డ్రైవర్ నిర్లక్ష్యానికి విద్యార్థి నిండు ప్రాణం బలైపోయింది. ఉన్నత చదువులు చదివి చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు బస్సు చక్రాల కింద నలిగిపోవటంతో ఆ త ల్లిదండ్రుల గుండెలు అవిశిపోయాయి.
♦ హైర్బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంతో విద్యార్థి మృతి
♦ ఆర్టీసీ బస్టాండ్లో దుర్ఘటన
పట్నంబజారు:
డ్రైవర్ నిర్లక్ష్యానికి విద్యార్థి నిండు ప్రాణం బలైపోయింది. ఉన్నత చదువులు చదివి చేతికి అందివస్తాడనుకున్న కుమారుడు బస్సు చక్రాల కింద నలిగిపోవటంతో ఆ త ల్లిదండ్రుల గుండెలు అవిశిపోయాయి. వివరాల్లోకి వెళితే.... పాతగుంటూరులోని యాదవబజారుకు చెందిన ఉప్పగుండ్ల సాయికుమార్(18) ప్రత్తిపాడు పరిధిలో తుమ్మలపాలెం మిట్టపల్లి కళాశాలలో మెకానికల్ ఇంజనీరింగ్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. ప్రతిరోజు ఆర్టీసీ బస్టాండ్కు చేరుకుని బస్సులో కాలేజీకి వెళుతుంటాడు. శుక్రవారం ఉదయం కళాశాలకు వెళ్ళేందుకు ఎప్పటిలాగే బస్టాండ్కు వచ్చి 7వ ఫ్లాట్ఫారం వద్ద బస్సు ఆగటంతో అక్కడకు వెళ్ళి నిలుచున్నారు. ఇంతలో ఒంగోలు డిపోకు చెందిన హైర్ బస్సును ఫ్లాట్ఫారం నుంచి వెనక్కి తీస్తున్న క్రమంలో సాయికుమార్ను ఢీ కొంది. అంతా కేకలు వేస్తున్నప్పటీకీ డ్రైవర్ వినిపించుకోకుండా నడపడంతో బస్సు చక్రం సాయికుమార్ తలపై ఎక్కి అక్కడికక్కడే మృతి చెందినట్లు విద్యార్థులు చెబుతున్నారు. ఆసుపత్రికి తరలించగా సాయికుమార్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు.
విద్యార్థుల ఆందోళన.....
డ్రైవర్ నిర్లక్ష్యంతో తోటి విద్యార్థి మరణించడంతో ఆగ్రహించిన విద్యార్థులు ఆర్టీసీ బస్టాండ్లో ఆందోళనకు దిగారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి.భగవాన్దాస్ ఆందోళనకు మద్దతుగా నిలిచారు. విషయం తెలుసుకున్న అడిషనల్ ఎస్పీ సుబ్బరాయుడు, ఈస్ట్ డీఎస్పీ జె.వి.సంతోష్, ట్రాఫిక్ డీఎస్పీ కండె శ్రీనివాసులు సంఘటనా స్థలానికి చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో చర్చించాలని ఆందోళన విరమించాలని వారికి సర్దిచెప్పారు. విద్యార్థి మరణానికి న్యాయం జరిగే వరకు ఆందోళన విరమించేదిలేదని విద్యార్థులు తేల్చి చెప్పారు. విషయం తెలుసుకున్న ఆర్టీసీ రీజినల్ మేనేజర్ జ్ఞానంగారి శ్రీహరి విద్యార్థులు, నేతలతో సమావేశం ఏర్పాటు చేశారు. విద్యార్థికుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తప్పనిసరిగా బస్సులుపెంచే ప్రక్రియ చేపడతామన్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా కొత్తపేట, లాలాపేట, పాతగుంటూరు సీఐలు వెంకన్నచౌదరి, నరసింహారావు, బాలమురళీకృష్ణలు భారీ బందోస్తు నిర్వహించారు.
మిన్నంటిన రోదనలు
మృతుడు సాయికుమార్ తండ్రి ఈశ్వరరావు ఎలక్ట్రీషియన్గా పని చేస్తుంటారు. తమ్ముడు క్రాంతి కూడా ఇంజనీరింగ్ అభ్యసిస్తున్నాడు. విషయం తెలుసుకుని మార్చురీ వద్దకు చేరుకున్న సాయికుమార్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. విద్యార్థులు, బంధువుల రోదనలు మిన్నంటాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.