Sakshi News home page

అవినీతి బాటలు

Published Mon, Mar 20 2017 11:16 PM

అవినీతి బాటలు - Sakshi

- ఆత్రేయపురం మండలంలో రూ.3 కోట్లతో రోడ్ల పనులు
- నాణ్యతకు తిలోదకాలు.. మూణ్నాళ్లకే ముక్కలు
- కానరాని ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ
- యథేచ్ఛగా ‘తమ్ముళ్ల’ అక్రమాలు
 
కోట్లాది రూపాయలతో గ్రామాల్లో నిర్మిస్తున్న రోడ్లపై ‘తమ్ముళ్లు’ అవినీతి బాటలు వేసుకుంటున్నారు. ఇంజినీరింగ్‌ అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో.. నాసిరకం గ్రావెల్‌తో.. మూడు పాళ్లు సిమెంటు.. ముప్ఫై పాళ్లు ఇసుక చందాన.. నాణ్యత లేకుండా రోడ్లు నిర్మిస్తున్నారు. దీంతో ఏళ్లపాటు నిక్షేపంలా ఉండాల్సిన ఆ రోడ్లు వేసిన మూణ్నాళ్లకే ముక్కలవుతున్నాయి.
 
ఆత్రేయపురం : మండల పరిధిలోని 17 గ్రామాల్లో ఇటీవల తెలుగు తమ్ముళ్లు నామినేషన్‌ పద్ధతిపై సీసీ, గ్రావెల్‌ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టారు. జిల్లా పరిషత్‌ నుంచి కొత్తపేట మార్కెట్‌ కమిటీ నిధులు, ఎంపీ ల్యాడ్, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా సుమారు రూ.3 కోట్లు ఈ రోడ్ల నిర్మాణానికి మంజూరయ్యాయి. నిబంధనల ప్రకారం గ్రావెల్‌ రోడ్డు వేసేటప్పుడు గ్రావెల్, ఇసుక, సిమెంటు మిశ్రమంతో నిర్మాణం చేపట్టాలి. కానీ, కాంట్రాక్టర్లయిన ‘తమ్ముళ్లు’ నిబంధనలకు తూట్లు పొడుస్తూ నాసిరకం సిమెంటు, నాసిరకం గ్రావెల్‌తో రోడ్ల నిర్మాణం చేపడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బూడిద ఎక్కువగా కలిసిన గ్రావెల్‌ వాడడంతో రోడ్డు నిర్మాణంలో నాణ్యత లోపిస్తోంది. తాడిపూడి, పేరవరం తదితర గ్రామాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. మరోపక్క సీసీ రోడ్ల నిర్మాణంలో కూడా నిబంధనలు పాటించడంలేదు. ముఖ్యంగా వాటర్‌ క్యూరింగ్‌ చేయడంలో నిర్లక్ష్యం చూపుతున్నారు. క్యూరింగ్‌ 10 రోజులు చేయాల్సి ఉండగా చాలాచోట్ల ఆవిధంగా జరగడంలేదు. దీంతో నిర్మించిన కొద్ది రోజులకే సీసీ రోడ్లు బీటలు వారుతున్నాయి. పేరవరం, తాడిపూడి గ్రామాల్లో సీసీ రోడ్లు వేసిన కొద్ది రోజులకే బీటలు తీశాయంటే రోడ్లను ఎంత నాణ్యతారహితంగా నిర్మిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు.
అందుబాటులో ఉండని ఇంజినీరింగ్‌ అధికారులు
ఈ రోడ్ల పనులకు మంజూరైన నిధులు, రోడ్డు నిర్మాణంలో చేపట్టాల్సిన నాణ్యత ప్రమాణాల గురించి తెలుసుకునేందుకు సంప్రదించేందుకు ప్రయత్నించగా జెడ్పీ ఇంజినీరింగ్‌ అధికారులు అందుబాటులోకి రావడం లేదని పలువురు ఎంపీటీసీ సభ్యులు, ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండల పరిషత్‌ సమావేశాల్లో ప్రశ్నించాలనుకున్నా ఇంజినీరింగ్‌ అధికారులు వాటికి కూడా డుమ్మా కొడుతున్నారని మండిపడుతున్నారు.
విజిలెన్స్‌, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తా
గ్రామాల్లో జరుగుతున్న రోడ్ల నిర్మాణంలో అధికారులు, అధికార పార్టీ నాయకులు కుమ్మక్కై నిధులు దోచేస్తున్నారు. దీంతో రోడ్లు వేసిన మూణ్నాళ్లకే ముక్కలవుతున్నాయి. దీనిపై విజిలెన్స్‌ అధికారులకు, కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తాను. గ్రామాల్లో అభివృద్ధి పనుల కోసం నిధుల మంజూరుకు కృషి చేసే ప్రజాప్రతినిధులకు ఆ పనులు ప్రారంభించే సమయంలో ఇంజినీరింగ్‌ అధికారులు కనీస సమాచారం కూడా అందించడం లేదు.
- మద్దూరి సుబ్బలక్ష్మి, జెడ్పీటీసీ సభ్యురాలు, ఆత్రేయపురం

Advertisement

తప్పక చదవండి

Advertisement