అమెరికాలో ఆటా ఉత్స‌వాలు | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఆటా ఉత్స‌వాలు

Published Sat, Jul 2 2016 10:10 AM

American Telugu Association set to host an epic telugu convention in chicago

చికాగో : అమెరికా తెలుగు అసొసియేష‌న్ (ఆటా) ర‌జ‌తోత్స‌వాలకు స‌ర్వం సిద్ధ‌మయింది. ఆటా ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హిస్తున్న ఈ వేడుక‌లు ఇల్లినాయిస్ రాష్ట్రంలోని చికాగో కేంద్రంగా ప్రారంభం కానున్నాయి. భార‌తీయ కాల మానం ప్ర‌కారం శ‌నివారం తెల్ల‌వారుజామున వేడుక‌లు మొద‌లుకానున్నాయి. 1990లో అమెరికాలోని ప్ర‌వాస తెలుగు ప్ర‌జ‌ల కోసం ఏర్ప‌డిన ఆటా పాతికేళ్లు పూర్తి చేసుకున్నందున ఈ సారి ఘ‌నంగా ర‌జ‌తోత్స‌వ వేడుక‌లు జ‌రుప‌నున్నారు.

చికాగోలోని రోజ్‌మంట్ డొనాల్డ్ ఇ స్టీఫెన్స్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ వేదిక‌గా జ‌రుగనున్న ఈ ఉత్స‌వాల‌లో తెలుగు ఎన్నారైలతో పాటు ప‌లు రంగాల‌కు చెందిన తెలుగు ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు పాల్గొనున్నారు.  తెలుగు సంప్రదాయాన్ని, విశిష్టతను, మాతృభాషను, మమకారాన్ని అమెరికా గ‌డ్డ మీద పంచేలా కార్య‌క్ర‌మాలు ఏర్పాటు చేశారు.

సాహిత్య, సామాజిక, సినీ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఇప్ప‌టికే షికాగో చేరుకున్నారు. 8 ల‌క్ష‌ల చ‌ద‌రపు అడుగుల భారీ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ లో వేర్వేరు రంగాల‌కు సంబంధించిన స్టాళ్లు ఏర్పాటు చేశారు. రంగుల హరివిల్లును మరిపించే అలంకారాలు, అందాలతో రాజిల్లే షాపింగ్ ఏరియా ఇందులో ఉన్నాయి. వీటికి అద‌నంగా ఐటీ పార్కు, జాబ్ ఫేర్ కూడా ఉత్స‌వాల్లో ఏర్పాటు చేశారు.

విజ్ఞానము వికాసం, ఆరోగ్యం, వేదాంతం.. ఒక‌టేంటీ.. తెలుగు వారంద‌రికి ఉప‌యోగ‌ప‌డే విధంగా క‌న్వెన్ష‌న్ సెంట‌ర్ తీర్చిదిద్దారు. ఆటా కార్య‌వ‌ర్గంలోని 27 మంది బోర్డు ఆఫ్ ట్ర‌స్టీలు, వంద‌లాది మంది వాలెంట‌ర్లు క‌న్వెన్ష‌న్‌కు వ‌స్తున్న తెలుగు అతిథులకు ఘ‌న‌స్వాగ‌తం ప‌లికేందుకు ఏర్పాట్లు చేశారు. తెలుగు రుచిని మరిపించేలా విందు భోజనం, అల్పాహారాలు అతిథుల కోసం సిద్ధం చేశారు.

ఆటా అధ్య‌క్షుడు సుధాక‌ర్ పేర్క‌రీ మాట్లాడుతూ, అమెరికాలో ఉన్న తెలుగు ప్ర‌జ‌లు, వ‌చ్చిన అతిథులకు ఎప్ప‌టికి గుర్తుండేలా ఏర్పాట్లు చేశాం. ర‌జ‌తోత్స‌వాలు చిర‌స్మ‌ర‌ణీయంగా ఉండేలా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. కేంద్ర‌మంత్రి వెంక‌య్య నాయుడు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాజ‌కీయ ప్ర‌ముఖులు, వ్యాపార‌, క‌ళా రంగాల‌కు చెందిన ప్ర‌ముఖులు ఇప్ప‌టికే వ‌చ్చారు. గ‌తం కంటే మ‌రింత అద్భుతంగా వేడుక‌లు నిర్వ‌హిస్తామన్నారు. ప‌రమేశ్ భీంరెడ్డి, ట్ర‌స్టీ స‌భ్యులు  మాట్లాడుతూ అమెరికా కాల‌మానం ప్ర‌కారం శుక్ర‌వారం సాయంత్రం బ్యాంకెట్ డిన్న‌ర్‌తో కార్య‌క్ర‌మం మొద‌ల‌వుతుందన్నారు. వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌ముఖుల‌ను స‌త్క‌రిస్తామన్నారు.


వైఎస్ఆర్ సీపీ అధికార ప్ర‌తినిధి  అంబటి రాంబాబు మాట్లాడుతూ...అమెరికా తెలుగు అసొసియేష‌న్ పాతికేళ్లు పూర్తి చేసుకుని ర‌జ‌తోత్స‌వం జ‌రుకుంటున్న వేళ శుభాకాంక్ష‌లు. ఈ వేడుక‌ల‌కు హాజ‌రు అవుతున్న తెలుగు ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు. అమెరికా సంయుక్త రాష్ట్రల్లో ఉన్న ల‌క్ష‌లాది మంది తెలుగు వాళ్లు మ‌రిన్ని విజ‌యాలు సాధించాల‌ని కోరుకుంటున్నామన్నారు. వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే
శ్రీ‌కాంత్ రెడ్డి మాట్లాడుతూ విదేశీ గ‌డ్డ‌పై తెలుగు ప్ర‌జ‌లు సాధిస్తున్న విజ‌యాలు చూసి సంతోషిస్తున్నాం. పార్టీ నేత‌లు, పార్టీ కార్య‌కర్త‌ల‌తో పాటు, యూత్ వింగ్ స‌భ్యులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల‌కు ప్ర‌వాస భార‌తీయులు తోడుగా నిల‌వాల‌ని కోరుకుంటున్నామన్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement