నిర్భయ కేసు బాధితురాలిపై దాడి అమానుషం | attack on nirbhaya case complainant | Sakshi
Sakshi News home page

నిర్భయ కేసు బాధితురాలిపై దాడి అమానుషం

Sep 22 2016 1:51 AM | Updated on Sep 4 2017 2:24 PM

ఆచంట : నిర్భయ కేసు బాధితురాలిపై దాడి అమానుషమని, నిందితులను కఠినంగా శిక్షించాలని బుధవారం స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద గ్రామస్తులు ఆందోళన చేశారు.

ఆచంట : నిర్భయ కేసు బాధితురాలిపై దాడి అమానుషమని, నిందితులను కఠినంగా శిక్షించాలని బుధవారం  స్థానిక పోలీస్‌ స్టేషన్‌ వద్ద  గ్రామస్తులు ఆందోళన చేశారు. ఈ ఏడాది జూన్‌17న గ్రామానికి చెందిన ఓ యువతికి నెక్కంటి శ్రీనివాస్, సుశీల దంపతులు మత్తుమందు ఇచ్చి ఆమెను నగ్నంగా అశ్లీలంగా సెల్‌ఫోన్‌లో చిత్రీకరించారు. ఆ తర్వాత వ్యభిచారం చేయాలని ఆమెను ఒత్తిడి చేశారు. దీనిపై యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి నిర్భయ కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో బెయిల్‌పై విడుదలైన శ్రీనివాస్, సుశీల, వారి బంధువులు  మంగళవారం రాత్రి బాధితురాలిపై దాడి చేశారు. ఈ దాడిలో యువతి తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనపై పాలకొల్లు సీఐ ఎ.చంద్రశేఖరరావు బుధవారం పోలీస్‌ స్టేషన్‌లో సాక్షులను విచారించారు. దీంతో గ్రామస్తులు పెద్ద ఎత్తున పోలీస్‌ స్టేషన్‌కు చేరుకుని ఆందోళన చేశారు. నిందితులు గ్రామానికి రాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితురాలి తల్లిదండ్రులు నిందితుల నుంచి ఆపద పొంచి ఉందని  రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం ప్రత్యక్ష సాక్షుల నుంచి పోలీసులు స్టేట్‌మెంట్లు తీసుకున్నారు. బాధితురాలు పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. 
 
ఏడుగురిపై కేసులు 
బాధితురాలిపై దాడి చేసిన ఘటనలో ఏడుగురిపై కేసులు నమోదు చేసినట్లు సీఐ చంద్రశేఖరరావు తెలిపారు. నెక్కంటి శ్రీనివాసు, సుశీల, నాగమణి, నార్పిన నర్సింహమూర్తి, దుర్గ, సురేష్, ఆరుమిల్లి లక్ష్మిపై కేసులు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా నిందితురాలు సుశీల కూడా తనపై బాధితురాలి వర్గీయులు దాడి చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. 
 
బాధితురాలికి న్యాయం చేస్తాం  : మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ రాజ్యలక్ష్మి
పాలకొల్లు టౌన్‌ : ఇదిలా ఉంటే పాలకొల్లు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలిని  రాష్ట్ర మహిళా కమిషన్‌ సభ్యురాలు డాక్టర్‌ శిరిగినీడి రాజ్యలక్ష్మి బుధవారం పరామర్శించారు. బాధితురాలికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. యువతి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. మెరుగైన వైద్య సేవలందించాలని వైద్యులకు సూచించారు. ఈ కేసుపై మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ నన్నపనేని రాజకుమారికి నివేదిక ఇస్తానని, సత్వరం న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటానని వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement