రామంతపూర్‌లో పబ్లిక్‌స్కూల్ పక్కన గుడిసెపై కూలిన గోడ ఇదే..
పొట్టకూటి కోసం కన్నవాళ్లను, సొంతూరును విడిచిపెట్టి పట్నం పోయిన ఆ కుటుంబంలో వలస తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి ఓ పాతగోడ కూలి రేకుల గుడిసెపై పడటంతో కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన నలుగురు ఒకే కుటుంబసభ్యులు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
-
హైదరాబాద్‌లో భారీ వర్షానికి గుడిసెపై కూలిన పాతగోడ
-
శిథిలాల కింద చిక్కుకుని నలుగురు దుర్మరణం
-
మృతులందరూ ఒకే కుటుంబానికి చెందినవారు
-
మొలచింతలపల్లిలో విషాదఛాయలు
పొట్టకూటి కోసం కన్నవాళ్లను, సొంతూరును విడిచిపెట్టి పట్నం పోయిన ఆ కుటుంబంలో వలస తీవ్ర విషాదాన్ని నింపింది. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి ఓ పాతగోడ కూలి రేకుల గుడిసెపై పడటంతో కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన నలుగురు ఒకే కుటుంబసభ్యులు మృత్యువాతపడ్డారు. ఈ సంఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని నింపింది.
– కొల్లాపూర్ రూరల్
కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లికి చెందిన వలస కూలీ ముష్టి బాలస్వామి(45), చెన్నమ్మ (40)భార్యభర్తలు, వీరికి ఓ కూతురు, ఇద్దరు కుమారులున్నారు. స్థానికంగా ఉపాధి లేకపోవడంతో బాలస్వామి 20ఏళ్ల క్రితం వలస వెళ్లాడు. తరుచుగా గ్రామంలో పండగల కోసం వచ్చేవాడు. రెండు నెలల క్రితం గ్రామంలో గ్రామదేవత ఉత్సవాల కోసం కూడా కుటుంబసమేతంగా మొలచింతలపల్లికి వచ్చి వెళ్లాడు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని రామాంతపూర్ పబ్లిక్‌స్కూల్ పక్కన చిన్న రేకుల గుడిసెలో బాలస్వామి కుటుంబసభ్యులతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం అర్ధరాత్రి భారీ వర్షం పడటంతో పక్కనే ఉన్న బిల్డింగ్‌కు చెందిన పాత గోడ కూలి వారు నివాసం ఉంటున్న రేకుల గుడిసెపై పడింది. దీంతో గాఢ నిద్రలో ఉన్న బాలస్వామి, ఆయన భార్య చెన్నమ్మతో పాటు కుమార్తె పార్మతమ్మ (18), పెద్ద కుమారుడు శేఖర్(14) శిథిలాల కింద చిక్కుకుని, మృత్యువాతపడ్డారు. ఈ విషయం గ్రామంలో దావానంలా వ్యాపించడంతో మొలచింతలపల్లి విషాదఛాయలు అలుముకున్నాయి. గ్రామంలోని మృతుడు బాలస్వామి ఇంటి వద్ద ఉంటున్న తల్లి లక్ష్మమ్మ ఈ వార్త విని బోరున విలపిస్తూ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయింది. అయితే బాలస్వామి చిన్న కుమారుడు వెంకటేశ్ తన అత్తవద్ద చెన్నారంలో ఉండిపోవడంతో ఈ ప్రమాదం నుంచి బయటపడ్డాడు.
పలువురి పరామర్శ..
బాలస్వామి తల్లి లక్ష్మమ్మను పలువురు రాజకీయ నాయకులు, గ్రామస్తులు పరామర్శించారు. జస్టిస్ చంద్రకుమార్ ఆమెను ఓదార్చి, స్థానికులతో ఆ కుటుంబ నేపథ్యాన్ని అడిగి తెలుసుకున్నారు. హైకోర్టు న్యాయవాది శారదగౌడ్, నవ నిర్మాణ వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మురళీధర్‌గుప్త, ప్రజా వాగ్గేయకారుడు రాజారాంప్రకాశ్, స్థానిక సర్పంచ్ హైమావతి, మాజీ సర్పంచ్ కొమ్మ వెంకటస్వామి, తదితరులు ఆమెను పరామర్శించారు. మృతుడి కుటుంబానికి ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.
రెండు నెలల క్రితమే ఊరికి వచ్చారు
గ్రామదేవత పండగ కోసం నాకొడుకు, కోడలితో పాటు కుటుంబం మొత్తం రెండు నెలల క్రితం ఊరికి వచ్చిపోయారు. ప్రతినెలా నాకు బతకడానికి డబ్బులు పంపించేవాడు. నన్ను బతికించాల్సిన నా కొడుకు, కోడలు, వారి పిల్లలు చనిపోవడంతో నాకు దిక్కులేకుండా పోయింది. ఈ గుండెకోత తట్టుకోలేను.
– లక్ష్మమ్మ, బాలస్వామి తల్లి