నత్తే నయం
ఎంఎల్‌సీ ఎన్నికల గడువు శనివారంతో ముగియనుంది.
యూనివర్సిటీక్యాంపస్: ఎంఎల్‌సీ ఎన్నికల గడువు శనివారంతో ముగియనుంది. చాలా తక్కువ సంఖ్యమంది ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. పట్టభధ్రులు, ఉపాధ్యాయ నియోజక వర్గాలకు వచ్చే యేడాది మార్చిలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లా చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలతో కూడిన పట్టభధ్రుల నియోజక వర్గ పరిధిలోకి వస్తుంది. గత ఓటర్ల జాబితాను ఎన్నికల కమిషన్ రద్దు చేసింది. అందరూ తాజాగా ఓటు నమోదు చేయాలని ప్రకటించింది. ఓటరు నమోదుకు శనివారంతో గడువు ముగియనుంది. చాలా మంది ఓటును నమోదు చేయించుకోలేదు. శుక్రవారం సాయంత్రానికి కొద్ది శాతం కూడా నమోదు చేసుకోలేదని తెలిసింది. పట్టభద్రుల నియోజకవర్గంలో గతేడాది చిత్తూరు జిల్లా నుంచి 67వేల మంది నమోదు చేసుకున్నారు. ఆరేళ్ల తర్వాత జరుగుతున్నందున ఇప్పుడీ సంఖ్య పెరగాలి.
కానీ ఇప్పటివరకూ 30వేలకు పైగా నమోదు చేసుకున్నారు. ంటే సగం మంది కూడా నమోదు చేసుకోలేకపోయారు. ఆన్‌లైన్ ద్వారా ఓటు నమోదుకు పట్టభద్రులు మూడు రోజులుగా ప్రయత్నిస్తున్నారు. తరచు సర్వర్ మొరాయిస్తోంది. అంతేకాకుండా దరఖాస్తు పూర్తి చేశాక అప్‌లోడ్ చేసే సమయంలో సర్వర్ అకస్మాత్తుగా డౌన్ అవుతోంది. దీంతో చాలా మంది ఓటు నమోదు చేసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. నమోదు గడువును పెంచాలని పట్టభధ్రులు కోరుతున్నారు. ఈ అంశాన్ని వైఎస్సార్‌సీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్‌కు వినతి పత్రం ఇచ్చారు. గడువును ఇప్పటివరకు పెంచలేదు.


