ఫిలింనగర్‌ క్లబ్‌ను తెరిచేలా ఆదేశాలివ్వలేం | high court on film nagar club issue | Sakshi
Sakshi News home page

ఫిలింనగర్‌ క్లబ్‌ను తెరిచేలా ఆదేశాలివ్వలేం

Aug 10 2016 12:28 AM | Updated on Oct 2 2018 2:40 PM

ఫిలింనగర్‌ క్లబ్‌ను వెంటనే తెరిచేలా మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది.

సాక్షి, హైదరాబాద్‌: ఫిలింనగర్‌ క్లబ్‌ను వెంటనే తెరిచేలా జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని జీహెచ్‌ఎంసీ అధికారులను ఆదేశించింది. తదుపరి విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఫిలింనగర్‌ కల్చరల్‌ సెంటర్‌కు చెందిన పోర్టికో కూలి భవన నిర్మాణాలు కార్మికులు ఇద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో కల్చరల్‌సెంటర్‌తో పాటు ఫిలింనగర్‌ క్లబ్‌ను కూడా అధికారులు మూసేశారు. దీనిని సవాలు చేస్తూ కల్చరల్‌ సెంటర్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిని న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.ఎస్‌.రామచంద్రరావు విచారించారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది డి.వి.సీతారామ్మూర్తి వాదనలు వినిపిస్తూ, ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే క్లబ్‌కు తాళం వేశారని తెలిపారు. ప్రమాదం జరిగిన చోటుకు క్లబ్‌కు ఎటువంటి సంబంధం లేదన్నారు. అందువల్ల క్లబ్‌ను వెంటనే తెరిచేలా అధికారులను ఆదేశిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. వాదనలు విన్న న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరించారు. ఈ వ్యవహారంపై పూర్తి వివరాలను తమ ముందుంచాలని అధికారులను ఆదేశిస్తూ విచారణను రెండు వారాలకు వాయిదా వేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement