breaking news
granite quarrys
-
చేయితడిపితే చాలు గ్రీన్ సిగ్నల్
సాక్షి, నెల్లూరు: జిల్లాలో జాతీయ రహదారిపై గ్రానైట్ అక్రమరవాణా అధికారుల సహకారంతో జోరుగా సాగుతోంది. ఎలాంటి బిల్లులు చెల్లింపుల్లేకుండానే గ్రానైట్‌ను అధికారులే నెలవారీ మామూళ్లతో రాష్ట్ర సరిహద్దులు దాటిస్తున్నారు. అధికలోడుతో వెళ్తున్న గూడ్స్, గ్రావెల్, కంకర, గ్రానైట్ లోడింగ్‌తో లారీలు నిత్యం రవాణా సాగిస్తూనే ఉన్నాయి. అడపాదడపా మాత్రమే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారుల తనిఖీల్లో మాత్రమే ఈ విషయం బయటపడుతోంది. విజిలెన్స్ తనిఖీలు లేనప్పుడు మాత్రం యథావిధిగా అక్రమరవాణా సాగుతుంది. ప్రతిరోజూ వెళుతున్నా.. ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి, అద్దంకి, సంతనూతలపాడు పరిధిలో విస్తారంగా ఉన్న గ్రానైట్ క్వారీలు నుంచి క్వాలిటీను ఇతర రాష్ట్రాలు, దేశాలకు తరలిస్తుంటారు. ఇంకా శ్రీకాకుళం జిల్లా టెక్కిలి ప్రాంతంలోని గ్రానైట్ క్వారీల నుంచి కూడా తరలుతోంది. ప్రకాశం నుంచి వెళ్లే గ్రానైట్‌కు విదేశాల్లో కూడా మంచి డిమాండ్ ఉంది. క్వాలిటీ గ్రానైట్ పలకలను మాత్రం బెంగళూరు, చెన్నై, కేరళ రాష్ట్రాలకు కూడా తరలిస్తున్నారు. ఇలా ప్రతిరోజూ సుమారు 30 నుంచి 50 వాహనాల్లో వివిధ రకాల గ్రానైట్ ముడిసరుకు, క్వాలిటీ పలకలు కూడా పంపిస్తున్నారు. గ్రానైట్ సరుకును క్వాలిటీని బట్టి ఏ, బీ, సీ, డీగా విభజించి క్వారీ యజమానులు విక్రయాలు చేస్తారు. ప్రభుత్వ ఖజానాకు చిల్లు పెట్టి.. ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల నుంచి నిత్యం తరలివెళ్లే గ్రానైట్‌కు ఎలాంటి బిల్లులుండవు. మైనింగ్, కమర్షియల్ ట్యాక్స్‌కు చెల్లించాల్సిన ట్యాక్స్‌లు చెల్లించకుండానే అధికారులకు నెలవారీ మామూళ్లు ఫిక్స్ చేసి తరలిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గ్రానైట్ క్వారీ నుంచి తీసే ముడిసరుకు క్వాలిటీని బట్టి క్యూబిక్ మీటర్ వంతున మైనింగ్ శాఖకు ట్యాక్స్ చెల్లించాలి. బిల్లు చెల్లించి మైనింగ్ జీయాలజీ నుంచి ట్రాన్సిల్పాస్ తీసుకుని సరుకు రవాణ సాగించాలి. అనంతరం గ్రానైట్ తరలింపునకు కమర్షియల్ ట్యాక్స్‌కు 18 శాతం జీఎస్టీ చెల్లించాలి. ఒకవేళ ఎక్స్పోర్ట్కు మాత్రం ఒక శాతం మాత్రమే చెల్లించాల్సి ఉంది. కానీ ఆయా శాఖలకు ఎలాంటి చెల్లింపులు చేయడం లేదు. అలాగే ఓవర్ టన్నేజీ ఒక్కో వాహనంలో సుమారు 50 టన్నుల వరకు గ్రానైట్ ముడి సరుకును రాష్ట్ర, దేశ సరిహద్దులు దాటిస్తున్నారు. పైలెట్ల ద్వారా.. ప్రకాశం జిల్లా నుంచి వెళ్లే గ్రానైట్ వాహనాల అక్రమరవాణాకు పైలెట్ సహకారం ఉంటుంది. సహకరించే అధికారులకు వాహనాల నంబర్లు ఇస్తారు. వారు కాక ఇతర శాఖల అధికారులకు వాహనాలు పట్టుబడితే రూ.లక్షల్లో పెనాల్టీలు చెల్లించాల్సి రావడంతో వాహనాలను రాష్ట్ర సరిహద్దులు దాటించేందుకు ప్రత్యేకముఠా పైలెట్‌లా వ్యవహరిస్తోంది. పది కిలోమీటర్ల ముందుగా పైలెట్ వాహనం ఉంటుంది. రహదారులపై ఎలాంటి అధికారులు తనిఖీలు లేవని నిర్ధారించుకున్న తర్వాత గ్రానైట్ వాహనాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తారు. ఒకవేళ విజిలెన్స్ అధికారుల తనిఖీలుంటే మాత్రం ఆ వాహనాలను హైవే పక్కన నిలిపివేస్తారు. ఇలా పైలెట్‌లా వ్యవహరించే ముఠాకు ప్రత్యేక నగదు అందుతుంది. ► జిల్లాలో 2017–18లో ఎలాంటి పత్రాల్లేకుండా సరిహద్దులు దాటే వాహనాలపై విధించిన అపరాధరుసుం : రూ.4 కోట్లు ► 2018–19లో విధించిన మొత్తం : రూ.4.55 కోట్లు ► 2017–18లో నిబంధనలు ఉల్లంఘించడంతో విధించిన జరిమానా : రూ.11.69 కోట్లు ► 2018–19లో విధించిన అపరాధరుసుం: రూ.11.23 కోట్లు పై గణాంకాలు జాతీయ రహదారిపై ఎలాంటి అనుమతుల్లేకుండా, బిల్లులు చెల్లించకుండా అక్రమ రవాణా సాగిస్తున్న వాహనాల నుంచి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జరిమానా రూపంలో చేసిన వసూళ్లు. ఇవే కాకుండా గత రెండునెలలుగా మరో ఆరుసార్లు హైవేపై అక్రమరవాణాను గుర్తించి సుమారు మరో రూ.4 కోట్ల వరకు జరిమానా రూపంలో వసూలు చేశారు. ఇదంతా విజిలెన్స్ అధికారులు అడపాదడపా హైవేపై తనిఖీలు జరిపినప్పుడే మాత్రమే వచ్చినవి. నిత్యం తనిఖీలు చేస్తే ప్రభుత్వ ఖజానాకు మరెంతో లాభం చేకూరుతుంది. అధికారుల మామూళ్ల కక్కుర్తి.. వ్యాపారుల అక్రమార్జన వెరసీ ప్రభుత్వ ఖజానాకు చిల్లుపడుతోంది. కమర్షియల్ ట్యాక్స్, ట్రాన్స్పోర్ట్, మైనింగ్, పోలీస్ అధికారుల సహకారంతో రవాణా సాగుతోందనే విమర్శలున్నాయి. అధికలోడుతో.. కంకర, గ్రావెల్, సిలికాను తరలించే వాహనాలు కూడా పరిమితికి మించి అధికలోడుతో ఉంటున్నాయి. అలాగే బిల్లుల్లేకుండా బియ్యం, ధాన్యం రవాణా సాగుతోంది. నెల్లూరు టూ చెన్నై వరకు నిత్యం జరుగుతున్నా ఏ శాఖ అధికారులు పట్టుకున్న దాఖలాల్లేవు. విజిలెన్స్ అధికారులు చేసే అడపాదడపా దాడుల్లో మాత్రమే కొన్ని వాహనాలు పట్టుబడుతున్నాయి. రవాణా శాఖ అధికారులకు ప్రతి వాహనం నుంచి దళారుల ద్వారా మామూళ్లు అందుతున్నాయి. అలా చెల్లించిన వాహనం నంబర్ ఆ శాఖ అధికారుల జాబితాలో ఉంటుంది. వాటిని మాత్రం తనిఖీ చేయరు. బిల్లుల్లేకుండా వెళ్లే వాహనాలే కాదు కంకర, గ్రావెల్, సిలికా లారీలు పరిమితికి మించి అధికలోడుతో వెళ్లే వాహనాల నుంచి నెలవారీ మామూళ్లు అందుతున్నాయన్న ఆరోపణలున్నాయి. ఈక్రమంలో హైవేపై డ్యూటీలకు కొందరు అధికారులు ప్రాధాన్యత ఇస్తున్నారు. పోలీసులు సైతం హైవేపై స్టేషన్లలో పోస్టింగ్‌ల కోసం పైరవీలు చేసుకుని వస్తున్నారు. రెండేళ్లపాటు పనిచేస్తే చాలు నాలుగు రాళ్లు వెనకేసుకుని దర్జాగా ఉండొచ్చనే భావనతో ఉన్నారు. -
90 శాతం మూతే!
► అధికారులు ఒత్తిళ్లకు లొంగకుంటేనే.. ► క్వారీల తనిఖీల్లో వెలుగుచూస్తున్న అక్రమాలు ► నివేదికలు సిద్ధం చేస్తున్న ప్రత్యేక బృందాలు ► నేటితో ముగియనున్న బృందాల తనిఖీలు సాక్షి, అమరావతి బ్యూరో : క్వారీల్లో అడుగడుగునా అక్రమాలే. యథేచ్ఛగా నిబంధనలు అతిక్రమిస్తున్నారు. కార్మికుల భద్రత కోసం ఎలాంటి చర్యలూ తీసుకోవటం లేదు. జిల్లా వ్యాప్తంగా ఇష్టారాజ్యంగా అనుమతులు లేకుండానే క్వారీలు నడుపుతున్నారు. కలెక్టర్ నియమించిన ప్రత్యేక బృందాల తనిఖీల్లో ఈ విషయాలు వెల్లడవుతున్నాయి. ఫిరంగిపురం సమీపంలోని క్వారీ ప్రమాదంలో ఆరుగురు కార్మికులు బండరాళ్ల కింద సమాధి అయ్యారు. ప్రమాదం జరిగిన క్వారీ వద్ద నిబంధనలు అతిక్రమించడంతో పాటు ఎలాంటి భద్రతా చర్యలూ తీసుకోలేదని అధికారుల ప్రాథమిక విచారణలో తేలింది. జిల్లాలోని 224 రోడ్డు మెటల్ క్వారీల తనిఖీ కోసం కలెక్టర్ కోన శశిధర్ నియమించిన ఆరు ప్రత్యేక బృందాలు ఈ ప్రక్రియ కొనసాగిస్తున్నాయి. శుక్రవారంతో తనిఖీలు ముగియనున్నాయి. అనుమతులు లేకుండా... ఆరు ప్రత్యేక బృందాలు ఇప్పటికి 80 శాతానికి పైగా రోడ్డు మెటల్ క్వారీలను తనిఖీ చేశాయి. ఇందులో ఏ ఒక్కటీ నిబంధనల ప్రకారం నడవటం లేదని అధికారులు తేల్చినట్లు సమాచారం. ప్రత్యేక బృందం తనిఖీలలో ప్రధానంగా క్వారీలను పర్యావరణ అనుమతులు లేనట్లు తెలిసింది. బ్టాస్టింగ్ అనుమతులు, మైన్ లీజు, జనావాసాలకు దగ్గరగానే బ్లాస్టింగ్ చేయడం, లీజు ప్రాంతం దాటి మైనింగ్ చేయడం, కార్మికులకు సంబంధించి ఎటువంటి భద్రతా ప్రమాణాలనూ క్వారీ యజమానులు పాటించకపోవడాన్ని నిర్ధారించారు. క్వారీల సమీపంలో మొక్కల పెంపకం, కార్మిక చట్టాల మేరకు కార్మికులకు అందుతున్న కూలి.. ఇలా 37 అం«శాలను పరిశీలిస్తున్నారు. మొక్కుబడిగా తనిఖీలు.. ఈ బృందాల్లో కొంత మంది అధికారులు క్వారీలను నామమాత్రంగా చూసి మొక్కుబడిగా తనిఖీలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అధికారులు పరిశీలించిన ప్రతి క్వారీకి సంబంధించి, అక్కడ ఉన్న లోపాలపై అధికారులు నోటీసులు జారీ చేశారు. తాత్కాలికంగా క్వారీలను నిలుపుదల చేయాలని ఆదేశాలు ఇస్తున్నారు. తనిఖీ బృందాలు వస్తున్నాయనే సమాచారంతో క్వారీ యజమానులు ముందుగానే క్వారీల్లో పనులను నిలిపివేసినట్లు సమాచారం. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లకూ తావు లేకుండా కఠినంగా చర్యలు తీసుకొంటే 90 శాతానికి పైగా క్వారీలు మూతపడక తప్పదని ప్రత్యేక బృందాలలోని ఓ అధికారి పేర్కొనడం గమనార్హం. ఈ నేపథ్యంలో ప్రత్యేక బృందాల తనిఖీల నివేదిక ఆధారంగా కలెక్టర్ ఎటువంటి చర్యలు తీసుకొంటారనేది వేచిచూడాలి. ఇప్పటికే కొంత మంది క్వారీ యజమానులు అధికార పార్టీ పెద్దల దృష్టికి సమస్యను తీసుకెళ్లి, గండం నుంచి గట్టెక్కించాలని కోరినట్లు జిల్లాలో చర్చ జరుగుతోంది. çప్రమాద సంఘటనలు జరిగినప్పుడు అధికారులు ఇలాంటి హడావుడి చేయడం మామూలేనని, కొంతకాలం గడిస్తే మళ్లీ యథాతథమే అవుతుందని వారికి నేతలు భరోసా ఇస్తున్నారని తెలుస్తోంది.