నేడు డీఎస్ ప్రమాణ స్వీకారం | Sakshi
Sakshi News home page

నేడు డీఎస్ ప్రమాణ స్వీకారం

Published Tue, Jun 28 2016 4:27 AM

నేడు డీఎస్ ప్రమాణ స్వీకారం

రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవ ఎన్నిక
ఎంపీ కవిత ప్రత్యేక చొరవతో..
ఢిల్లీకి తరలివెళ్లిన అనుచరులు, అభిమానులు
వచ్చే నెల 7న జిల్లాకు రాక

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : రాజ్యసభ సభ్యుడిగా ధర్మపురి శ్రీనివాస్ మం గళవారం ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. టీఆర్‌ఎస్ అధికార పార్టీ అభ్యర్థిగా సీఎం కేసీఆర్ డి.శ్రీనివాస్‌ను రాజ్యసభకు ఎంపిక చేసిన విషయం విధితమే. గత నెల 24 రాజ్యసభకు నోటిఫికేషన్ వెలువడగా.. 26న డీఎస్‌ను టీఆర్‌ఎస్ పార్టీ రాజ్యసభ సభ్యుడిగా ప్రకటించింది. ఈ వ్యవహరంలో నిజామాబాద్ ఎంపీ కవిత కీలకంగా వ్యవహరించారు. అనంతరం డీఎస్ రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. రాజ్యసభ సభ్యుడిగా పదవీ బాధ్యతలు చేపడుతున్న సందర్భంగా ఆయన ప్రమాణ స్వీకారానికి ఆయన అనుచరులు, పలువురు కార్పొరేటర్లు భారీ సంఖ్యలో ఢిల్లీకి తరలివెళ్లారు. రైళ్లల్లో  ఒక రోజు ముందుగానే వెళ్లారు.

 సీనియర్ నేతగా అనుభవం
రాజ్యసభ సభ్యుడిగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ధర్మపురి శ్రీనివాస్‌కు 32 ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది. సుధీర్ఘ అనుభవజ్ఞుడిగా అనేక పదవులు చేపట్టిన నాయకుడిగా డీఎస్ పేర్కొందారు. ప్రస్తుతం ఢిల్లీలో రాజ్యసభ సభ్యుడిగా మొదటిసారిగా కాలుమోపనున్నారు. ఢిల్లీ పెద్దల సభలో ఓ సీనియర్ నేతగా డీఎస్‌కు అవకాశం కల్పిస్తే.. బీసీ వర్గాలకు కూడా ప్రాతినిధ్యం కల్పించినట్లు అవుతుందన్న ఎంపీ కవిత సూచన మేరకు సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి టీఆర్‌ఎస్‌లో చేరిన డీఎస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా ఢిల్లీ రాజకీయాల్లో చాలా కీలకంగా వ్యవహరించారు. ఇదే సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం కృషి చేసిన డీఎస్, అప్పటి నుంచే కేసీఆర్‌తో సంబంధాలు మెరుగుపర్చుకున్నారు. ఈ అంశాలు కూడా డీఎస్‌కు కలిసొచ్చినట్లు చెప్తున్నారు. అంతేగాకుండా టీఆర్‌ఎస్ డీఎస్ చేరిన సందర్భంగా ఇచ్చిన మాట ప్రకారం మొదట ప్రభుత్వ సలహాదారుగా కేబినేట్ హోదా కల్పించిన కేసీఆర్ అనంతకం ఎంపీగా అవకాశం కల్పించారు. దీంతో సీనియర్ రాజకీయ వేత్త, బీసీ వర్గాల నేతగా డీఎస్‌కు తగిన ప్రాధాన్యం కల్పించారన్న చర్చ సాగుతోంది.

 వచ్చే నెల 7న డీఎస్ రాక
రాజ్యసభ సభ్యుడిగా ఎంపికైన డీఎస్ ప్రమాణ స్వీకారం అనంతరం వచ్చే నెల 7న మొదటిసారిగా జిల్లాకు రానున్నారు. ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు అనుచరులు సన్నాహాలు ప్రారంభించా రు. ఇందుకు సంబంధించి అనుచరులు, కార్యకర్తలు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా సరిహద్దు ప్రారంభం నుంచి నగరంలోని డీఎస్ ఇంటి వరకు భారీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Advertisement
Advertisement