జన్మభూమి కమిటీల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు.
విజయవాడ: జన్మభూమి కమిటీల పనితీరుపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. విజయవాడలో శనివారం టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ పథకాలకు లబ్దిదారులను ఎంపిక చేసే కమిటీలపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది.
అధికారం చేపట్టిన రెండేళ్ల నుంచి అన్ని ప్రభుత్వ పథకాలకు లబ్దిదారుల ఎంపికను ప్రభుత్వం జన్మభూమి కమిటీలకు అప్పగించింది. జిల్లాల నుంచి ఆ కమిటీలపై పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో ప్రభుత్వం ఆలోచనలో పడింది. జన్మభూమి కమిటీ వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
అదే విధంగా టీడీపీ జిల్లా ఇంఛార్జ్ ల పనితీరుపై కూడా చంద్రబాబు మండిపడ్డారు. జిల్లా ఇంఛార్జ్ లు బాధ్యతలు తీసుకోవడంలేదని.. మొక్కుబడిల వ్యవహరించవద్దని నేతలకు చంద్రబాబు క్లాస్ తీసుకున్నారు. ప్రతి కేబినెట్ సమావేశం తర్వాత సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. ఎమ్మెల్యేలు, నియోజక వర్గ ఇంఛార్జ్లకు బాధ్యతలు అప్పగించడం వల్ల పథకాలు లబ్దిదారులకు అందుతాయని మంత్రులు చంద్రబాబుకు సూచించారు. దీంతో విపక్షాల విమర్శలు, కోర్టు కేసుల నేపథ్యంలో కమిటీలు రద్దు చేయాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తుంది.