నిఖా అక్కడ.. నిరీక్షణ ఇక్కడ! | Sakshi
Sakshi News home page

నిఖా అక్కడ.. నిరీక్షణ ఇక్కడ!

Published Mon, Sep 26 2016 1:20 AM

నిఖా అక్కడ.. నిరీక్షణ ఇక్కడ! - Sakshi

యాలాల/బొంరాస్‌పేట: ఆ ఊళ్లో పెళ్లికూతురు.. ఈ ఊళ్లో పెళ్లికొడుకు.. మధ్యలో ఉప్పొంగుతున్న నది.. మరికొద్ది సేపట్లో పెళ్లికూతురి ఊళ్లో నిఖా (పెళ్లి) జరగాల్సి ఉంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకున్నారు ఇరువర్గాల పెద్దలు. మరో గంటలో పెళ్లి కూతురి ఇంటికి చేరుకునేలోపు, మార్గమధ్యంలో కాగ్నా నది ఉప్పొంగి ప్రవహించింది. పెళ్లి కొడుకుతోపాటు, ఆయన కుటుంబీకులంతా నది ఒడ్డునే నిలిచిపోయారు. దీంతో  ఉదయం 10 గంటలకు జరగాల్సిన పెళ్లిని..  సాయంత్రం 5.30 గంటలకు జరపాల్సిన పరిస్థితి ఏర్పడింది.
రంగారెడ్డి జిల్లా పెద్దేముల్ మండలం గాజీపూర్‌కు చెందిన మహబూబ్ అలీ, షబానాబేగం దంపతుల కూతురు పర్వీన్‌కు.. మహబూబ్‌నగర్ జిల్లా చిలమల మైలారానికి చెందిన అబ్దుల్ రెహ్మాన్‌తో ఆదివారం ఉదయం 10 గంటలకు ‘నిఖా’ ఖాయం చేశారు.  పెళ్లికూతురు తరఫు వారు భోజనాలు ఏర్పాటు చేశారు.  పెళ్లి కొడుకుతోపాటు కుటుంబసభ్యులంతా ఉదయం 7 గంటలకు స్వగ్రా మం నుంచి బయలుదేరగా.. మార్గమధ్యంలోని కోకట్ కాగ్నా నది ఉప్పొంగింది. మరో మార్గం లేకఅక్కడే వారు ఆగిపోయారు. ఇలా 8 గంటల పాటు నదివద్దే నిరీక్షించారు. చివరకు సాయంత్రం కాగ్నా నది ఉధృతి తగ్గడంతో వాహనాల్లోనే పెళ్లికూతురి ఇంటికి వెళ్లారు. దీంతో ఆదివారం ఉదయం 10 గంటలకు జరగాల్సిన పెళ్లి.. సాయంత్రం 5.30 గంటల కు జరగడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Advertisement
Advertisement