అంబేడ్కర్‌ స్మృతివనం పనులకు శ్రీకారం

Ambedkar Smritivanam works was speedup - Sakshi

కాంట్రాక్టర్‌కు స్థలం అప్పగింత

విగ్రహం ఏర్పాటు ప్రాంతంలో నిర్మాణాల తొలగింపు

12 అడుగుల నమూనా విగ్రహ పనులు ప్రారంభం

402 రోజుల్లో అంబేడ్కర్‌ కాంస్య విగ్రహం పూర్తిచేసేలా ప్రణాళిక 

సాక్షి ప్రతినిధి, విజయవాడ: నగరంలో ఏర్పాటుచేయనున్న భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతివనం పనులు ఊపందుకుంటున్నాయి. ఈ పనులు చేసేందుకు వీలుగా ఇక్కడి స్వరాజ్‌ మైదాన్‌లో ఉన్న 42 కట్టడాలను తొలగించగా ఆ భూమిని జిల్లా కలెక్టర్‌ జె. నివాస్‌ సాంఘిక సంక్షేమ శాఖకు ఇప్పటికే అప్పజెప్పారు. 18 ఎకరాల విస్తీర్ణంలో రూ.249 కోట్లతో ఇక్కడ అంబేడ్కర్‌ స్మృతివనం ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిన విషయం విదితమే. ఈ పనుల నిర్వహణ బాధ్యతను కేపీసీ ప్రాజెక్టŠస్‌ లిమిటెడ్‌ సంస్థ దక్కించుకుంది.

పనుల పర్యవేక్షణకు నోడల్‌ ఏజెన్సీగా సాంఘిక సంక్షేమ శాఖ, కార్యనిర్వహణ ఏజెన్సీగా ఏపీఐఐసీ వ్యవహరిస్తున్నాయి. ఇక్కడ 125 అడుగుల అంబేడ్కర్‌ కాంస్య విగ్రహంతోపాటు స్మృతి వనం నిర్మించనున్నారు. ఇందులో మెమోరియల్‌ పార్కు, అధ్యయన కేంద్ర నిర్మాణంతోపాటు, 2వేల మంది కూర్చునేందుకు వీలుగా కన్వెన్షన్‌ సెంటర్, 500 మందికి సరిపడా ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్, 100 మంది సామర్థ్యంగల కన్వెన్షన్‌ మెడిటేషన్‌ హాల్‌ నిర్మంచనున్నారు. అలాగే గ్రీనరీని ఏర్పాటుచేస్తారు. ఇప్పటికే ఇక్కడున్న భవనాలను తొలగించడంతోపాటు, పనులు దక్కించుకున్న కాంట్రాక్టు సంస్థ ఆ ప్రాంతాన్ని చదును చేస్తోంది.

2023 మార్చికల్లా సిద్ధం
ఇక అంబేడ్కర్‌ 12 అడుగుల కాంస్య విగ్రహం నమూనా తయారీ పనులూ ప్రారంభమయ్యాయి. హైలెవల్‌ కమిటీ దీనిని పరిశీలించి ఈనెల 18కల్లా ఆమోదం తెలుపుతుంది. ఆ తరువాత 25 అడుగుల నమూనా పనులు 19న ప్రారంభమై, మార్చి 10 నాటికి పూర్తిచేస్తారు. మార్చి 15లోపు ఈ నమూనాకు కమిటీ అనుమతి ఇవ్వాల్సింటుంది. మార్చి 16 నుంచి 2023 మార్చి నాటికి అంటే మొత్తం 402 రోజులకు అంబేద్కర్‌ విగ్రహంపూర్తిగా ముస్తాబవుతుంది. అన్ని పనులు పూర్తిచేసుకుని మార్చి 31, 2023 నాటికి విగ్రహాన్ని ఏర్పాటుచేసే విధంగా కాల పరిమితిని నిర్ణయించారు. దీంతో పాటు మిగిలిన భవనాల నిర్మాణం పనులూ అదే సమయానికి పూర్తిచేయాలని నిర్ణయించారు.

పనులు వేగవంతం..
అంబేడ్కర్‌ 125 అడుగుల కాంస్య విగ్రహం, స్మృతి వనం పనులు వేగవంతమయ్యాయి. స్వరాజ్‌ మైదాన్‌ ప్రాంతంలో ఉన్న నిర్మాణాలను తొలగించి, స్థలాన్ని కాంట్రాక్టు సంస్థకు అప్పగించాం. స్థలాన్ని చదును చేయడంతోపాటు, కాంస్య విగ్రహ నమూనా పనులు ప్రారంభమయ్యాయి. నిర్మాణ పనుల ప్రగతిపై ఏపీఐఐసీ అధికారులతో ఇటీవలే సమీక్షించాం. పనులు నిర్ధిష్ట కాల వ్యవధిలో పూర్తిచేయాలని ఆదేశించాం.
– జె. నివాస్, జిల్లా కలెక్టర్, కృష్ణా  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top