breaking news
animal fodder
-
రైతాంగాన్ని ఆదుకోకుంటే ఆందోళనే
రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జంగారెడ్డి యాచారం: కరువు పరిస్థితుల నేపథ్యంలో రైతాంగం దిక్కుతోచని స్థితిలో ఉంది, తక్షణమే ప్రభుత్వం ఆదుకోకపోతే ఆందోళన తప్పదని రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పి.జంగారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రంలో శుక్రవారం మండల రైతు సంఘం సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరైన ఆయన మాట్లాడుతూ... తాగునీరు, పశుగ్రాసం లేక మూగజీవాలను కాపాడుకోవడం కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారని అన్నారు. అప్పులు చేయడం, నగలు తాకట్టు పెట్టడం, సంతలో పశువులను కబేళాలలకు విక్రయాలు జరపడం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకు ఉచితంగా పశుగ్రాసం సరఫరా చేసి తాగునీటి సౌకర్యాం కల్పించాలని డిమాండ్ చేశారు. ఫార్మాకు భూసేకరణ చేస్తున్న యాచారం, కడ్తాల్, ఆమన్ గల్ మండలాల్లో రైతుల అంగీకారం మేరకే భూసేకరణ చేసి 2013 చట్టం మేరకే పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతుల మద్దతుగా ఆందోళనలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా కార్యదర్శి బి. మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ... ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాదా బైనామాలను ఎలాంటి షరతులు లేకుండా అరు్హలైన పేద రైతులకు సర్టిఫికెట్లు జారీ చేయాలని డిమాండ్ చేశారు. పాల ఉత్పత్తిపై ఆధారపడిన రైతులకు తక్షణమే పాల ధర పెంచి ఆదుకోవాలని కోరారు. కార్యక్రమంలో మండల కార్యదర్శి తావునాయక్, మండల కమిటీ సభ్యు లు చంద్రయ్య, జంగారెడ్డి, కిష్ణరెడ్డి, శ్రీశైలం,బాషయ్య, మైసయ్య, సత్తయ్య పాల్గొన్నారు. -
గ్రాసం ‘వేశారు’!
♦ ‘సాక్షి’ కథనంతో అధికారుల్లో కదలిక ♦ 20 ఎకరాల్లో పశుగ్రాసం సాగు పరిగి: ‘గ్రాసం మేశారు’ శీర్షికతో ఆదివారం సాక్షిలో ప్రచురితమైన కథనానికి పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. సోమ, మంగళవారాల్లో రైతులతో లఖ్నాపూర్ చెరువులోని సుమారు 20 ఎకరాల్లో పశుగ్రాసం విత్తనాలు సాగుచేయించారు. చెరువు భూమిలో పశుగ్రాసం విత్తనాలు వేయకుండా.. పుచ్చకాయ పంట సాగుకోసం కొందరు వ్యాపారులతో అనధికారిక ఒప్పందం కుదుర్చుకున్నారనే వార్త యంత్రాంగంలో కదలిక తెచ్చింది. అయితే పుచ్చకాయల పంటను ధ్వంసం చేయకుండా.. ఆ పక్కనే ఉన్న మరికొంత స్థలాన్ని చదను చేయించి గడ్డి విత్తనాలు వేయించారు. ఈ విషయంపై వెటర్నరీ వైద్యుడు రామకృష్ణ మాట్లాడుతూ.. తాము ఫిబ్రవరిలోనే లఖ్నాపూర్ రైతులకు వందశాతం సబ్సిడీపై 400 కిలోల పశుగ్రాసం విత్తనాలను అందజేసిన మాట వాస్తవమేనన్నారు. రైతులు సకాలంలో వీటిని వేయలేదని తెలిపారు. విత్తనాలు పంపిణీ చేసినా.. పశుగ్రాసం పెంచుతున్నట్లు రికార్డుల్లో రాసుకోలేదని స్పష్టంచేశారు. ‘సాక్షి’లో వార్త ప్రచురితమయ్యాక రైతులను ఒప్పించి సోమవారం విత్తనాలు వేయించామని తెలిపారు. -
మూగజీవాల ఆకలి వేదన
మూగజీవాలకు పెద్ద కష్టమొచ్చింది. గ్రాసం లేక ఆకలి బాధలు మొదలయ్యాయి. తమ ప్రమేయం లేకుండానే బలిపీఠమెక్కుతున్నాయి. వరుస కరువుతో రాయలసీమలో పొలాలు బీళ్లుగా మారి పశువులకు గ్రాసం కొరత ఏర్పడింది. తమ జీవనోపాధికే ఇబ్బందులు ఎదురైన రైతులు తప్పని పరిస్థితుల్లో పుట్టెడు దుఃఖంతో వాటిని అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఎండనక, వాననక కష్టపడుతూ, చివరకు తమ మల, మూత్రాల ద్వారాకూడా పంటల సాగుకు ఉపయోగపడుతూ మానవజాతికి ప్రాణాధారమైన ఆహార ఉత్పత్తులకు తోడ్పడుతున్న మూగ జీవాలు, చివరి క్షణంలోకూడా మనుషులకు ఆహారంగానే కబేళాలకు తరలిపోతున్నాయి. అప్పటిదాకా ఆలనాపాలనా చూసిన తమ యజమానులకు దూరమవుతున్నామని అవిపడుతున్న మూగ వేదన సీమ జనానికి కంటనీరు పెట్టిస్తున్నాయి. అనంతపురం జిల్లాలో ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు. - సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాయలసీమలో మూడేళ్లుగా పంటల్లేవు. ఈ ఏడాదీ అదే పరిస్థితి. పంటల్లేకపోవడంతో గ్రాసం నిల్వలు లేవు. వర్షం లేక ‘అనంత’లో ఎక్కడా పచ్చిగడ్డి మొలక కన్పించడం లేదు. దీంతో గ్రాసం సమకూర్చలేక, పశువులను కాపాడుకునేందుకు మరో మార్గం లేక రైతులు వాటికి అమ్మేస్తున్నారు. ఆరోగ్యంగా ఉన్న ఎద్దులను ఇతర ప్రాంతాల రైతులు కొంటుంటే, బక్కచిక్కిన వాటిని వ్యాపారులు కబేళాలకు తరలిస్తున్నారు. కనిపించని గ్రాసం నిల్వలు గతంలో పల్లెలకు వెళితే వేరుశనగ, వరి గడ్డి వాములు కనిపించేవి. ఏడాది పాటు పశువులకు గ్రాసాన్ని నిల్వ చేసుకునేవారు. మరో ఏడాది వర్షం కురవకపోతే నిల్వచేసుకున్న గ్రాసం ఊరట కలిగించేది. జిల్లాలో మూడేళ్లుగా పంటలు లేవు. మరీముఖ్యంగా గతేడాది దారుణమైన పరిస్థితి. 5.06లక్షల హెక్టార్లలో వేరుశనగ సాగుచేయగా వర్షాభావంతో మొత్తం ఊడ్చుకుపోయింది. దీనివల్ల 20-30 ఎకరాలున్న పెద్ద రైతుల కల్లాల్లోనూ గడ్డివాములు కన్పించడం లేదు. పొలాల గట్లపై, కొండ గుట్టలపై కూడా గడ్డి దొరకడం లేదు. భూగర్భజలాలు కూడా అడుగంటడంతో పెద్దపెద్ద వృక్షాలే నిలువునా ఎండిపోతున్నాయి. దీంతో పశువులకు మేత అందించడం రైతులకు సాధ్యం కాలేదు. ఈ ఏడాది రెండువేల మెట్రిక్టన్నుల వరిగడ్డిని పశుసంవర్ధకశాఖ అధికారులు పంపిణీ చేసినా.. కొరత తీరలేదు. కబేళాలకు పశుసంపద ప్రతి ఆదివారం అనంతపురం, గోరంట్ల, కదిరిలో పశువుల సంతలు జరుగుతాయి. ఇంతకుముందు రైతులు సంతకు పాడిపశువులు, ఎద్దులను కొనేందుకు వెళ్లేవారు. ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రతి రైతూ పశువులను విక్రయించడానికి మాత్రమే వస్తున్నారు. కేరళ, తమిళనాడు, హైదరాబాద్లోని 'మీట్ మార్కెట్ల'కు ఈ పశువులు వెళుతున్నాయి. ప్రతివారం వేల సంఖ్యలో తరలిపోతున్నాయి. 2007-08 పశుగణన ప్రకారం జిల్లాలో 15.42 లక్షల గేదెలు, ఆవులు, ఎద్దులు ఉండేవి. 2013కు వీటి సంఖ్య 9.30 లక్షలకు తగ్గింది. ప్రస్తుతం మరో 1.50 లక్షల పశువులు తగ్గిపోయి ఉంటాయని పశుసంవర్ధకశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అందులోనూ కదిరి, ధర్మవరం డివిజన్లలో పశువుల సంఖ్య తీవ్రంగా తగ్గిపోయింది. ఇప్పటికైనా ప్రభుత్వం పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా గడ్డి పంపిణీ చేయకపోతే పశుసంపద మరింత తరగిపోయే ప్రమాదముంది. గడ్డి లేదయ్యా.. ఎక్కడా గడ్డి లేదయ్యా! వానలేక తోట మొత్తం ఎండిపోయింది. రైతుల బతుకు కష్టంగా మారింది. మూగజీవుల పరిస్థితి మరీ దారుణం. ఎక్కడైనా గడ్డి కొందామంటే చేతిలో చిల్లగవ్వలేదు. అప్పుచేసి కొన్నా గడ్డి దొరకడం లేదు. దీనివల్లే ఎద్దులను అమ్ముదామని మార్కెట్కు వచ్చినా. - వన్నూరప్ప, జంతలూరు, బుక్కరాయసముద్రం మండలం గడ్డి లేకే అమ్మాల్సి వస్తోంది ఏడాది కిందట రూ. 40 వేలకు కాడెద్దులను కొన్నా. వ్యవసాయపనులకు ఉపయోగపడతాయి. రైతులకు బాడుగకు వెళితే కాస్త ఆర్థికంగా మేలుంటుందని కొన్నా. తీరా చూస్తే వాటిని పోషించేందుకు గడ్డి లేదు. దీంతో ఎద్దులను రూ. 24 వేలకు అమ్మేశా. కేవలం గడ్డిలేకనే వాటిని అమ్మేశా. సంతలో పశువుల అమ్మకాలు చూస్తుంటే మళ్లీ నేను ఎద్దులు కొనాలంటే దొరుకుతాయా లేదా అని భయమేస్తోంది. - రామన్న, రైతు, పి. కొత్తపల్లి, ఆత్మకూరు మండలం