గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) ఓ వివాదంతో మరోసారి వార్తల్లో కెక్కింది.
గుంటూరు: గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి (జీజీహెచ్) ఓ వివాదంతో మరోసారి వార్తల్లో కెక్కింది. అప్పుడే పుట్టిన తమ బాబును మార్చేశారంటూ ఓ తల్లి తీవ్ర ఆందోళన చెందుతుంది. ఈ ఘటన గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో శనివారం ఉదయం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి... కాన్పు కోసం వచ్చిన ఓ గర్భిణి ఓ పండంటి బాబుకు జన్మనిచ్చింది. అయితే, ఆమె చేతికి మాత్రం అమ్మాయిని ఇచ్చారు. దీంతో ఆ తల్లి ఆందోళనకు గురై కుటుంబసభ్యులతో కలసి ఆస్పత్రి సిబ్బందిని నిలదీశారు. ఆస్పత్రి యాజమాన్యాన్ని ఈ విషయమై సంప్రదించగా... వారికి పుట్టింది పాప అని.. అయితే పొరపాటున ఆస్పత్రి నర్స్ అబ్బాయి అని చెప్పడంతో వివాదం చెలరేగిందని వివరణ ఇచ్చుకున్నారు.
నేడు ఒకే ఒక్క కాన్పు జరిగిందని.. పసివాళ్ల మార్పు జరిగే అవకాశాలే లేవని ఆస్పత్రి వర్గాలు తమపై వస్తోన్న ఆరోపణల్ని కొట్టిపారేశాయి. కానీ.. ఆస్పత్రిలోనే ఎదో గందరగోళం జరిగిందని బాధిత కుటుంబం ఆందోళన చేపట్టడంతో ఆస్పత్రి వర్గాలు తలలు పట్టుకోవాల్సి వచ్చింది. డబ్బులు ఇవ్వనందుకు తమ బిడ్డను మార్చివేశారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఆస్పిత్రి సిబ్బంది అడిగితే తాము డబ్బులు ఇవ్వని కారణంగానే బాబుని మార్చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు.