హిందీ భాషను అభివృద్ధి చేయాలి
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలోని అన్ని కేంద్ర కార్యాలయాల్లో తప్పని సరిగా హిందీ భాషను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులదే అని రాజ్‌భాషా(హిందీ) హైపవర్ కమిటీ సభ్యుడు, మహారాష్ట్రలోని లాతూర్ బీజేపీ ఎంపీ సునీల్ బలిరామ్ గైక్వాడ్ అన్నారు.
-
రాజ్‌భాషా హైపవర్ కమిటీ సభ్యుడు గైక్వాడ్
నెల్లూరు(సెంట్రల్): జిల్లాలోని అన్ని కేంద్ర కార్యాలయాల్లో తప్పని సరిగా హిందీ భాషను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత సంబంధిత శాఖ అధికారులదే అని రాజ్‌భాషా(హిందీ) హైపవర్ కమిటీ సభ్యుడు, మహారాష్ట్రలోని లాతూర్ బీజేపీ ఎంపీ సునీల్ బలిరామ్ గైక్వాడ్ అన్నారు. నెల్లూరులోని హోటల్ మినర్వాలో రైల్వే, తపాలా, ఎఫ్‌సీఐ, షార్ అధికారులతో ఆయన గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గౌక్వాడ్ మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు, ఆంగ్లంలలో అధికారులు కార్యాలయాల్లో రాస్తున్నారని, కానీ హిందీలో కూడా రాసే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. రైల్వేలో చాలా వరకు హిందీ భాష ఉందని, పూర్తి స్థాయిలో హిందీ అబివృద్ధికి రైల్వే అధికారులు కృషి చేయాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. తపాలా శాఖ , ఎఫ్‌సీఐ శాఖలలో హిందీ తక్కువగా వాడుకలో ఉన్నట్లు తెలుస్తోందని, రెండు శాఖల అధికారుల సమన్వయంతో హిందీపై ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పించి భాషను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత వారిపై ఉందన్నారు. కార్యక్రమంలో కేంద్రానికి చెందిన హిందీ భాషా కమిటీ అధికారులు నిఖిల్ అరోరా, అభిలాష్ మిశ్రా, రైల్వే డీఆర్‌ఎం అశోక్ కుమార్, ఏడీఆర్‌ఎం వేణుగోపాల్, పీఆర్‌ఓ రాజశేఖర్, నెల్లూరు స్టేషన్ ఎస్‌ఎస్ ఆంథోని జయరాజ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.