
రిపోర్టులనే తారుమారు చేస్తున్నారు: వైఎస్ జగన్
ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రభుత్వం నీరు గార్చే ప్రయత్నం చేస్తోందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు.
గుంటూరు: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని ప్రభుత్వం నీరు గార్చే ప్రయత్నం చేస్తోందని వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై ఏపీ మంత్రుల వ్యాఖ్యలపై దీక్షాస్థలి నుంచి వైఎస్ జగన్ మాట్లాడారు.. 'ప్రత్యేక హోదా అన్నది ఎవరికి అవసరం? జగన్ కు అవసరమా? ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలు వస్తాయి. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు అబద్ధాలు ప్రచారంచేస్తున్నారు. ఇలా దిగజారిపోవడానికి చంద్రబాబుకు సిగ్గుండాలి. ఉద్యమాన్ని నీరుగార్చేందుకు వైద్యయంత్రాన్ని వాడుకుంటున్నారు. ఇలాంటి రాజకీయాలను ఎక్కడా చూడలేదు.
మా నాన్న డాక్టర్, తర్వాత ముఖ్యమంత్రి అయ్యారు. మా మామ డాక్టర్, పులివెందులలో ఇవ్వాళ్టికీ మంచి సేవలు అందిస్తున్నారు. ఇలాంటి కుటుంబం నుంచి నేను వచ్చా. కానీ, ఇక్కడ వైద్య వ్యవస్థను వాడుకుంటున్న తీరు సిగ్గు చేటు. రిపోర్టులన్నింటినీ..తారుమారు చేస్తున్నారు. తప్పుడు రిపోర్టులు ఇస్తున్నారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వైద్య పరీక్షల ఫలితాలను ఎందుకు రిలీజ్ చేయడం లేదు. తప్పుడు గ్లూకోమీటర్ తీసుకొచ్చి..దీక్షపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. గవర్నమెంట్ డాక్టర్లు తీసుకొచ్చిన గ్లూకోమీటర్ 88 చూపించింది. కానీ కొత్త గ్లూకోమీటర్ 77 చూపిస్తోంది. మీడియా సమక్షంలో అన్ని పరీక్షలకు అవసరమైన నమూనాలు ఇస్తా' అని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ తీరు పై ఆగ్రహం వ్యక్తంచేశారు.