర్‌ ఇరిగేషన్, పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు.  

Advertisement

పోల్

Advertisement