
గ్రాసం ‘వేశారు’!
‘గ్రాసం మేశారు’ శీర్షికతో ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు.
♦ ‘సాక్షి’ కథనంతో అధికారుల్లో కదలిక
♦ 20 ఎకరాల్లో పశుగ్రాసం సాగు
పరిగి: ‘గ్రాసం మేశారు’ శీర్షికతో ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. సోమ, మంగళవారాల్లో రైతులతో లఖ్నాపూర్ చెరువులోని సుమారు 20 ఎకరాల్లో పశుగ్రాసం విత్తనాలు సాగుచేయించారు. చెరువు భూమిలో పశుగ్రాసం విత్తనాలు వేయకుండా.. పుచ్చకాయ పంట సాగుకోసం కొందరు వ్యాపారులతో అనధికారిక ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్త యంత్రాంగంలో కదలిక తెచ్చింది. అయితే పుచ్చకాయల పంటను ధ్వంసం చేయకుండా..
ఆ పక్కనే ఉన్న మరికొంత స్థలాన్ని చదను చేయించి గడ్డి విత్తనాలు వేయించారు. ఈ విషయంపై వెటర్నరీ వైద్యుడు రామకృష్ణ మాట్లాడుతూ.. తాము ఫిబ్రవరిలోనే లఖ్నాపూర్ రైతులకు వందశాతం సబ్సిడీపై 400 కిలోల పశుగ్రాసం విత్తనాలను అందజేసిన మాట వాస్తవమేనన్నారు. రైతులు సకాలంలో వీటిని వేయలేదని తెలిపారు. విత్తనాలు పంపిణీ చేసినా.. పశుగ్రాసం పెంచుతున్నట్లు రికార్డుల్లో రాసుకోలేదని స్పష్టంచేశారు. ‘సాక్షి’లో వార్త ప్రచురితమయ్యాక రైతులను ఒప్పించి సోమవారం విత్తనాలు వేయించామని తెలిపారు.