2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి సాధ్యమే | Sakshi
Sakshi News home page

2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి సాధ్యమే

Published Thu, Apr 7 2016 12:17 AM

2019 అసెంబ్లీ ఎన్నికల నాటికి సాధ్యమే

ఆకివీడు/తాడేపల్లిగూడెం : తెలుగురాష్ట్రాల్లో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు నియోజకవర్గాల పెంపుపై చర్చలు జరుగుతున్నట్టు ప్రకటించడంతో రాజకీయవర్గాల్లో ఉత్కంఠ రేగుతోంది.  పెంపు ఎలా జరుగుతుంది, ఎన్ని నియోజకవర్గాలు పెరుగుతాయి వంటి విషయాలపై చర్చసాగుతోంది. జిల్లాలో ప్రస్తుతం 15 నియోజకవర్గాలు ఉన్నాయి. పునర్విభజన నేపథ్యంలో కొత్తగా మరో నాలుగైదు పెరిగే అవకాశం ఉందని
 
 తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 175 నియోజకవర్గాలను 225కు పెంచాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇటీవల కేంద్రాన్ని కోరింది. ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రాతిపదికన పునర్విభజించాలని సూచించింది. దీంతో జనాభా ప్రాతిపదికన విభజన జరుగుతుందా? లేక భౌగోళిక పరిస్థితులను బట్టి చేస్తారా? అనేదానిపై తర్జనభర్జనలు జరుగుతున్నాయి. జనాభా ప్రాతిపదికన విభజన జరిగితే జిల్లాకు ఐదు కొత్త నియోజకవర్గాలు వచ్చే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. రాష్ట్ర విభజన అనంతరం పోలవరం ముంపు మండలాలు కుకునూరు, వేలేరుపాడు జిల్లాలో కలిశాయి. దీంతో మొత్తం మండలాల సంఖ్య 48కి చేరింది. ఈ నేపథ్యంలో ఎస్టీ నియోజకవర్గమైన పోలవరం రెండుగా చీలే అవకాశం ఉందనే వాదన వినబడుతోంది.
 
 గత విభజన లోపభూయిష్టం
 గతంలో 2009కి ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజన లోపభూయిష్టంగా, అశాస్త్రీయంగా జరిగిందనే విమర్శలు అప్పట్లో వెల్లువెత్తాయి. భౌగోళిక పరిస్థితులను బేరీజు వేసుకోకుండా చేశారనే ఆరోపణలు వచ్చాయి. భౌగోళికంగా పెద్ద మండలాలను, దూరంగా ఉన్న మండలాలను కలిపి నియోజకవర్గంగా ఏర్పాటు చేశారనే వాదనలు వినిపించాయి. ఉండి, భీమవరం నియోజకవర్గాల కూర్పు ఈ వాదనలకు బలం చేకూరుస్తోంది. ఉండి నియోజకవర్గంలో భాగమైన పాలకోడేరు మండలం భౌగోళికంగా ఓ మూలన దూరంగా ఉంటుంది.
 
  అలాగే భీమవరం నియోజకవర్గంలో చేర్చిన వీరవాసరం మండలం, భీమవరం పట్టణానికి మధ్య మరో మండలం ఉంది. దానిని వేరే నియోజకవర్గంలో చేర్చడంతో అప్పట్లో విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే తరహాలోనే మిగిలిన నియోజకవర్గాలూ ఉన్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. భౌగోళిక పరిస్థితులను పట్టించుకోకపోవడం వల్ల ప్రస్తుతం ప్రజలు పడుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
 
 గత పునర్విభజన సమయంలో జిల్లాలో 16 నియోజకవర్గాలు ఉండగా, ఆ సంఖ్యను 15కి కుందించారు. అప్పట్లో అత్తిలి, పెనుగొండ నియోజకవర్గాలు అంతర్ధానమయ్యాయి. ఈ నియోజకవర్గాల్లోని మండలాలను తణుకు, ఉంగుటూరు, ఆచంట నియోజకవర్గాల్లో కలిపారు. దీంతో సామాజిక బలాబలాల్లోనూ తేడాలొచ్చాయి. ఈ నేపథ్యంలో  ఈసారైనా.. శాస్త్రీయంగా పునర్విభజన చేపట్టాలని రాజకీయవర్గాలతోపాటు ప్రజలు కోరుతున్నారు. భౌగోళిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకోవాలని చెబుతున్నారు.  
 
 నియోజకవర్గాలు చిక్కే అవకాశం !
 పునర్విభజన జరిగితే పాత నియోజకవర్గాలు చిక్కిపోతాయనే భావన వ్యక్తమవుతోంది. తాడేపల్లిగూడెం పరిధి తగ్గిపోతుందని, ఆ మండలంలోని డెల్టా ప్రాంత గ్రామాలు, పెంటపాడు మండలంలోని 13 గ్రామాలు, తాడేపల్లిగూడెం మున్సిపాలిటీతో  కలిసి నియోజకవర్గంగా ఏర్పడవచ్చని ఊహాగానాలు సాగుతున్నాయి.   ఉంగుటూరు, తణుకు నియోజకవర్గాల్లోని కొన్ని గ్రామాలను  విడదీసి కొత్త  నియోజకవర్గం ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. గోపాలపురం నియోజకవర్గంలోని నల్లజర్ల, ద్వారకాతిరుమల మండలాలతోపాటు, తాడేపల్లిగూడెం మండలంలోని అడ్డరోడ్డుగా పేరున్న గ్రామాలను కలిపి  ద్వారకాతిరుమల నియోజకవర్గం ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతోంది.   
 
 గాలిపటం తోకల్లా నియోజకవర్గాల విభజన గాలి పటం తోకల్లా ఉండకూడదు. ప్రజలకు సౌలభ్యంగా ఉండాలి. రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గి విభజన ప్రక్రియ
 చేయవద్దు. నియోజకవర్గానికి దగ్గరలోని గ్రామాలన్నింటినీ కలుపుకోవాలి. భౌగోళిక
 పరిస్థితులు ముఖ్యం.
 -మేకా శేషుబాబు, ఎమ్మెల్సీ
 
  ఎన్నికల నాటికి సాధ్యమే
 నియోజకవర్గాల పునర్విభజన వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేయవచ్చు. దీనిపై కేంద్రం స్పందించాల్సి ఉంది. రాజ్యాంగం ప్రకారం 20 ఏళ్లకొకసారి నియోజకవర్గాల పునర్విభజన జరగాలి. అయితే రాష్ర్ట విభజన నేపథ్యంలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు నియోజకవర్గాలను పెంచాలని కోరాయి. దీనికి కేంద్రం స్పందించి వెంటనే కమిటీ ఏర్పాటు చేస్తే వచ్చే ఎన్నికల నాటికి ప్రక్రియ పూర్తవుతుంది. కమిటీ అన్ని జిల్లాల్లో పర్యటించి కేంద్రానికి నివేదిక సమర్పిస్తుంది. పార్లమెంటు ఆమోదంతో ఎన్నికల కమిషన్ దానిని అమలు జరుపుతుంది.
 -యర్రా నారాయణస్వామి, రాజ్యసభ మాజీ సభ్యులు
 

Advertisement
Advertisement