తెగుళ్లపై అప్రమత్తం | alert on diseases says scientists | Sakshi
Sakshi News home page

తెగుళ్లపై అప్రమత్తం

Oct 12 2016 11:51 PM | Updated on Sep 4 2017 5:00 PM

తెగుళ్లపై అప్రమత్తం

తెగుళ్లపై అప్రమత్తం

కూరగాయల పంటల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే టమోటా, మిరపలో ఆశించే పురుగులు, తెగుళ్లపై అప్రమత్తంగా ఉంటూ సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకోవాలని కళ్యాణదుర్గం కషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు.

టమోటా, మిరపలో సస్యరక్షణ చర్యలు చేపట్టండి
కళ్యాణదుర్గం కేవీకే కో ఆర్డినేటర్‌ జాన్‌సుధీర్‌

అనంతపురం అగ్రికల్చర్‌ : కూరగాయల పంటల్లో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే టమోటా, మిరపలో ఆశించే పురుగులు, తెగుళ్లపై అప్రమత్తంగా ఉంటూ సకాలంలో సస్యరక్షణ చర్యలు చేపట్టి నివారించుకోవాలని కళ్యాణదుర్గం కషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ ఎం.జాన్‌సుధీర్, శాస్త్రవేత్త ఆదినారాయణ తెలిపారు. ఈ పంటలకు ఎక్కువ పెట్టుబడులు పెడుతూ చాలా మంది రైతులు నష్టపోతున్న నేపథ్యంలో కొన్ని మెలకువలు పాటించాలన్నారు. ఇపుడున్న వాతావరణ పరిస్థితుల వల్ల మిరప, టమోటాలో వివిధ రకాల తెగుళ్లు ఆశించడం, మరికొన్ని తెగుళ్లు ఆశించే అవకాశం ఉందన్నారు.

టమోటా : టమోటాలో ఎక్కువగా కాయమచ్చ తెగులు, ఫ్యుజేరియం ఎండు తెగులు కనిపిస్తోంది. బ్యాక్టీరియా ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. వర్షాకాలంలో ఉధతి అధికంగా ఉంటుంది. మచ్చ వచ్చిన కాయలు తొలగించాలి. 30 గ్రాములు బ్లైటాక్‌ + 2 గ్రాములు స్ట్రెప్టోసైక్లీన్‌ 10 లీటర్ల నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. శిలీంధ్రం ద్వారా వ్యాపించే ఫ్యుజేరియం తెగులును గుర్తించడానికి మొక్కలు పీకి కాండం చీల్చి చూస్తే మధ్యలో గోధుమ రంగులో చారలు, నల్లటి రంగులో కణజాలం కనిపిస్తుంది. 3 గ్రాములు బ్లైటాక్స్‌ ఒక లీటర్‌ నీటిలో కలిపిన ద్రావణంలో నాటే మందు వేర్లను ముంచాలి. పైరు నాటిన తర్వాత వ్యాపిస్తే ఎకరాకు ఒక కిలో బ్లైటాక్స్‌ను డ్రిప్‌ ద్వారా వదలాలి. అలాగే 1 గ్రాము సాఫ్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. పచ్చపురుగు ఉన్నట్లు గమనిస్తే 1 మి.లీ ఇండాక్సికార్బ్‌ లేదా 1.5 మి.లీ థయోడికార్బ్‌ లేదా 1.5 మి.లీ నొవాల్యురాన్‌ ఒక లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేయాలి.

మిరప : మిరపలో ప్రస్తుతం తామర పురుగులు, నల్లి ఆశించాయి. తామర పురుగులో తొలిదశలో ఆశిస్తే మొక్కలు గిడసబారి పూత సరిగా రాక దిగుబడులు తగ్గిపోతాయి. 3 మి.లీ ఫొసలోన్‌ లేదా 2 మి.లీ డైమిథోయేట్‌ లేదా 1.6 మి.లీ మోనోక్రోటోఫాస్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి. నల్లి ఆశించిన మొక్కలు ముదురు ఆకుపచ్చ రంగుకు మారి ఆకుల పెరుగుదల తగ్గి, పూత ఆగిపోయి, దిగుబడి బాగా తగ్గిపోతుంది. 3 గ్రాములు నీటిలో కరిగే గంధకం లేదా 5 మి.లీ డైకోఫాల్‌ లేదా 3 మి.లీ ఫొసలోన్‌ లీటర్‌ నీటికి కలిపి పిచికారి చేసుకోవాలి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement