నగరంలో ఇంటి తలుపులు బద్దలుకొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు.
-ఏడు కాసుల బంగారు నగలు, రూ.25 వేలు నగదు అపహరణ
ఏలూరు: నగరంలో ఇంటి తలుపులు బద్దలుకొట్టి దొంగలు చోరీకి పాల్పడ్డారు. ఇందుకు సంబంధించి టూ టౌన్ సీఐ ఉడతా బంగార్రాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జవ్వాది జవహర్ లాల్ నెహ్రూ అనే నగరానికి చెందిన వ్యాపారి స్థానిక బెండపూడి వారి వీధిలో భార్యాపిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. కుటుంబసభ్యులతో కలిసి ఈనెల 1వ తేదీన బుధవారం పోడూరులో ఉంటున్న బంధువుల ఇంటికి వెళ్లారు. గురువారం నగరానికి తిరిగివచ్చి ఇంటిలోకి వెళ్లగా బెడ్‌రూంలోని బీరువా పగుల గొట్టి ఉండడంతో పాటు వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉండడం గమనించారు.
వెంటనే టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ బంగార్రాజు, ఎస్సై అల్లు దుర్గారావు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీం ఎస్సై ఎం.రాజేష్‌ను రప్పించి ఆధారాలు సేకరించారు. దొంగలు ఇంటి వెనుక తలుపు పగులగొట్టి ఇంటిలో ప్రవేశించారని గుర్తించారు. బీరువాలోని ఏడు కాసుల బంగారు నగలు, రూ. 25 వేలు నగదు అపహరించారని బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, క్లూస్ టీం నివేదికతో దొంగలను పట్టుకుంటామని సీఐ బంగార్రాజు చెప్పారు.