పుష్పశోభితం..మల్లన్న వైభవం | Sakshi
Sakshi News home page

పుష్పశోభితం..మల్లన్న వైభవం

Published Fri, Oct 7 2016 1:15 AM

పుష్పశోభితం..మల్లన్న వైభవం - Sakshi

శ్రీశైలం: దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా గురువారం శ్రీశైలంలో పుష్పపల్లకోత్సవం వైభవంగా నిర్వహించారు. అమ్మవారు కాత్యాయనీ అలంకారంలో దర్శనమివ్వగా శ్రీ భ్రమరాంబా మల్లికార్జునస్వామి వారు సర్వాలంకారభూషితులై అలంకార సమేతంగా పుష్పపల్లకీలో విహరించారు. ఆలయ ప్రాంగణంలోని అక్కమహాదేవి అలంకార మండపంలో శ్రీ భ్రమరాంబాదేవిని గురువారం రాత్రి  కాత్యాయనిగా అలంకరించారు. పూజలు నిర్వహించిన తరువాత అమ్మవారి అలంకార రూపాన్ని, స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను   కృష్ణదేవరాయగోపురం గుండా రథశాల వద్దకు చేర్చారు. అక్కడ ఏర్పాటు చేసిన పుష్పపల్లకీలో అలంకార రూపాన్ని, శ్రీ స్వామిఅమ్మవార్లను అధిష్టింపజేశారు. ఈ సందర్భంగా  ఈఓ నారాయణభరత్‌ గుప్త మాట్లాడుతూ..పుష్పపల్లకీ కోసం 500 కేజీలకు పైగా పుష్పాలను వినియోగించామన్నారు. గజమాలకు శ్రీరంగం నుంచి తెప్పించామన్నారు. జ్యోతిర్లింగ స్వరూపుడైన మల్లికార్జునుడికి పుష్పార్చన ఎంతో ప్రీతికరమని స్థలపురాణ కథలు చెబుతున్నాయన్నారు. రథశాల నుంచి బయలుదేరిన పుష్పపల్లకీ అంకాలమ్మగుడి, నందిమండపం వరకు కొనసాగి తిరిగి ఆలయం చేరుకుంది. పుష్పపల్లకీ మహోత్సవాన్ని  డ్రోన్‌ కెమెరా ద్వారా చిత్రీకరణ చేశారు.దీనిని డాక్యుమెంటరీ చేస్తున్నట్లు దేవస్థానం అధికారవర్గాలు తెలిపాయి. అలంకార సహిత అమ్మవారిని, స్వామిఅమ్మవార్లను దర్శించుకుని వేలాది మంది భక్తులు పునీతులయ్యారు. జేఈఓ హరినాథ్‌రెడ్డి, ఏఈఓ కృష్ణారెడ్డి, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వివిధ విభాగాల సిబ్బంది  పాల్గొన్నారు.

Advertisement
Advertisement