రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ పరిధిలోని విక్రయ కేంద్రాలకు ‘గోల్కొండ’ పేరు బ్రాండ్ నేమ్‌గా ఖరారు చేశారు.
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ పరిధిలోని విక్రయ కేంద్రాలకు ‘గోల్కొండ’ పేరు బ్రాండ్ నేమ్‌గా ఖరారు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో హస్తకళల అభివృద్ధి సంస్థ షోరూంలను ‘లేపాక్షి’ పేరుతో వ్యవహరించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో తెలంగాణ హస్తకళల అభివృద్ధి సంస్థకు కొత్త పేరు, లోగోను సూచించాలంటూ గత ఏడాదే ప్రభుత్వం ఆసక్తి వ్యక్తీకరణ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర చరిత్ర, సంస్కృతి, వారసత్వ సంపదను ప్రతిబింబించేలా కొత్త పేరును ప్రతిపాదించాలని, 2014 డిసెంబర్ 15వ తేదీలోగా సూచనలు పంపాలని కోరింది. ఈ మేరకు వివిధ వర్గాల నుంచి 60కి పైగా ప్రతిపాదనలు అందాయి.
అందులో ఎక్కువ మంది సూచించిన ‘బతుకమ్మ, శాతవాహన, కాకతీయ, గోల్కొండ, కోహినూర్, ఏకశిల, నిర్మల్, మంజీరా, చార్మినార్, రామప్ప’ తదితర పది పేర్లను ఎంపిక చేసి... ముఖ్యమంత్రి ఆమోదం కోసం ఈ ఏడాది జూలైలో పంపించారు. చరిత్ర, సంస్కృతి, వారసత్వం, పూల రంగుల మేళవింపు, పేర్చడంలో మహిళల నైపుణ్యం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని ఎక్కువ మంది బతుకమ్మ పేరును సూచించారు. అయితే ఈ ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం కేసీఆర్ చివరకు గోల్కొండ పేరును ఖరారు చేశారు. ఈ మేరకు రాష్ట్ర హస్తకళల సంస్థ నూతన లోగో, పేరు 2016 జూన్ నుంచి అమల్లోకి వస్తుంది.
ప్రస్తుతం ఈ సంస్థకు రాష్ట్రంలో ఎనిమిది షోరూంలు ఉన్నాయి. బిద్రీ, ఫిలిగ్రీ, డోక్రా, నిర్మల్ కొయ్య బొమ్మలు, పెంబర్తి ఇత్తడి కళాకృతులు తదితర హస్తకళా ఉత్పత్తులను ఈ షోరూముల ద్వారా విక్రయిస్తున్నారు. వీటి ద్వారా ఏటా రూ.40 కోట్ల మేర హస్త కళల ఉత్పత్తుల లావాదేవీలు జరుగుతున్నాయి. తెలంగాణలో వరంగల్ మినహా మిగతా షోరూమ్‌లన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయి. సంస్థ లోగో, పేరును మార్చడంతో పాటు షోరూమ్‌ల సంఖ్యను పెంచేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక అమెజాన్ లాంటి ఆన్‌లైన్ మార్కెటింగ్ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుని తెలంగాణ హస్తకళలకు అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్ ఇమేజ్ తేవాలని ప్రభుత్వం భావిస్తోంది.