ఫేస్‌బుక్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. | Young Man Commits Suicide Attempt in Srikakulam | Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని..

Dec 4 2018 7:50 AM | Updated on Dec 4 2018 7:50 AM

Young Man Commits Suicide Attempt in Srikakulam - Sakshi

పరామర్శిస్తున్న సమన్వయకర్త డాక్టర్‌ సీదిరి అప్పలరాజు (ఇన్‌సెట్లో) సీరపు రాఖేష్‌

శ్రీకాకుళం అర్బన్‌, కాశీబుగ్గ: ఫేస్‌ బుక్‌లో తప్పుడు ప్రచారం చేస్తున్నారని మనస్తాపం చెందిన ఓ యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన పలాస మండలంలో   చోటుచేసుకుంది. శాసనాం గ్రామానికి చెందిన సీరపు రాఖేష్‌ (27) సోమవారం సాయంత్రం తన ఇంట్లోని బాత్‌రూంలో పినాయిల్‌ తాగి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, స్నేహితులు అతన్ని పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాశీబుగ్గకు చెందిన టి.శ్రీను, ఐ.సందీప్‌లకు రాఖేష్‌తో విభేదాలు ఉన్నాయి. ఆదివారం రాత్రి కూడా పలాసలోని ఓ డాబా వద్ద వీరు గొడవ పడ్డారు. ఈ క్రమంలోనే ప్రత్యర్థులు రాఖేష్‌ రౌడీ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టులు పెట్టడంతో అతను తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు.

దీంతో చచ్చిపోవాలని భావించాడు. తన చావుకు టి.శ్రీను, ఐ.సందీప్‌లు కారణం మంటూ రాఖేష్‌ కూడా ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ పెట్టాడు. అనంతరం ఇంట్లోనే ఫినాయిల్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు చూసి వెంటనే పలాస ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే పరిస్థితి విషమించడంతో  శ్రీకాకుళంలోని రిమ్స్‌ ఆస్పత్రి వైద్యులు రిఫర్‌ చేశారు. కుటుంబ సభ్యులు మాత్రం రాఖేష్‌ను  పలాసలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కాశీబుగ్గ ఎస్సై ఎంవీఎస్‌ ప్రసాదరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న రాఖేష్‌ను  పలాస నియోజకవర్గ వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త డాక్టర్‌ సీదిరి అప్పలరాజు పరామర్శించారు. కాగా ఆత్మహత్యకు పాల్పడిన రాఖేష్‌ను ప్రత్యర్థివర్గంలోని ఓ యువకుడు రిపోర్టర్‌ పేరుతో బెదిరించినట్లు తెలిసింది. ఓ ప్రైవేటు టీవీ చానల్‌లో స్టాఫ్‌ రిపోర్టర్‌గా పని చేస్తున్నానని, పోలీసులతో చెప్పి రౌడీషీట్‌ తెరిపిస్తానని బెదిరించినట్టు తెలిసింది. అలాగే తమ పార్టీ అండదండలు ఉన్నాయని కూడా బెదిరించినట్టు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన రాఖేష్‌ చనిపోవాలని భావించి ఆఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement