
ప్రమాదానికి కారణమైన ఇంకుడుగుంత
ప్రమాదవశాత్తు ఇంకుడు గుంతలో పడి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని గవ్వలపల్లి గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది.
- గవ్వలపల్లి గ్రామంలో సంఘటన
చిన్నశంకరంపేట: ప్రమాదవశాత్తు ఇంకుడు గుంతలో పడి మహిళ మృతి చెందిన సంఘటన మండలంలోని గవ్వలపల్లి గ్రామంలో గురువారం ఉదయం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన సంగెం నర్సింలు, రుక్కమ్మల కుమార్తె టాంటాం లక్షి్మ(45) ఇంకుడు గుంతలో కాలుజారి పడి మృతి చెందింది.
ఇంటి ముందు నిర్మిస్తున్న ఇంకుడు గుంతలో రాళ్లను వేసి కుండీని దించారు. మరిన్ని రాళ్లను గుంతలో వేస్తూ ప్రమాదవశాత్తు కాలుజారి గుంతలో పడింది. దీంతో గుంతలోని కుండిపై గొంతుపై గాటుపడి ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. కాగా లక్షి్మకి శివ్వంపేట మండలం చండూర్ నివాసికి పెళ్లి జరిగింది.
ఆమెకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. భర్త బాల్‌రాజ్‌తో గొడవపడి ఆమె రెండేళ్లుగా తల్లిగారి వద్దనే ఉంటోంది. నిరుపేదలైన లక్ష్మి తల్లిదండ్రులు పూరిగుడిసెలో నివాసం ఉంటున్నప్పటికీ ప్రభుత్వం అందిస్తున్న వ్యక్తిగత మరుగుదొడ్డితో పాటు ఇంకుడు గుంతను నిర్మించుకునేందుకు ముందుకు వచ్చారు.
ఇంటి ముందు కాలి స్థలం తక్కువగా ఉంది. దీంతో ఇంట్లోకి వచ్చేందుకు దారి ఇరుకుగా మారింది. ఈ క్రమంలో ఉదయమే ఇంకుడు గుంతలో కుండిని పెట్టి కంకర వేసి మట్టిని కప్పేయాలని తొందరగా పనులు మొదలు పెట్టారు. ఇంతలో ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.
ఇంకుడు గుంత మహిళ ప్రాణం తీసిందని ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న రామాయంపేట ఏఎంసీ చైర్మన్ గంగా నరేందర్, గ్రామ మాజీ సర్పంచ్ పట్లోరి రాజు బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం సహాయం అందించి ఆదుకోవాలని లక్ష్మి తల్లిదండ్రులు కోరారు.