31వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు గురువారంతో ముగిశాయి.
అనంతపురం సిటీ : 31వ జాతీయ నేత్ర దాన పక్షోత్సవాలు గురువారంతో ముగిశాయి. జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో సర్వజనాస్పత్రి ఆవరణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి డాక్టర్ కన్నేగంటి భాస్కర్ అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ కోనæశశిధర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జిల్లా కలెక్టర్ తన నేత్రాలను దానం చేయడానికి అనుమతి పత్రాన్ని పూరించి వైద్యాధికారులకు అందించారు. డాక్టర్ అక్బర్ కూడా తన నేత్రాలను దానం చేస్తున్నట్లు ప్రకటించారు.
జిల్లా కలెక్టర్ నేత్ర దానానికి ముందుకు రావడాన్ని నేటి తరం యువత ఆదర్శంగా తీసుకోవాలని వైద్యాధికారులు సమావేశంలో పిలుపునిచ్చారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ...చూపులేని వారికి బాసటగా నిలవాలకున్న ప్రతి ఒక్కరు నేత్ర దానానికి ముందుకు రావాలన్నారు. మనలాంటి జీవితాన్ని చాలా మంది కళ్లు లేక అనుభవించలేక పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నేడు నేత్ర దానానికి చాలా మందిలో అవగాహన పెరిగిందన్నారు.