సందీపూ.. లే నాన్నా..

సందీపూ.. లే నాన్నా.. - Sakshi


ఇంత శిక్ష వేస్తావనుకోలేదు రా

  తల్లిడిల్లిన హృదయం

 కొడైకెనాల్‌లో గల్లంతైన డిగ్రీ విద్యార్థి మృతి

అనంతపురం చేరిన మృతదేహం



అనంతపురం సెంట్రల్‌ : ‘సందీపూ లే నాన్నా.. నన్ను విడిచి ఎక్కడికి పోతావురా.. కొడుకా నావైపు ఒక్కసారి చూడరా.. అంటూ విద్యార్థి సందీప్‌ తల్లి గౌరీ తన కుమారుడి మృతదేహంపై పడి రోదించడం అందరి గుండెలను పిండేసింది. ఆమెను ఓదార్చడం అక్కడున్న వారితరం కాలేదు. చేతికొచ్చిన కొడుకు కళ్లెదుటే నిర్జీవంగా పడి ఉండడం చూసి ఆ మాతృహృదయం తట్టుకోలేకపోయింది. కొడైకెనాల్‌లో గల్లంతైన పోలీస్‌ హెడ్‌కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ కుమారుడే సందీప్‌(20). అతని ఆచూకీని గురువారం రాత్రి కనుగొన్నారు. మృతదేహాన్ని శుక్రవారం అనంతపురంలోని అరవింద్‌నగర్‌లో గల వారి నివాసానికి తీసుకొచ్చారు. మృతదేహం రాగానే కుటుంబ సభ్యులు, బంధువుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతమంతా హోరెత్తిపోయింది.


జరిగిందేమిటంటే...

అనంతపురంలోని పీవీకేకే కళాశాలలో సందీప్‌ డిగ్రీ చదువుతున్నాడు. వినాయక చవితికి వినూత్నమైన విగ్రహాన్ని ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో గత మంగళవారం తన స్నేహితులతో కలసి మహీంద్రా కంపెనీకి చెందిన లోగాన్‌ కారులో బళ్లారి జిల్లా హంపీకి వెళ్లారు. అక్కడ విగ్రహాలను చూసిన అనంతరం అటు నుంచి కొడైకెనాల్‌ వెళ్లారు. గురువారం మధ్యాహ్నం అక్కడ సరదాగా ఎంజాయ్‌ చేస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారీ నీళ్లలో పడిపోయారు. ఉధృతంగా ప్రవహిస్తున్న నదిలోకి పడిపోవడంతో తలకు బలమైన గాయాలు కావడంతో మృతి చెందాడు. ఒక్కసారిగా భయాందోళనకు గురైన తోటి స్నేహితులు కుటుంబ సభ్యులకు, స్థానిక పోలీసులకు తెలిపారు. గురువారం మధ్యాహ్నం నుంచి గాలింపు చర్యలు చేపట్టగా అర్ధరాత్రి అతని ఆచూకీ కనుగొన్నారు.


ఒక్కగానొక్క కుమారుడు...

హెడ్‌కానిస్టేబుల్‌ చంద్రశేఖర్‌ ముగ్గురు అన్నదమ్ములు కాగా,  వారందరికీ ఆడపిల్లలే సంతానం. చంద్రశేఖర్‌కు మాత్రం ఒక కుమారుడు, ఒక కుమార్తె. వారి వంశంలోనే సందీప్‌ ఏకైక మగసంతానం కావడంతో అతి గారాబంగా పెంచారు. అందులో భాగంగానే స్నేహితులతో పరిచయం ఎక్కువ కావడంతో ప్రాణాల మీదకు తెచ్చుకున్నాడని పోలీసు వర్గాలు పేర్కొన్నాయి. అయితే తన తండ్రిలాగే సందీప్‌ కూడా పోలీసు అధికారి కావాలని కలలు కనేకాడని గుర్తు చేశారు. ప్రస్తుతం నోటిఫికేషన్‌ కూడా విడుదల కావడంతో ఎలాగైనా కానిస్టేబుల్‌ లేదా ఎస్‌ఐ కావాలని శిక్షణ కూడా పొందేవాడని తెలిసింది. అంతలోనే ప్రమాదం జరిగి తిరిగిరాని లోకాలకు వెల్లిపోవడం అందరినీ కలచివేసింది.



అమ్మమాట కాదని...

నెల కిందటే సందీప్‌ తన స్నేహితులతో కలసి కొడైకెనాల్‌ వెళ్లొచ్చినట్లు తెలిసింది. నెల తిరక్కనే మరోసారి తాను, తన స్నేహితులు కొడైకెనాల్‌ వెళ్లి రావాలని తల్లితో చెప్పాడు. అందుకు ఆమె అంగీకరించలేదు. ఎలాగైనా పోవాలని అతను పట్టుబట్టినట్లు తెలిసింది.  ఎలాగోలా ఇంట్లో ఒప్పించి, ఆ తరువాత మిత్రులతో కలసి కొడైకెనాల్‌ వెళ్లి, ప్రాణాల మీదికి తెచ్చుకోవడం ఇప్పుడు ఆ కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తింది.



నేను చనిపోతే ఏడవకండి

సందీప్‌ తన ఫేస్‌బుక్‌ అకౌంట్‌లో కొన్ని రోజుల కిందట ఓ పోస్ట్‌ అప్‌డేట్‌ చేశారు. అందులో ‘నేను చనిపోతే ఏడవకండి. ఒక్కసారి ఆకాశం వైపు చూసి గుడ్‌బై చెప్పండి’ అంటూ రాసి ఉండడాన్ని స్నేహితులు గుర్తు చేసుకుని విషాదంలో మునిగిపోయారు.

Read latest District News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top