సాగుబడి
ఇంటి పంట - 24
మిద్దె /పెరటి తోటల్లో మొక్కలకు వచ్చే వివిధ రకాల ఫంగస్, తెగుళ్లు, పురుగుల నివారణకు బేకింగ్ సోడా (వంట సోడా & Sodium Bicarbonate) ఒక అద్భుతమైన, తక్కువ ఖర్చుతో కూడిన సేంద్రియ నివారణ మార్గం. ఇది మొక్కల ఆకులపై తెల్లటి బూజు తెగులు, నల్ల మచ్చలను తగ్గించటంలో సహాయపడుతుంది.
1. బేకింగ్ సోడా ద్రావణం తయారు చేసే విధానం: 1 లీటరు నీరు + 1 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా + 1 టీస్పూన్ మైల్డ్ లిక్విడ్ సోప్ (లేదా వంట నూనె) బాగా కలపాలి.
2. చిక్కుడు, గుమ్మడి, దోస, టమాటా వంటి మొక్కలకు వచ్చే తెల్లటి బూజు, ఆకులపై నల్ల మచ్చల నివారణకు ఈ ద్రావణం బాగా ఉపయోగం.
3. అఫిడ్స్, నల్లి, గొంగళి పురుగులు వంటి మెత్తటి శరీరం గల కీటకాలను, వాటి సంతతిని అరికడుతుంది.
4. మిద్దె తోటలో చీమల నివారణకు బేకింగ్ సోడాను ఉపయోగించవచ్చు. అయితే, దీన్ని నేరుగా మొక్కల మీద కాకుండా, చీమలు తిరిగే మార్గాల్లో మాత్రమే ఉపయోగించాలి. సమపాళ్లలో బేకింగ్ సోడా, పంచదార పొడి బాగా కలపి ఈ మిశ్రమాన్ని చిన్న మూతల్లో/ చిన్న పళ్లెంలో వేసి చీమలు ఎక్కువగా తిరిగే కుండీల అంచుల వద్ద లేదా నేల మీద ఉంచాలి. తీపికి ఆకర్షితమై చీమలు ఈ మిశ్రమాన్ని తింటాయి. అది వాటి పొట్టలోకి వెళ్లగానే బేకింగ్ సోడా రసాయనిక చర్య జరిపి కార్బన్ డయాక్సైడ్ గ్యాస్‌ను ఉత్పత్తి చేస్తుంది, దీనివల్ల చీమలు చనిపోతాయి.
5. మట్టి కొద్దిగా ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటే, బేకింగ్ సోడా దాన్ని కొద్దిగా ఆల్కలీన్ (క్షార) స్థితికి తెస్తుంది.
6. టమాటా మొక్కల మొదళ్ల చుట్టూ కొద్దిగా బేకింగ్ సోడా చల్లటం ద్వారా
మట్టిలోని ఆమ్లతను తగ్గించి, టమాటాలు మరింత రుచిగా /తీయగా మారేలా
చేయవచ్చు.
7. బేకింగ్ సోడాను మితిమీరి వాడితే మొక్కల ఆకులు కాలిపోయే అవకాశం ఉంది. ద్రావణం పలుచగా ఉండేలా చూసుకోవాలి (1% కంటే ఎక్కువ ఉండకూడదు). మట్టిలో సోడియం శాతం పెరిగి మొక్కల ఎదుగుదలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
8. ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు స్ప్రే చేయకూడదు. తెల్లవారుజామున లేదా సాయంత్రం వేళల్లో స్ప్రే చేయటం మంచిది. ఒకేసారి అన్ని మొక్కలపై కాకుండా, ఒక చిన్న కొమ్మపై స్ప్రే చేసి 24 గంటల తర్వాత ఫలితాన్ని గమనించి, మిగిలిన మొక్కలకు వాడాలి.
9. తెగులు ఎక్కువగా ఉన్నప్పుడు వారానికి 1–2 సార్లు పిచికారీ చేయాలి.
- కొల్లి కృష్ణ కుమారి, అడ్మిన్, గుంటూరు జిల్లా, మిద్దె తోటల బృందం, మొబైల్: 94906 02366
నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్
ఇదీ చదవండి: భూతాపంతో రైతులకు పెను ముప్పు.. ఐరాస హెచ్చరిక!


