90 శాతం మూతే! | 90% granite quarrys are going to shut down | Sakshi
Sakshi News home page

90 శాతం మూతే!

Jun 2 2017 11:15 AM | Updated on Sep 5 2017 12:40 PM

90 శాతం మూతే!

90 శాతం మూతే!

క్వారీల్లో అడుగడుగునా అక్రమాలే.యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమిస్తున్నారు.

► అధికారులు ఒత్తిళ్లకు లొంగకుంటేనే..
► క్వారీల తనిఖీల్లో వెలుగుచూస్తున్న అక్రమాలు
► నివేదికలు సిద్ధం చేస్తున్న ప్రత్యేక బృందాలు
► నేటితో ముగియనున్న బృందాల తనిఖీలు


సాక్షి, అమరావతి బ్యూరో : క్వారీల్లో అడుగడుగునా అక్రమాలే. యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమిస్తున్నారు. కార్మికుల భద్రత కోసం ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా అనుమతులు లేకుండానే క్వారీలు నడుపుతున్నారు. కలెక్టర్‌ నియమించిన ప్రత్యేక బృందాల తనిఖీల్లో ఈ విషయాలు వెల్లడవుతున్నాయి. ఫిరంగిపురం సమీపంలోని క్వారీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు బండరాళ్ల కింద సమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన క్వారీ వద్ద నిబంధనలు అతిక్రమించడంతో పాటు ఎలాంటి భద్రతా చర్యలూ తీసుకోలేదని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. జిల్లాలోని 224 రోడ్డు మెటల్‌ క్వారీల తనిఖీ కోసం కలెక్టర్‌ కోన శశిధర్‌ నియమించిన ఆరు ప్రత్యేక బృందాలు ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. శుక్రవారంతో తనిఖీలు ముగియనున్నాయి.

అనుమతులు లేకుండా...
ఆరు ప్రత్యేక బృందాలు ఇప్పటికి 80 శాతానికి పైగా రోడ్డు మెటల్‌ క్వారీలను తనిఖీ చేశాయి. ఇందులో ఏ ఒక్కటీ నిబంధనల ప్రకారం నడవటం లేదని అధికారులు తేల్చినట్లు సమాచారం. ప్రత్యేక బృందం తనిఖీలలో ప్రధానంగా క్వారీలను పర్యావరణ అనుమతులు లేనట్లు తెలిసింది. బ్టాస్టింగ్‌ అనుమతులు, మైన్‌ లీజు, జనావాసాలకు దగ్గరగానే బ్లాస్టింగ్‌ చేయడం, లీజు ప్రాంతం దాటి మైనింగ్‌ చేయడం, కార్మికులకు సంబంధించి ఎటువంటి భద్రతా ప్రమాణాలనూ క్వారీ యజమానులు పాటించకపోవడాన్ని నిర్ధారించారు. క్వారీల సమీపంలో మొక్కల పెంపకం, కార్మిక చట్టాల మేరకు కార్మికులకు అందుతున్న కూలి.. ఇలా 37 అం«శాలను పరిశీలిస్తున్నారు.

మొక్కుబడిగా తనిఖీలు..
ఈ బృందాల్లో కొంత మంది అధికారులు క్వారీలను నామమాత్రంగా చూసి మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు పరిశీలించిన ప్రతి క్వారీకి సంబంధించి, అక్కడ ఉన్న లోపాలపై అధికారులు నోటీసులు జారీ చేశారు. తాత్కాలికంగా క్వారీలను నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. తనిఖీ బృందాలు వస్తున్నాయనే సమాచారంతో క్వారీ యజమానులు ముందుగానే క్వారీల్లో పనులను నిలిపివేసినట్లు సమాచారం. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకూ తావు లేకుండా కఠినంగా చర్యలు తీసుకొంటే 90 శాతానికి పైగా క్వారీలు మూతపడక తప్పదని ప్రత్యేక బృందాలలోని ఓ అధికారి పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాల తనిఖీల నివేదిక ఆధారంగా కలెక్టర్‌ ఎటువంటి చర్యలు తీసుకొంటారనేది వేచిచూడాలి. ఇప్పటికే కొంత మంది క్వారీ యజమానులు అధికార పార్టీ పెద్దల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, గండం నుంచి గట్టెక్కించాలని కోరినట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. çప్రమాద సంఘటనలు జరిగినప్పుడు అధికారులు ఇలాంటి హడావుడి చేయడం మామూలేనని, కొంతకాలం గడిస్తే మళ్లీ యథాతథమే అవుతుందని వారికి నేతలు భరోసా ఇస్తున్నారని  తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement