26 ఏళ్ల ఆనవాయితీకి తిలోదకాలు | book festival at swaraj maidan in vijayawada | Sakshi
Sakshi News home page

26 ఏళ్ల ఆనవాయితీకి తిలోదకాలు

Dec 24 2015 10:27 AM | Updated on Sep 3 2017 2:31 PM

26 ఏళ్ల ఆనవాయితీకి తిలోదకాలు

26 ఏళ్ల ఆనవాయితీకి తిలోదకాలు

ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే బెజవాడ పుస్తక మహోత్సవం ఈసారి చిన్నబోయే పరిస్థితి ఏర్పడింది.

 ప్రభుత్వ అధీనంలోనే స్వరాజ్య  మైదానంలోని సగభాగం
 సగం స్థలంలోనే బుక్ ఫెస్టివల్
 
విజయవాడ : ప్రతి ఏటా ఎంతో ప్రతిష్టాత్మకంగా జరిగే బెజవాడ పుస్తక మహోత్సవం ఈసారి చిన్నబోయే పరిస్థితి ఏర్పడింది. ఈ బుక్ ఫెస్టివల్ ఏర్పాటుచేసే స్వరాజ్య మైదానంలో (పీడబ్ల్యూడీ గ్రౌండ్స్) సగభాగాన్ని మాత్రమే ఈసారి ప్రభుత్వం కేటాయించడంతో స్టాల్స్ సంఖ్య కుదించక తప్పలేదు. దేశ, విదేశాలకు చెందిన ప్రఖ్యాత ముద్రణ సంస్థలతో నిర్వహించే ఈ మహోత్సవానికి స్వరాజ్య మైదానం వేదిక. మైదానం సమీపంలో ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం ఉందనే కారణంతో ఈ ప్రాంతాన్ని హై సెక్యూరిటీ జోన్‌గా చూపి అందులో పుస్తక మహోత్సవ నిర్వహణకు ఆంక్షలు విధించారు. 11 ఎకరాల ఈ మైదానంలో కలెక్టర్ క్యాంపు కార్యాలయం ఉన్న వైపునంతటినీ ప్రభుత్వం తన అధీనంలోకి తీసుకుంది. బందరు రోడ్డువైపు రైతు బజార్ నుంచి కల్యాణ్ జ్యూయలర్స్ షోరూమ్ సమీపం వరకే ఎగ్జిబిషన్ నిర్వహించుకునేందుకు అవకాశం కల్పించారు. దీంతో 400 వరకూ ఏర్పాటుకావాల్సిన స్టాల్స్ 230కి తగ్గిపోయాయి. గత సంవత్సరం 389 స్టాల్స్‌తో ఎగ్జిబిషన్ నిర్వహించగా ఈసారి ఆ స్థాయిలో నిర్వహించే అవకాశం లేకుండాపోయింది. 
 
ప్రముఖ ముద్రణా సంస్థల స్టాల్స్:
సిల్వర్‌జూబ్లీ ఉత్సవాలు జరుపుకొన్న విజయవాడ బుక్ ఫెస్టివల్ కోసం ప్రతి సంవత్సరం వేలాదిమంది ఎదురుచూస్తుంటారు. ఆక్స్‌ఫర్డ్, కేంబ్రిడ్జి వంటి ప్రఖ్యాత అంతర్జాతీయ ముద్రణా సంస్థలు, ఎస్ చాంద్, హిమాలయ వంటి పేరొందిన ముద్రణా సంస్థలు ప్రతి ఏటా ఇక్కడ తమ స్టాల్స్ ఏర్పాటు చేస్తాయి. ప్రతి సంవత్సరం జనవరి ఒకటి నుంచి పదో తేదీ వరకూ జరిగే ఈ ఎగ్జిబిషన్‌ను నాలుగు లక్షల మంది సందర్శిస్తారని, రెండు కోట్లకు పైగా విక్రయాలు జరుగుతాయని అంచనా. ఈ ఎగ్జిబిషన్‌లో దాదాపు దొరకని పుస్తకం ఉండదు. అందుకే దూరప్రాంతాల నుంచి కూడా అనేకమంది ఇక్కడకొస్తారు. 1989 నుంచి ఇలా నిరాఘాటంగా జరుగుతున్న పుస్తక మహోత్సవానికి భద్రత కారణాల పేరుతో ఈసారి అధికార యంత్రాంగం బ్రేకు వేసింది.  తొలుత పుస్తక మహోత్సవాన్ని వేరే చోట పెట్టుకోవాలని విజయవాడ బుక్ ఫెస్టివల్ సొసైటీకి సూచించారు. కానీ నగరం నడిబొడ్డున అందరికీ అందుబాటులో ఉన్న గ్రౌండ్‌ను కాదని వేరేచోట పెడితే ఇబ్బంది వస్తుందని నిర్వాహకులు ఆందోళనతో  సగం స్థలం కేటాయించారు. 
 
పుస్తక ప్రియుల ఆందోళన
నగరంలో విజ్ఞాన, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు స్వరాజ్య మైదానం ఎంతోకాలం నుంచి వేదికగా ఉంటోంది. కొద్దిరోజుల నుంచి భద్రత పేరుతో వీటికి అనుమతివ్వడంలేదు. దీంతో భవిష్యత్తులో పుస్తక మహోత్సవాలు, ఇతర కార్యక్రమాలకు ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నగరంలో ఈ తరహా మైదానం మరొకటి లేకపోవడంతో అలాంటి కార్యక్రమాలు నగరం వెలుపల నిర్వహించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. అందుబాటులో ఉన్న ఒకే ఒక మైదానాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని తమను ఊరిబయటకు వెళ్లమనడంపై పుస్తక ప్రియులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement