నగర రోడ్లపై సీఎం దృష్టి | cm kcr concentrate on roads | Sakshi
Sakshi News home page

నగర రోడ్లపై సీఎం దృష్టి

Aug 4 2016 12:03 AM | Updated on Sep 4 2018 5:21 PM

నగర రోడ్లపై సీఎం దృష్టి - Sakshi

నగర రోడ్లపై సీఎం దృష్టి

చిధ్రమైన రోడ్లపై సీఎం కేసీఆర్ నజర్ పెట్టారు. రోడ్లపై సమగ్ర ప్రణాళిక విడుదల చేశారు.

సాక్షి, సిటీబ్యూరో: అడుగుకో గుంతతో అధ్వాన్నంగా మారిన నగర రహదారుల దుస్థితిపై సీఎం కేసీఆర్‌ సీరియస్‌గా దృష్టి సారించారు. ఇటీవలి కాలంలో రోడ్ల గురించి ప్రజల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆయన బుధవారం నగర రహదారులు, ట్రాఫిక్‌ తదితర సమస్యలపై జీహెచ్‌ఎంసీ అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.  రోడ్లతో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు లేకుండా తీర్చిదిద్దేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు.

తొలిదశలో పైలట్‌ ప్రాజెక్టుగా వంద కిలోమీటర్ల మేర ఎలాంటి ఇబ్బందుల్లేకుండా ట్రాఫిక్‌ ఫ్రీగా వెళ్లేందుకు సమగ్ర అధ్యయనం చేసి నివేదిక సమర్పించాలని సూచించారు. నివేదిక అందగానే సదరు మార్గాల్లో దీర్ఘకాలం మన్నికగా ఉంటే వైట్‌టాపింగ్‌ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు. కాగా నగరంలోని ఆయా మార్గాల్లో దాదాపు 60 కి.మీ.ల మేర నిర్వహించిన సమగ్ర అధ్యయన నివేదికలు ఇప్పటికే సిద్ధంగా ఉన్నాయి. పనుల్ని త్వరితంగా చేపట్టేందుకు వాటిని పరిగణనలోకి తీసుకోనున్నారు. వాటితోపాటు మరో 40 కి.మీ.ల మేర కూడా సమగ్ర అధ్యయనం నిర్వహించి వైట్‌టాపింగ్‌ రోడ్ల పనులు చేపట్టనున్నారు.

సమావేశం సందర్భంగా జీహెచ్‌ఎంసీ అధికారులు ఈ దిగువ అంశాలను కూడా సీఎం దృష్టికి తెచ్చినట్లు తెలిసింది.
వైట్‌ టాపింగ్‌ రోడ్ల వ్యయం ఇలా...
∙ వైట్‌టాపింగ్‌ లేన్‌ కి.మీ.కు అయ్యే వ్యయం.. జీహెచ్‌ఎంసీ అంచనా : రూ. 45 లక్షలు
∙ మన్నిక సమయం: 15 – 20 సంవత్సరాలు
∙ నిర్వహణ వ్యయం: 15 ఏళ్ల వరకు అవసరం లేదు.
∙ సిమెంట్‌ ఉత్పత్తిదారులు సమాఖ్య(సీఎంఏ) అంచనా: రూ. 51 లక్షలు
బీటీ రోడ్ల వ్యయం ఇలా...
∙ లేన్‌ కి.మీ.కు బీటీ రోడ్డుకు చేస్తున్న ఖర్చు : రూ. 30 లక్షలు
∙ ఐదేళ్లకోమారు వంతున బీటీ నిర్వహణ కయ్యే ఖర్చులు 15 ఏళ్లకు : రూ. 37.50 లక్షలు
∙ 15 సంవత్సరాలకు  వైట్‌టాపింగ్‌కు జీహెచ్‌ఎంసీ/సీఎంఏ అంచనా  మేరకు :రూ.45/51లక్షలు
∙ బీటీ రోడ్లు నిర్వహణ ఖర్చులతో కలుపుకొని 15 సంవత్సరాలకు..: రూ. 67.50 లక్షలు
∙ వైట్‌ టాపింVŠ  వేస్తే ఆదా అయ్యే వ్యయం 50 శాతం/ 32 శాతం(సీఎంఏ అంచనా)
∙ భూగర్భ కేబుళ్లు, విద్యుత్‌ లైన్ల తరలింపు తదితర పనులు కాకుండా  ఇది కేవలం రోడ్డు నిర్మాణ ఖర్చు.
∙ వైట్‌టాపింగ్‌ పనులకు కి.మీ. రోడ్డుకు నిర్మాణం , క్యూరింగ్‌తో కలిపి కనిష్టంగా 3 రోజులు, గరిష్టంగా 5 రోజులు సమయం పడుతుంది.  దీనివల్ల ఎక్కువ రోజులు ట్రాఫిక్‌ మళ్లించాల్సిన పని ఉండదు.
∙ ఒకసారి రోడ్డు వేశాక తిరిగి తవ్వకూడదు.
– జీహెచ్‌ఎంసీలో మొత్తం రోడ్లు : 9059.20 కి.మీ.
వదరనీటి కాలువలు : 1555.22 కి.మీ.
– శివార్లలో  భూగర్భ డ్రైనేజీ : 123.22 కి.మీ.(జలమండలి)
– కోర్‌సిటీలో భూగర్భ డ్రైనేజీ : 6000 కి.మీ.(జలమండలి)
– విద్యుత్‌ కేబుళ్లు: 2000 కి.మీ.

సమగ్ర అధ్యయన నివేదికలు (డీపీఆర్‌లు) సిద్ధంగా ఉన్న మార్గాలు

మార్గం     దూరం (కి.మీ.)
1.  చార్మినార్‌ – ఫలక్‌నుమా డిపో    4.30
2.  ఇందిరాపార్కు రోడ్‌     3.50
3.  శ్రీనగర్‌ కాలనీ రోడ్‌     3.32
4.  మినిస్టర్‌ రోడ్‌     1.80
5.  చంచల్‌గూడ– డబీర్‌పురా దర్వాజా    2.52
6.  చాదర్‌ఘాట్‌ బ్రిడ్జి– కాచిగూడ     2.40
7. సనత్‌నగర్‌ – ఎర్రగడ్డ     1.60
8. శివం రోడ్‌     1.66
9. మూసారాంబాగ్‌ రోడ్‌     2.62
10. యూసుఫ్‌గూడ మెయిన్‌రోడ్‌    1.90
11. జిందా తిలిస్మాత్‌ రోడ్‌     1.66
12. ఎల్‌బీనగర్‌– సైదాబాద్‌    5.50
13. కొత్తపేట–సరూర్‌నగర్‌    1.10
14. కేపీహెచ్‌బీ ఫేజ్‌–1 రోడ్‌    2.30
15. ప్రగతినగర్‌ రోడ్‌     1.50
16. విద్యానగర్‌ జంక్షన్‌–తార్నాక(వయా ఓయూ)    4.10
17.  సుచిత్రా జంక్షన్‌ –జీడిమెట్ల జంక్షన్‌    3.80
18. కాచిగూడ – రెజిమెంటల్‌ బజార్‌     5.80
19. ఎలిఫెంటా హౌస్‌రోడ్‌(అమీర్‌పేట)    1.20
20.  ఎస్‌.డి. రోడ్‌     1.01
21. కోఠి ఆంధ్రాబ్యాంక్‌–ఉమెన్స్‌కాలేజి    1.01
22.  ఆడిక్‌మెట్‌ రోడ్‌     1.30
23.  లక్‌డికాపూల్‌– మెహదీపట్నం    1.30
మొత్తం      60.15

పై వాటితో పాటు బషీర్‌బాగ్‌ అంబేద్కర్‌ విగ్రహం నుంచి ఎంజే మార్కెట్, నాంపల్లి – అసెంబ్లీ, ఆబిడ్స్, కాచిగూడ, సికింద్రాబాద్‌ తదితర కోర్‌ సిటీ మార్గాల్లో పనుల కోసం సమగ్ర అధ్యయనం జరుపనున్నారు. ముఖ్యంగా ఎక్కువ మంది ప్రజలకు ఉపయోగపడే మార్గాలను తొలి దశ పనులకు ఎంపిక చేయనున్నారు. దీంతోపాటు పనులు చేపట్టేందుకు ఎలాంటి ఆటంకాల్లేని మార్గాలను ఎంచుకోనున్నారు. తగినంత రోడ్డు వెడల్పు ఉన్న మార్గాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.వివిధ  కేబుళ్లు, విద్యుత్‌ అవసరాల దృష్ట్యా వాటి కోసం డక్ట్‌లు, వరదకాలువలకు తగినంత స్థలాన్ని వదిలి రోడ్డు నిర్మించేందుకు కూడా యోచిస్తున్నారు. ఒకసారి రోడ్డు వేశాక తిరిగి తవ్వకూడదు కనుక.. ఈ యుటిలిటీస్‌ పనులన్నీ చేశాకే రోడ్డు వేయాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement