బండి నడిపితే బడి నుంచి బహిష్కరణే! | Expulsion from school and drove the whehicle | Sakshi
Sakshi News home page

బండి నడిపితే బడి నుంచి బహిష్కరణే!

Jul 30 2016 10:27 PM | Updated on Sep 4 2017 7:04 AM

బండి నడిపితే బడి నుంచి బహిష్కరణే!

బండి నడిపితే బడి నుంచి బహిష్కరణే!

మైనర్‌ బండి నడుపుతూ చిక్కితే విద్యాలయాల నుంచి బహిష్కరించేలా చర్యలు.

సాక్షి, సిటీబ్యూరో: తల్లిదండ్రులారా ఒక్క క్షణం ఆలోచించండి...పిల్లల సరదా కోసం వారికి బండి కొనిస్తున్నారా? అలా చేస్తే వారి భవితను చేజేతులా మీరు నాశనం చేసినట్టే. ఎందుకంటారా...?  డ్రైవింగ్‌ లైసెన్స్‌కు అర్హత లేని (18 లోపు) వారికి బండి ఇవ్వడం వల్ల ప్రమాదం జరిగి ఎదుటివారి ప్రాణాలు పొవచ్చు...లేదా వారే బండి పై నుంచి జారిపడితే ప్రాణం పోవచ్చు... ఈ రెండింటీలో ఏది జరిగినా నష్టం మాత్రం పూడ్చలేం. అందుకే ప్రమాదం జరిగే వరకు వేచి చేసే కన్నా పిల్లలకు బైక్‌ ఇవ్వకుండా జాగ్రత్త పడటం మేలని సైబరాబాద్‌ ఈస్ట్, వెస్ట్‌ పోలీసులంటున్నారు. ఇలాంటి మాటలు చెబుతూనే.. మైనర్‌ బండి నడుపుతూ తమకు చిక్కితే మాత్రం ఏకంగా బడి, కాలేజీ నుంచి వారిని బహిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నామని హెచ్చరించారు.

అండర్‌ ఏజ్డ్‌ డ్రైవింగ్, డ్రంకన్‌ డ్రైవింగ్‌ వల్ల కలిగే అనర్ధాలపై గచ్చిబౌలిలోని సైబరాబాద్‌ పోలీసు కమిషనరేట్‌లో శుక్రవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గతేడాది జనవరి నుంచి జూన్‌ వరకు 1088 మంది మైనర్లు బండి నడుపుతూ పోలీసులకు చిక్కితే.., ఈ ఏడాది అదే సమయంలో 1289 మంది దొరకడాన్ని సీరియస్‌గా తీసుకున్న సైబరాబాద్‌ పోలీసులు తల్లిదండ్రులతో పాటు మైనర్లకు ప్రత్యేక క్లాస్‌లు తీసుకున్నారు. అలాగే అండర్‌ ఏజ్డ్‌ డ్రంకన్‌ అండ్‌ డ్రైవ్‌ కేసులో గతేడాది జనవరి నుంచి జూన్‌ వరకు 21 కేసులు నమోదైతే, ఈసారి అదే సమయంలో 29 మంది పట్టుబడ్డారని గుర్తుచేశారు.

తల్లిదండ్రులూ ఇవి గుర్తుపెట్టుకోండి...
‘‘మోటారు వెహికల్‌ యాక్ట్‌ సెక్షన్‌ 181 కింద బండి నడిపినందుకు మైనర్‌కు రూ.500లు, ఆ బండి యజమానికి 1000ల జరిమానా విధిస్తారు. స్కూల్, కాలేజీల నుంచి బహిష్కరించేలా చర్యలు తీసుకుంటారు. మైనర్లు డ్రైవింగ్‌ చేస్తే వారిని ప్రోత్సహించిన నేరంపై తల్లిదండ్రులపై చట్టరీత్యా చర్యలు ఉంటాయి. మైనర్‌తో పాటు తల్లిదండ్రులు జువైనల్‌ జస్టిస్‌ బోర్డు, కోర్టుకు హాజరు కావాలి. వీసా, పాస్‌పోర్టు, ప్రభుత్వ, ప్రైవేట్‌ ఉద్యోగులు, డ్రైవింగ్‌ లైసెన్స్, వెహికల్‌ రిజిస్ట్రేషన్, స్కూల్, కాలేజీ అడ్మిషన్‌ పొందే విషయాల్లో ఇబ్బందులు ఎదుర్కోవాలి.

మేజర్‌ అయిన తమ పిల్లలు విధిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకొని హెల్మెట్‌ ధరించడం, సీట్‌బెల్ట్‌ వినియోగం, వాహనం నడిపేటప్పుడు మొబైల్‌ వాడకపోవడం, మద్యం తాగి బండి నడపకుండా తగిన చర్యలు తీసుకోవాలి. పార్టీలకు హాజరయ్యేవారు తప్పనిసరిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండి, మద్యం తీసుకొని వ్యక్తిని మాత్రమే డ్రైవర్‌గా నియమించుకోవాలి’’.. అని సైబరాబాద్‌ ఈస్ట్‌ పోలీసు కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ సూచించారు.

కళ్లు చెమర్చిన దృశ్యాలు...
సైబరాబాద్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలకు సంబంధించి సీసీ కెమెరాల ఫుటేజీలన్నీ కలిపి యాక్సిడెంట్స్‌ జరుగుతున్న తీరును ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. వాటిని చూసిన తల్లిదండ్రులు, మైనర్లు, డ్రంకన్‌ డ్రైవర్లు ఉద్విగ్నానికి లోనయ్యారు.  మైనర్‌కు బండి ఇవ్వడం తప్పని పేరెంట్స్‌ అంటే..,  ఇక నుంచి బండి నడపబోమని మైనర్లు అన్నారు.  ‘‘నేను యూసుఫ్‌గూడలోని ఓ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నా. డ్రైవింగ్‌ లైసెన్స్‌ తీసుకునేందుకు అర్హత లేని నేను బండి నడుపుతూ పోలీసులకు పట్టుబడ్డా.

అయితే పోలీసులు ఇచ్చిన ఈ అవగాహన కార్యక్రమం నాలో మార్పును తీసుకొచ్చింది. ఇక నుంచి బండి నడపను. మరో పది మందికి ఇదే విషయమే చెబుతా’.. అని ఫయాజ్‌ అనే బాలుడన్నాడు.   బండి నడుపుతూ పోలీసులకు చిక్కిన ఇంటర్‌ సెకండ్‌ ఇయర్‌ చదువుతున్న మైనర్‌ తండ్రి శ్రీధర్‌ రెడ్డి మాట్లాడుతూ...పోలీసులు ఇదే తీరును సాగిస్తే పిల్లలు బండిపై బయటకు వచ్చేందుకు భయపడతారని, తల్లిదండ్రుల్లో కూడా మార్పు వస్తుందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement