అవ్వా..బాగున్నవా అంటూనే..
‘అవ్వా..బాగున్నవా.. ఏడికి పోయినవ్...చాన రోజులైతంది కనబడక..’అంటూ ఆ వృద్ధురాలితో మాటలు కలిపిన అపరిచితులు అదను చూసి ఆమె మెడలో పుస్తెలతాడును తెంపుకుపోయారు.
సుల్తానాబాద్(కరీంనగర్): ‘అవ్వా..బాగున్నవా.. ఏడికి పోయినవ్...చాన రోజులైతంది కనబడక..’అంటూ ఆ వృద్ధురాలితో మాటలు కలిపిన అపరిచితులు అదను చూసి ఆమె మెడలో పుస్తెలతాడును తెంపుకుపోయారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా సుల్తానాబాద్ మండలంలో జరిగింది. మండలంలోని నీరుకుల్ల పంచాయతీ రంగంపల్లికి చెందిన అల్లాడి తిరుపతమ్మ(70) బుధవారం మధ్యాహ్నం కిరోసిన్ తెచ్చుకునేందుకు నీరుకుల్ల గ్రామానికి ఒంటరిగా నడిచి వెళుతోంది. అదే సమయంలో వెనుక నుంచి బైక్‌పై ఇద్దరు యువకులు ఆమె వద్దకు వచ్చి అవ్వా..బాగున్నవా..అంటూ మాటలు కలిపారు.
అవ్వతో మాట్లాడుతూనే ఆమె మెడలోని పుస్తెలతాడును తెంపుకుని క్షణాల్లో అక్కడినుంచి మాయమయ్యారు. ఈ మేరకు బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. అప్రమత్తమైన పోలీసులు నాలుగు రహదారులను దిగ్బందించి అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. కాగా, మంగళవారం రాత్రి జవహర్‌నగర్‌లో నడిచివెళుతున్న బండి రేష్మ అనే మహిళ మెడలో ఉన్న పుస్తెలతాడును యువకులు లాక్కుని పోయేందుకు యత్నించారు. ఆమె కేకలు వేయడంతో రోల్డ్‌గోల్డ్ నల్లపూసల తాడు తెంపుకుని పోయారని బాధితురాలి భర్త సతీష్ తెలిపారు.


